అంతిమ సంస్కారానికి అగచాట్లు
ABN , Publish Date - Sep 15 , 2024 | 12:30 AM
గొల్లప్రోలు, సెప్టెంబరు 14: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని అరుంధతీయపేట, ఎస్సీ కాలనీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే వీలు లేక మృతదేహాన్ని డంపింగ్‌యార్డులో ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుంధతీయపేటకు చెందిన అడ్డాల అప్పయ్యమ్మ (55) శనివారం మరణించింది. కొద్ది
డంపింగ్ యార్డులో మృతదేహం ఖననం
శ్మశాన వాటికలో సౌకర్యాలు కల్పించాలంటూ
అరుంధతీయపేట వాసుల రాస్తారోకో, ధర్నా
గొల్లప్రోలు, సెప్టెంబరు 14: కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని అరుంధతీయపేట, ఎస్సీ కాలనీ శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించే వీలు లేక మృతదేహాన్ని డంపింగ్‌యార్డులో ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అరుంధతీయపేటకు చెందిన అడ్డాల అప్పయ్యమ్మ (55) శనివారం మరణించింది. కొద్ది రోజులుగా ఏలేరు, సుద్దగడ్డ వరద నీరు అరుంధతీయపేట, ఎస్సీ కాలనీ పరిసరాల్లో ప్రవహించడంతో పాటు గృహాలు ముంపునకు గురయ్యాయి. స్మశానవాటికలోకి కూడా వరద నీరు చేరింది. దీనితో అప్పయ్యమ్మ మృతదేహాన్ని ఖననం చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు వెళ్లగా అందుకు అవకాశం కనిపించలేదు. గోతులు తీయగా నీరు రావడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అప్పయ్యమ్మ కుటుంబసభ్యులు అడ్డాల ఏసు, శ్రీనులు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు ఆ మృతదేహాన్ని సమీపంలోని డంపింగ్‌యార్డులో ఖననం చేశారు. దీనితో అరుంధతీపేట వాసుల ఆవేదన ఆగ్రహంగా మారింది. స్మశానవాటికను అభివృద్ది చేయాలంటూ కొన్నే ళ్లుగా కోరుతున్నా నగరపంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ వారు గొల్లప్రోలులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా ఆర్అండ్బీ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. స్మశానవాటిక అభివృద్ధికి నిధులు కేటాయించామని, దశాబ్ద కాలానికి పైగా చెబుతున్నారని, ఇప్పటి వరకూ పని మాత్రం జరగలేదని వారు తెలిపారు. చనిపోయిన వారికి అంతిమసంస్కారాలు నిర్వహించేందకు అగచాట్లు పడుతున్నా ఎవ్వరి పట్టడం లేదని వారు మండిపడ్డారు. తక్షణం స్మశానవాటిక అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గంటకు పైగా సాగిన వీరి అందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనితో గొల్లప్రోలు తహసీల్దారు సత్యనారాయణ, నగరపంచాయతీ మేనేజరు రామప్రసాద్, ఏఈ ప్రభాకర్‌లు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 15రోజుల్లోగా పనులు చేపడతామని వారికి హామీ ఇచ్చారు. అప్పటి వరకూ ఇబ్బంది లేకుండా తాత్కాలిక పనులు చేపడతామని తెలిపారు. దీనితో వారు అందోళన విరమించారు.