Share News

ఈ గ్రంథాలయం సంగతేంటి?

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:02 AM

పట్టణ హోదా పొందింది. అన్ని ప్రాంతాల్లో రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరితే ఉన్న గ్రంథాలయాన్ని మూసివేసి పాఠకులకు పత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేకుండా చేశారు. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. గ్రంథాలయ పన్ను మాత్రం

ఈ గ్రంథాలయం సంగతేంటి?
గొల్లప్రోలులో గతంలో నగర పంచాయతీ గ్రంథాలయం నిర్వహించిన భవనం

గొల్లప్రోలులో గ్రంథాలయం లేక ఇక్కట్లు

గ్రంథాలయ పన్ను మాత్రం వసూలు

తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి

విస్మరించిన పాలకులు

పట్టణ హోదా పొందింది. అన్ని ప్రాంతాల్లో రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరితే ఉన్న గ్రంథాలయాన్ని మూసివేసి పాఠకులకు పత్రికలు, పుస్తకాలు అందుబాటులో లేకుండా చేశారు. తొమ్మిదేళ్లుగా ఇదే పరిస్థితి. గ్రంథాలయ పన్ను మాత్రం క్రమం తప్పకుండా వసూలు చేస్తున్నారు. దానిపై ఉన్న శ్రద్ధ లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటుపై లేకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.

గొల్లప్రోలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీగా ఉన్న గొల్లప్రోలు పట్టణ హోదా పొంది 13 ఏళ్లు కావస్తోంది. పంచాయతీ కంటే మెరుగైన సౌకర్యాలు వస్తాయనుకుంటే పన్నుల బాదుడు మినహా కలిగిన సదుపాయం ఒక్కటి కనబడటం లేదు. ఒకప్పుడు జిల్లాలో ఉత్త మైన లైబ్రరీగా గొల్లప్రోలు పూర్వ పంచాయతీ గ్రంథాలయానికి గుర్తింపు ఉండేది. ఇక్కడ అన్నిరకాల పుస్తకాలు అందుబాటులో ఉండేవి. ఎక్క డైనా పంచాయతీల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఇక్కడకు వచ్చి పరిశీలన జరిపేవారు. అప్పట్లోనే గొల్లప్రోలు గ్రంథాలయంలో నిత్యం వచ్చే దినపత్రికలతో పాటు వార, మాసపత్రికలు, అన్నిరకాల కాంపిటేటివ్‌ బుక్స్‌ను ఇక్కడ ఉంచేవారు. ఏ పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే వారైనా ఈ లైబ్రరీకి వచ్చి పుస్తకాలను రిఫర్‌ చేసుకునేవారు. అదేవిధంగా నామమాత్రపు రుసుము చెల్లించి సభ్యత్వం పొందిన వారికి పుస్తకాలను ఇంటికి తీసుకువెళ్లే సౌలభ్యం ఉండేది. నాలుగు దశాబ్దాలు పాటు ఎంతోమందికి ఇది ఆసరాగా నిలిచింది. ఇక్కడ కాంపిటేటివ్‌ బుక్స్‌ చదివిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు.

లైబ్రరీ నిర్వహణపై అనాసక్తి

తొలుత గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలోనే ఉండే ఈ లైబ్రరీని పట్టణ హోదా పొందిన తర్వాత నగరపంచాయతీ కార్యాలయానికి చోటుసరిపోవడం లేదంటూ పూర్వ ఆంధ్రా బ్యాంకు ఎదురుగా మెయిన్‌రోడ్డులో గల భవనంలోకి మార్పు చేశారు. తదనంతరం నగరపంచాయతీ గ్రంథాలయం కొనసాగినా కొత్త పుస్తకాలు కొనుగోలు నిలిపివేశారు. తదనంతరం లైబ్రరీ నిర్వహణపై ఆసక్తి చూపడం మానివేశారు. ఇక్క డ ఉన్న కాంట్రాక్టు సిబ్బందిని ఆఫీసు అవసరాలకు వినియోగించుకుంటూ అప్పుడప్పుడు మాత్ర మే లైబ్రరీ తెరిచేవారు. తొమ్మిదేళ్ల క్రితం భవనం శిథిలావస్థలో ఉన్నదన్న సాకుతో మొత్తం లైబ్రరీనే మూసివేసి అందులో పుస్తకాలను అక్కడే వదిలివేశారు. కాలక్రమంలో భవనం పూర్తిగా శిథిలమైందంటూ దానిని తొలగించి అన్నక్యాంటీన్‌ నిర్మాణానికి అప్పగించారు. ప్రస్తుతం అక్కడ భవన పనులు ఆరేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.

కొత్తవి ఏర్పాటు చేస్తారనుకుంటే...

సాధారణంగా పట్టణాలు, నగరాల్లోని ప్రధానమైన ప్రాంతాల్లో ప్రజలకు అన్నిరకాల దినపత్రికలు, పుస్తకాలు, కాంపిటేటివ్‌ బుక్స్‌ అందుబాటులో ఉండే విధంగా రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా గ్రామం నుంచి పట్టణంగా మారిన గొల్లప్రోలులోనూ కొత్తగా రీడింగ్‌ రూమ్‌ లు ఏర్పాటవుతాయని ప్రజలు ఆశించారు. అందుకు భిన్నంగా ఉన్న లైబ్రరీని నగరపంచాయతీ అధికారులు మూసివేశారు. అందులో ఉన్న విలువయిన పుస్తకాలను చెదలు పట్టేలా చేశారు. గ్రంథాలయాన్ని తిరిగి తెరిపించాలని, పట్టణంలో కనీసం 3రీడింగ్‌ రూమ్‌లు కొత్తవి ఏర్పాటు చేయాలని, అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలని పలుమార్లు పట్టణంలోని యువతీ, యువకులు, పాఠకులు నగరపంచాయతీ అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం లేకపోయింది. నగరపంచాయతీ పాలకులు ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించారు.

ప్రజాప్రతినిధుల స్పందించాలి

నగరపంచాయతీ గ్రంథాలయం ఏర్పాటుకు పూర్వ గొల్లప్రోలు పీహెచ్‌సీ భవనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణంలో కనీసం 2 లేదా 3 ప్రాంతాల్లో గ్రంథాలయం కమ్‌ రీడింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పోటీపరీక్షల పుస్తకాలను అందుబాటులో ఉంచా లనే డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహణలో ఉన్న శాఖా గ్రంథాలయం పట్టణ ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నది. ప్రజాప్రతినిధులు, నగరపంచాయతీ అధికారులు స్పందించి గొల్లప్రోలు పట్టణంలో గతంలో ఉన్న నగరపంచాయతీ గ్రంథాలయాన్ని పునరుద్ధరించడంతో పాటు ప్రధానమైన ప్రాంతాల్లో రీడింగ్‌ రూమ్‌లు ఏర్పా టు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:02 AM