స్తంభించిన జనజీవనం
ABN , Publish Date - Sep 09 , 2024 | 12:50 AM
ఒకవైపు గోదావరి నదికి వరదలు.. మరోవైపు భారీ వర్షాలతో కోనసీమ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గోదావరి నదులు ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఉపాధి కరువైన లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.
లంక గ్రామాల్లోకి నీరు
ముంపునకు గురవుతున్న పొలాలు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి) ఒకవైపు గోదావరి నదికి వరదలు.. మరోవైపు భారీ వర్షాలతో కోనసీమ జిల్లాలో ప్రజా జీవనం స్తంభించిపోయింది. గోదావరి నదులు ప్రవహిస్తుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో ఉపాధి కరువైన లంక గ్రామాల ప్రజలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం కారణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వాతావరణశాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. దాంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి నుంచి వర్షం ఓ మోస్తరుగా నిరంతరాయంగా కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన అమలాపురంతో పాటు రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, కొత్తపేట వంటి ప్రాంతాలతో సహా వివిధ ప్రాంతాల్లో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలన్నీ మూతబడే ఉన్నాయి. వర్షం కావడంతో పనివారు రాకపోవడం వల్ల సంస్థలు తెరుచుకోలేదు. రానున్న రెండు, మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుండడంతో ఆ పరిస్థితిని అధిగమించేందుకు రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వర్షాల వల్ల రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. కొన్ని రోడ్లు బురదమయంగా మారి ప్రయాణానికి అసౌకర్యంగా ఉన్నాయి. ప్రధానమైన డ్రెయిన్లు, పంటకాల్వలు పొంగి ప్రవహిస్తుండడంతో సమీప ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు జలదిగ్బంధానికి గురవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉండడంతో ముంపు బారిన పడిన పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరి పంటపై కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకి రైతులకు నష్టం వాటిల్లుతోంది. ముంపునీరు దిగే మార్గం లేకపోవడంతో చేలన్నీ కుళ్లిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రొయ్యల చెరువులకు సైతం వర్షాలు చేటు తెచ్చే పరిస్థితిపై ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిలకడగా గోదావరి
గోదావరి వరద ఆదివారానికి నిలకడగా కొనసాగుతోంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద వరద స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల వల్ల నదీ ప్రవాహం నిలకడగానే కొనసాగుతుండడంతో నదీ పరివాహక లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. కోనసీమలోని వివిధ కాజ్‌వేలు జలదిగ్బంధానికి గురయ్యాయి. పాశర్లపూడి, అప్పనపల్లి, కనకాయలంక, చాకలిపాలెం, ముక్తేశ్వరం తొగరపాయ, రామరాజులంక కాజ్‌వేతో సహా అనేక ప్రాంతాల్లో ఉన్న కాజ్‌వేలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిచోట్ల లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. పి.గన్నవరం మండలంలోని వివిధ గ్రామాల నుంచి అనారోగ్యంతో ఉన్న వారిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పడవలపై తరలించి 108 ద్వారా సమీపంలోని ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు పంపిస్తున్నారు. చివరకు లంకల్లో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి జీవనాధారం కొరవడడంతో ఇళ్లకే పరిమితమైన లంక గ్రామాల ప్రజలకు ఆర్థిక కష్టాలు తీవ్రమైన నేపథ్యంలో ప్రభుత్వం బాధితులకు సహాయం అందించాలని వేడుకుంటున్నారు. నిత్యావసర సరుకులను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండు చేస్తున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్ల ప్రత్యేకంగా లంక గ్రామాలకు తాగునీటిని అందించి దాహార్తిని తీర్చాలని కోరుతున్నారు. ఒకవైపు వర్షాలు.. మరోవైపు వరదలు.. చలిగాలుల తీవ్రతతో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా కోనసీమ జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. దీనికితోడు గణేష్ నవరాత్రులు కావడం వల్ల రేవుల్లోకి వెళ్లి విగ్రహాలు నిమజ్జనాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.