ఏలేరు ఉప్పొంగితే..
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:32 AM
ఏలేరు రిజర్వాయరుకు క్రమేపీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన విశాఖ ఏజెన్సీ నుంచి వాగులు, వంకల ద్వారా ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తోంది. ఈ రిజర్వాయర్ ద్వారా మెట్టలోని 7మండలాల్లో సుమారు 53వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎం సీలు కాగా, ప్రస్తుతం 20.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా రాత్రి 8గంటల సమయా నికి ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2932 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది
ప్రాజెక్టు నీటి నిల్వ సామర్ద్యం 24.11 టీఎంసీలు
ప్రస్తుతం 20.13 టీఎంసీల వద్ద నీరు నిల్వ
1,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు, 300 క్యూసెక్కులు విశాఖకు విడుదల
ఎగువన వర్షాలు పడితే ఏలేరు ఉధృతి పెరిగే అవకాశం
ఏలేరు రిజర్వాయరుకు క్రమేపీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువన విశాఖ ఏజెన్సీ నుంచి వాగులు, వంకల ద్వారా ఇన్ ఫ్లో ఎక్కువగా వస్తోంది. ఈ రిజర్వాయర్ ద్వారా మెట్టలోని 7మండలాల్లో సుమారు 53వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎం సీలు కాగా, ప్రస్తుతం 20.13 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా రాత్రి 8గంటల సమయా నికి ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 2932 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. దీంతో పూర్తిస్థాయి నీటిమట్టం దిశగా వరద వస్తుండడంతో అధికారులు బుధవారం సాయంత్రం దిగువకు 1,000 క్యూసెక్కుల వరద నీరు విడిచిపెట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అవస రాలకు 300 క్యూసెక్కులు పంపుతున్నారు. ఇప్పుడు రిజర్వాయరు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకుం టుండడంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్లు కిందకు వదిలేయాల్సిన పరిస్థితి. ఏలేరు ప్రాజెక్టుకు వరద ఇంకా పెరిగితే ఏఏ మండలాల్లో పరిస్థితి ఏంటనే దానిపై ప్రత్యేక కథనం..
కాకినాడ, (ఆంధ్రజ్యోతి)/ఏలేశ్వరం
ఏలేరు రిజర్వాయరు నియమావళి ప్రకారం నీటినిల్వ 23 టీఎంసీలు దాటితేనే వరద నీరు ఎంత ఇన్‌ఫ్లో ఉంటే అంత దిగువకు వదలాలి. దీనివల్ల ప్రతిసారీ నష్టం భారీగా ఉం టోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ షాన్‌మోహన్ చొరవ తీసు కుని కొంత వరద నీటిని ముందునుంచే దిగువకు వదలాల ని ఆదేశించారు. వరద ప్రవాహం కాలువలకు పెరుగుతుండ డంతో జిల్లాలో ఏలేరు కాలువ వెంబడి ఉన్న ఏలేశ్వరం, ప్రత్తిపాడు, జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట మండలాల పరిధిలో గ్రామాల్లో ప్రజ లు ఆందోళన చెందుతు న్నారు. అంతకంతకూ వ రద నీటిని దిగువకు వ దిలితే కాలువల నీరు గ్రా మాలను మరింత ముం చేస్తుందని కలవర పడు తున్నారు. పైగా ఇప్పటికే రిజర్వాయరు దాదాపు నిండిపోగా గురువారం నుంచి అల్పపీడనం ప్రభావంతో మూడురోజులపాటు భారీ గా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. ఫలితంగా క్యాచ్‌మెంట్ ఏరియా నుంచి మరింత వరద ప్రాజెక్టుకు పోటెత్తనుంది. అదే జరిగితే వచ్చిన నీటిని వచ్చినట్లు వదిలేస్తే కాలువవెంబడి ఉన్న పరివాహక గ్రా మాలు ముంపునకు గురికానున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ అధికారులను బుధవారం అప్రమత్తం చేశారు. ఏలేరు ముంపుగ్రామాల్లో ముందస్తు భద్రతాచర్యల్లో భాగంగా తాగు నీరు, నిత్యావసరాలు, మందులు సిద్ధం చేయాలని సూచిం చారు. పంపా, తాండలకు సైతం వరద పెరుగుతోంది.
పొలాల్లో ముంపే
సామర్లకోట, సెప్టెంబరు 4: ఏలేరు ఉధృతి పెరి గితే సామర్లకోట పట్టణంతోపాటు మండలంలోని ఐదు గ్రామాలకు సంబంధించి వరిపంట నీటమునుగుతోంది. ఏలేరు గేట్లు ఎత్తితే సామ ర్లకోట పట్టణ శివారు పిఠాపురం రోడ్డులో 500ఎకరాలు, మండలంలోని నవర, రావువారి చంద్రంపాలెం, పవర, పండ్రవాడ, గొంచాల గ్రామాల్లోని 600 ఎకరాల వరిపంట నీటి ముంపులో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏలేరు ధాటికి పంటలకు తోడు సామర్లకోట పట్టణ శివారు ప్రభుత్వ టిడ్కో గృహాలకు కూడా ముంపు సమస్య తప్పడంలేదు. పెద్దా పురం మండలం మీదుగా సామర్లకోటకు పంట కాలువ ద్వారా ఏలేరు నీరు వస్తోంది. సామర్లకోట స్లూయిజ్‌లనుంచి నేరుగా వెస్ట్ ఏలేరు కాలువలోకి పూర్తిగా మళ్లిస్తేనే శాశ్వత ప్రాతిపదికన ముంపు సమస్య తీరుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్తిపాడు, సెప్టెంబరు 4: ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామానికి చెందిన వెయ్యి ఎకరాల పంట పొలాలు ఏలేరు ఆయకట్టు పరిధిలోని ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏలేరు నీటి విడుదల కారణంగా ఇవి ముంపులోనే ఉన్నాయి.
బలహీనంగా గట్లు
పిఠాపురం/గొల్లప్రోలు, సెప్టెంబరు 4: ఏలేరు ఆధునికీకరణ పేరుతో రెండు ద శాబ్ధాలుగా కాలువల నిర్వహణకు గాలికి వదిలివేశారు. పడిన గండ్లను తాత్కాలిక ప్రాతిపదికన పూడ్చారు. గట్లు కోతకు గురవుతున్నా నివారణ చర్యలు లేక బలహీనంగా మారాయి. అధికంగా వరద వస్తే పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో నష్టం అధికంగా ఉండే అవకాశం ఉంది. వరద అత్యవసర సామాగ్రి కూడా సిద్ధంగా లేదు.
ఏలేరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటితో పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో 23వేల ఎకరాలు సాగవుతున్నాయి. వరద వస్తే ఏలేరు ఆయకట్టుతోపాటు పీబీసీ ఆయకట్టు ముంపునకు గురవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో 40వేల ఎకరాల్లో పంటకు నష్టం జరుగుతుంది. రిజర్వాయర్ నుంచి 10వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తే గొల్లప్రోలు పట్టణంలోని మార్కండేయపురం, గాంధీనగర్, రాయవరం రోడ్డు తదితర ప్రాం తాలు, అంతకంటే అధికంగా విడుదల చేస్తే పట్టణంలో అధిక భాగం ముంపు బారిన పడే అవకాశం ఉంది. ఆ ప్రభావం చేబ్రోలు, మల్లవరం, సీతానగరం లక్ష్మీపురం, చెందు ర్తి గ్రామాల పరిధిలోని పంటపొలాలపై ఉంటుంది. పిఠాపురం మండలంలో మాధవపురం, నవఖండ్రవాడ ముంపునకు గురవుతాయి. మండలంలో 18 గ్రామాల పరిధిలోని పంటపొలాలకు ముంపు పొంచి ఉంటుంది. రిజర్వాయర్ నిర్మాణం తర్వాత వరద నీరు వెళ్లేలా కాలువల నిర్మాణం జరగకపోవడం శాపంగా మారింది.
రెగ్యులేటర్లు, కళింగల్స్ శిథిలం
ఏలేరు కాలువల గట్లు కోతకు గురికాగా, సాగునీటి ప్రవాహాన్ని నియంత్రించే కళింగల్స్, రెగ్యులేటర్లు శిథిలమయ్యాయి. 2019లో ఏలేరుకు సంభవించిన భారీ వరదల కారణంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొర్రిఖండి, నక్కలఖండి, పెదయేరు, పీబీసీ సహా 16 కాలువల పరిధిలో 40కిపైగా గండ్లు పడ్డాయి. వీటిని ఇసుకబస్తాల తో తాత్కాలిక ప్రాతిపదికన పూడ్చి వదిలివేశారు. గండిపడిన సమయాల్లో దాన్ని పూడ్చడంతోపాటు అక్కడ రివిట్‌మెంట్ చేస్తారు. ఇలా చేయకపోవడంతో తరచూ గండ్లు పడుతున్నాయి. రెగ్యులర్ లస్కర్లు లేకపోవడంతో కాలువల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిం ది. వరదలు వస్తే గట్లును పటిష్టపరచడానికి, గండ్లు పడకుండా చూసేందుకు సంచులు, ఇసుక, ఇతర సామాగ్రి ఎక్కడాలేదు. వరద అత్యవసర సామాగ్రిని కూడా ఇరిగేషన్‌శాఖ విస్మరించింది.
ఏం చేయాలి
బలహీనంగా ఉన్న గట్లను ముందస్తుగా గుర్తించి పటిష్ట పరచాలి. తరచూ గండ్లు పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ పరిస్థితులను ఇరిగేషన్ అధికారులు స్వయంగా పరిశీలించి మళ్లీ గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలి. రైతులకు అం దుబాటులో ఇసుక బస్తాలు, ఇతర అత్యవసర సామాగ్రి ఉంచాలి. ఏలేరు రిజర్వాయర్‌నుంచి నీటిని ఒకేసారి కాకుం డా ఇన్‌ఫ్లోస్ ఆధారంగా ఇప్పటినుంచే దశలవారీగా విడుదల చేయాలి. రిజర్వాయర్ నిండే వరకూ మిగులు జలాలు విడుదల చేయకూడదన్న పురాతన పద్ధతికి స్వస్తి పలకాలి.
ప్రజలను అప్రమత్తం చేయాలి
నిత్యావసరాలు, తాగునీరు, ఔషదాలు అందుబాటులో ఉంచాలి
ఏలేరు వరదపై జిల్లా యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పిఠాపురం, సెప్టెంబరు 4: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగు వ నుంచి వస్తున్న జలప్రవాహంతో ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. మంగళగిరి నుంచి ఆయన జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, ఇతర జిల్లా అధికారులతో బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. ఏలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం, అక్కడ ఉన్న పరిస్థితిపై సమీక్షించారు. ఏలేరు రిజర్వాయర్‌కు చేరుతున్న వరదనీరు, సాయం త్రం నుంచి విడుదల చేస్తున్న జలాలు తదితర అంశాల గురించి కలెక్టరు వివరించారు. నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్‌లోనీటిమట్టం 20.13 మీటర్లకు చేరుకుందని, సాయంత్రం 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలకు స మానంగా పంపుతామని తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చే యాలని సూచించారు. ఇప్పటికే జగనన్న కాలనీ ముంపులో ఉన్నందున అక్కడ వారికి నిత్యావసర సరుకులు అందించాలని ఆదేశించారు. గొల్లప్రోలు పట్టణంలోని కాలనీలు, సూరంపేట, రైల్వేస్టేషన్ ఏరియాతోపాటు సీతానగరం,లక్ష్మీపురం, మల్లవరం, ఏ.విజయనగరం గ్రామాలను అప్రమత్తం చే యాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగునీరు, ఔషదాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేసుకోవాలని నిర్ధేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాల ని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని స్పష్టం చేశారు.