AP News: భారీ వర్షాలతో జలాశయాలకు పోటెత్తున్న వరద.. ‘ఏలేరు’ అలర్ట్
ABN , Publish Date - Sep 09 , 2024 | 08:28 AM
రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 21 వేల క్యూసెక్కులు దాటిపోయింది. దీంతో దిగువకు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు.
కాకినాడ: రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల ప్రభావంతో ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 21 వేల క్యూసెక్కులు దాటిపోయింది. దీంతో దిగువకు 10 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల్లోని పలు మండలాలకు ముంపు ముప్పు పొంచివుంది. ఇక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ (సోమవారం) కాకినాడ వెళ్లనున్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ముంపు నష్టం లేకుండా చర్యలు చేపట్టేలా అధికారులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
సీలేరుకు భారీగా వరద..
భారీ వర్షాల ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరు, గుంటవాడ జలాశయానికి భారీగా వరద నీరు కొనసాగుతోంది. జలాశయం నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకోవడంతో జలాశయం నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. అర్ధరాత్రి సీలేరు జల విద్యుత్ కేంద్రంలోకి కొండలపై నుంచి వాగు నీరు ఉప్పొంగడంతో నీరు టర్బైన్ ఫ్లోర్‌లోకి చేరింది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తం అయ్యారు. విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ కేంద్రంలోకి ప్రవేశించిన నీటిని బయటకు తోడేందుకు జెన్‌కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 7 గేట్లను 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నాయి. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 2,04,322 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 2,58,292 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా 205.2258 టీఎంసీల నీరు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఇక తుంగభద్ర డ్యామ్ భద్రతను నిపుణుల కమిటీ ఇవాళ (సోమవారం) పరిశీలించనుంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 19వ గేట్‌తో పాటు మిగిలిన 32 గేట్ల భద్రతపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ అధ్యయనం చేయనుంది.