Share News

భళా...బాల

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:05 AM

రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ ప్రాంతానికి చెందిన 9ఏళ్ల చింతా అనన్య చదరంగం పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది.

భళా...బాల

చెస్‌లో సత్తాచాటుతున్న అనన్య

రాజమహేంద్రవరం సిటీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ ప్రాంతానికి చెందిన 9ఏళ్ల చింతా అనన్య చదరంగం పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది. వరుస విజయాలు కైవసం చేసుకుంటూ అదరగొడుతోంది. తన ఏడో ఏటనే చెస్‌ అకాడమీలో శిక్షణలోకి ప్రవేశించిన ఈమె ఏడాది కాలంలోనే 40 టోర్నమెంట్లు ఆడింది. తన తండ్రి చింతా సత్యనారాయణ కూడా చదరంగం ప్లేయర్‌ కావడంతో అతడి స్ఫూర్తితో ఈ ఆటలోకి అడుగుపెట్టింది. దురదృష్టవశాత్తూ ఆమె తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తండ్రి మరణం కుంగదీసినా ఆయన ఆశయాన్ని నిలబెట్టేందుకు తల్లి కళ్యాణి తన కుమార్తెను చందరంగంలో ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో 15 టోర్నమెంట్‌ల్లో పాల్గొన్న అనన్య ఐదు టోర్నమెంట్లలో విజేతగా నిలిచి రాజమహేంద్రవరం కీర్తిని ఇనుమడింపజేసింది. భవిష్యత్తులో ఈ చిన్నారిని ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో కూడా ఆడే సత్తా ఉంది.

సాఫ్ట్‌ బాల్‌ పోటీల్లో గ్రేట్‌

కరప, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఆమె సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో రాణిస్తూ సత్తా చాటుతోంది. చిన్నప్పటినుంచి క్రీడలపై ఉన్న మక్కువతో ఓపక్క చదువులో రాణిస్తూ తనకిష్టమైన సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరుస్తోంది. ఆమె కాకినాడ జిల్లా కరప మండలం పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన పెద్దిరెడ్ల సాయిసింధూజ. గత ఐదేళ్లలో పలు జాతీయస్థాయిలో పోటీల్లో రాష్ట్ర జట్టు తరపున పాల్గొని పలు పతకాలను సాధించింది. పెద్దాపురప్పాడు జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ జిల్లా సాఫ్ట్‌బాల్‌ చరిత్రలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఆమె జిల్లా జట్టు తరపున 17 రాష్ట్రస్థాయి పోటీల్లోను, 23 జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పలు ట్రోఫీలు సొంతం చేసుకుంది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, తెలంగాణా, మధ్యప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో జాతీయస్థాయి క్రీడా పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో రాష్ట్ర జట్టు విజయం సాధించేందుకు దోహదపడింది. 2020లో చైనాలో జరిగిన సాఫ్ట్‌బాల్‌ అండర్‌-17 ఆసియా కప్‌లో మన దేశం తరపున ప్రాతినిఽథ్యం వహించింది. వ్యాయామ ఉపాధ్యాయుడు బీవీవీఎస్‌ ప్రసాద్‌ శిక్షణలో జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం సాయి సింధూజ స్పోర్ట్స్‌ కోటాలో నూజీవీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. తల్లిదండ్రులు దయకుమార్‌, పద్మావతి, పీడీ ప్రసాద్‌ ప్రోత్సాహంతో సాఫ్ట్‌బాల్‌ క్రీడల్లో రాణిస్తున్నానని, భవిష్యత్తులో పోలీసుశాఖలో ఉద్యోగం సాధించి ప్రజలకు సేవలు చేయాలన్నది తన ఆకాంక్షని సాయి సింధూజ తెలిపింది.

యోగాలో రాణిస్తున్నాడు..

సామర్లకోట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): పదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో ఎక్కడ యోగా పోటీలు జరిగినా అవార్డులు సాధిస్తున్నాడు. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణ పరిధిలో అయోధ్యరామపురం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో కిలారి యశ్వంత్‌ పదోతరగతి చదువుతున్నాడు. అతడు ఆరో తరగతి నుంచీ తన తండ్రి కిలారి వీరబాబు వద్దే యోగాసనాలపై ఆసక్తితో శిక్షణ పొందాడు. ఏడో తరగతి నుంచి జిల్లాలోనూ, పొరుగు జిల్లాలైన పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖ వంటి పలు జిల్లాలో జూనియర్స్‌ యోగాసనాల పోటీల్లో పాల్గొన్నాడు. ఏ పోటీలో పాల్గొన్నా ప్రథమ బహుమతిని కైవసం చేసుకోవడం విశేషం. అతడి తండ్రి ఆటోడ్రైవర్‌ అయినా యోగాసనాలు వేయడంలో ఎంతో పేరుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఒడిశా, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన పలు జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొని అత్యద్భుత ప్రతిభ కనబర్చి సభికులను, న్యాయనిర్ణేతలతో శెభాష్‌ అనిపించేలా యోగాసనాలు ప్రదర్శిస్తున్నాడు. అంతర్‌జిల్లాలస్థాయిలో భీమవరం, నరసాపురం, విజయవాడ, కాకినాడ, బిక్కవోలు తదితర ప్రాంతాల్లో జరిగిన యోగా పోటీల్లో పాల్గొని ప్రథమ బహుమతులు పొందానని యశ్వంత్‌ తెలిపాడు. తన పాఠశాల ప్రదానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణతోపాటు తల్లిదండ్రులు వీరబాబు, అన్నపూర్ణ ప్రోత్సాహంతో తాను అవార్డులు దక్కించుకోగలుగుతానని అతడు చెప్తున్నాడు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

కాకినాడ అర్బన్‌, నవంబరు 13: కాకినాడ రూరల్‌ రమణయ్యపేట మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కె.ముత్యాల ముఖేష్‌, జె.అభిరామ్‌, సీహెచ్‌ ప్రేమ్‌కుమార్‌ సిమ్మింగ్‌, జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో తమ సత్తా చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 5నుంచి 7వరకు పల్నాడు జిల్లా నరసారావుపేటలో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో అండర్‌-17 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగంలో కె.ముత్యాలముఖేష్‌ ద్వితీయస్థానం సాధించాడు. డిసెంబరులో గుజరాత్‌లో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో జె.అభిరామ్‌, సీహెచ్‌ ప్రేమ్‌కుమార్‌ అండర్‌-17 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి డిసెంబరులో కోల్‌కత్తాలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల హెచ్‌ఎం సీబీవీ నాగేశ్వరరావు, పీఈటీ ఎస్‌కే అలీమ్‌పాషా ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో బెస్ట్‌

చింతూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఈ బాలిక మట్టిలో మాణిక్యం. వెయిట్‌ లిఫ్టింగ్‌లో అసమాన ప్రతిభ కనబరుస్తూ అబ్బుర పరుస్తోంది. ప్రస్తుతం +87 కేటగిరిలో తన సత్తాచాటుతోంది. ఇప్పటికే సబ్‌జూనియర్‌, జూనియర్‌ విభాగాల్లో 37 పతకాలను సొంతం చేసుకుంది. వాటిలో రాష్ట్రస్థాయిలో 36, జాతీయస్థాయిలో ఒక పతకం సాధించింది. అనకాపల్లి, ఏలూరు, జగ్గయ్యపేట, విజయనగరం, కర్నూలు తదితర కేంద్రాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మధుచందన తన సత్తాచాటి 18 బంగారం, 10 రజతం, 8 కాంస్యం పతకాలు సాధించింది. 2023లో బీహార్‌లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించింది. త్వరలో కృష్ణాజిల్లాలో నిర్వహించనున్న అండర్‌-19 స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ తీసుకొంటోంది.

మధ్య తరగతి కుటుంబమే..

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన మధుచందన స్థానిక కస్తూర్బా బాలికల కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సవరం చదువుతోంది. తండ్రి గుత్తుల శ్రీనివాసరావు. వీరిది దిగువ మధ్య తరగతి కుటుంబం. రోడ్డు పక్కన బజ్జీల బండే జీవనాధారం. మధుచందనకు వెయిట్‌ లిఫ్టింగ్‌లో రాణించాలన్న బలమైన కోరిక ఉంది. ఆర్థికలేమి వెనక్కు లాగుతున్నా ఆశయం కోసం ఆమె అహర్నిశలు కష్టపడుతోంది. 2017 నుంచే మధుచందన వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటోంది. చింతూరులోని శ్రీ వీరభద్ర పవర్‌ జిమ్‌ ఆమె శిక్షణ కేంద్రం. ఆది నుంచి జిమ్‌ యజమాని గోలి గంగాధర్‌ ఆమెకు శిక్షణ ఇస్తున్నారు. ఈమె కుటుంబ ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న అతడు ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు.

లిటిల్‌ గ్రాండ్‌ మాస్టర్‌

కార్పొరేషన్‌(కాకినాడ), నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రాండ్‌ మాస్టర్‌ అవ్వాలన్నది అతడి లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నిస్తూ చెస్‌లో ఆ బాలుడు విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 50వరకు పతకాలు సాధించి.. జాతీయస్థాయిలోను మూడు బంగారు పతకాలతో ఆకట్టుకుంటున్నాడు. కాకినాడకు చెందిన సూరాడ యశస్వి సత్యగంగాధర్‌ కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి శ్రీనివాసరావు కాకినాడ ఇంటెలిజెన్స్‌ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్నారు. తల్లి మహాలక్ష్మి గృహిణి.

చెస్‌పట్ల మక్కువతో..

యశస్వికి చెస్‌పట్ల ఎప్పటినుంచో ఆసక్తి ఎక్కువ. దీన్ని గమనించిన తల్లిదండ్రులు అతడికి కేవీ ప్రసాద్‌ వద్ద కోచింగ్‌ ఇవ్వడం ప్రారంభించారు. అలా అతడు అనేక టోర్నమెంట్‌లో పాల్గొంటూ వెళ్లిన ప్రతిచోట విజయం సాధిస్తున్నాడు. కేంద్రీయ విద్యాలయ స్కూల్‌ తరపున నేషనల్‌లో వరుసగా మూడు బంగారు పతకాలు సాధించాడు. మూడుసార్లు స్కూల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఎంపికయ్యాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే అనేక చెస్‌ టోర్నమెంట్‌లో ఎన్నో బహుమతులు పొందాడు. స్టేట్‌ లెవల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో అనేక పతకాలు సాధించాడు. 2018 నుంచి 2024 వరకు చెస్‌లో ఇప్పటివరకు 50 పతకాలు సాధించాడు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ఐ అండర్‌-17 చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొని ఆడుతున్నాడు. గంగాధర్‌కి చెస్‌ ఫిడే రేటింగ్‌ 1918గా ఉంది. ఇప్పటివరకు 15 బంగారు పతకాలు పొందాడు. గ్రాండ్‌ మాస్టర్‌ కావాలనుకుంటున్న ఈ బాలుడికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం..

ఇంగ్లిష్‌లో మేటి ఈ బుడతడు

సామర్లకోట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ చిన్నారి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతూ దుమ్ముదులుపుతున్నాడు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే రెండో తరగతి చదువుతూ పలక సైతం పూర్తిగా పట్టుకోలేని ప్రాయంలో ఆంగ్ల ప్రసంగం చేస్తూ.. స్వాత్రంత్య దినోత్సవ చరిత్రను ఐదు నిమిషాలపాటు అనర్గళంగా ఉపన్యసించి పాఠశాల విద్యార్థులనే కాదు అధ్యాపక బృందాన్ని సైతం అబ్బురపరిచారు. ఆ బాలుడు సామర్లకోట మండలం గొంచాల గ్రామానికి చెందిన కొల్లా జీవన్‌కుమార్‌. అతడు ఇదే గ్రామంలో మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువున్నాడు. అతడి ఆంగ్ల ప్రసంగం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో రాష్ట్ర స్థాయిలో ప్రాచుర్యం పొందాడు. ఈ బుడతడి ఆంగ్ల ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాల్లో వీక్షించిన అప్పటి పెద్దాపురం డీఎస్పీ కె.లతాకుమారి స్వయంగా అభినందించి నగదుతోపాటు కొన్ని ఆట వస్తువులను బహుమతులుగా అందజేశారు.

కుస్తీలో సూపర్‌ టాలెంట్‌

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉషు పోటీల్లో రాజమహేంద్రవరం నన్నయ మున్సిపల్‌ స్కూల్‌ విద్యార్థిని పి.శిశ్రుత అత్యుత్తమ ప్రతిభ చాటుతోంది. నన్నయ మున్సిపల్‌ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న ఆమె రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ కబర్చి పలు పతకాలు సాధించారు. శ్రీకాకుళంలో జరిగిన 68వ ఏపీ ఎస్‌జీఎఫ్‌ ఇంటర్‌ డిస్ర్టిక్ట్‌ ఉషు చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. గతేడాది స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌లో భాగంగా జరిగిన బాక్సింగ్‌లో కాంస్య పతకం అందుకుంది. ఇంటర్‌ అసోసియేషన్‌ మీట్‌ నేషనల్‌ బాక్సింగ్‌ పోటీల్లో 38కిలోల విభాగంలో(రూరల్‌ గేమ్స్‌ విభాగం) ఆమె బంగారు పతకం సాఽధించింది.

పెన్సిల్‌ పొట్టుతో చాచా నెహ్రూ పటం

మండపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మండపేట సంఘం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాల చిన్నారులు చాచా నెహ్రూ చిత్రపటాన్ని పెన్సిల్‌ పొట్టుతో తయారు చేశారు. ఈనెల 14న ఆయన జయంతిని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు పెన్సిల్‌ పొట్టును నిల్వ చేసి నెహ్రూ చిత్రపటం తయారీకి ఉపయోగించారు. ఐదో తరగతి విద్యార్థినులు తేజస్విని, అలేఖ్య, విషిత, భవాని అరగంటపాటు బుధవారం శ్రమించి చిత్రపటాన్ని తయారు చేశారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 01:05 AM