ఈదురుగాలులు.. భారీ వర్షం
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:32 AM
జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్క పోతగా గుబులు పుట్టించిన వాతావరణం సాయంత్రానికి చల్ల బడి వర్షం కురవడంతో ప్రజలు సేద తీరారు. దీనికితోడు ఆకాశం కారుమబ్బులతో ఆహ్లాదకరంగా మారింది.
ఈదురుగాలులకు విరిగిన స్తంభాలు
ఉదయం ఉక్కపోత.. వర్షంతో చల్లదనం
సేదతీరిన జనం.. లోతట్టు జలమయం
కాకినాడ సిటీ/కరప/పిఠాపురం/గొల్లప్రోలు/ప్రత్తిపాడు/తుని, సెప్టెంబరు20: జిల్లావ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్క పోతగా గుబులు పుట్టించిన వాతావరణం సాయంత్రానికి చల్ల బడి వర్షం కురవడంతో ప్రజలు సేద తీరారు. దీనికితోడు ఆకాశం కారుమబ్బులతో ఆహ్లాదకరంగా మారింది. కాకినాడ నగరంలోని డెయిరీఫారమ్, జగన్నాఽథపురం ప్రాంతాల్లో జోరుగా వర్షం కురి సింది. కరప మండల గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీవర్షం పడింది. అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్ముకుని చల్లని గాలులు వీచాయి. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం చల్లని గాలులు, వర్షానికి ఒక్కసారిగా సేదదీరారు. జోరున కురిసిన వర్షానికి రోడ్లు, ప్రధాన వీధులు జలమయమయ్యాయి. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో శుక్రవా రం సాయంత్రం స్వల్పంగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బుగా ఉండి ప్రజలు ఉక్కపోత వాతావరణంతో సత మతమయ్యారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వర్షం పడిం ది. ప్రత్తిపాడులో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తునిలో శుక్రవారం మధ్యాహ్నం గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి. మధ్యాహ్నం వరకు నిప్పులు కురిపించిన ఎండకు విలవిలలాడిన పట్టణవాసులు సాయంత్రం వర్షానికి ఉపశమనం పొందారు.
విరిగిపడ్డ ట్రాన్స్‌ఫార్మర్‌లు, విద్యుత్ స్తంభాలు
గండేపల్లి, సెప్టెంబరు 20: మండలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటసేపు కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకాశం మేఘావృతమై వర్షం పడింది. దీంతో ఈదురుగాలులు సుడి గుండా లు తిప్పడంతో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మల్లేపల్లి, సుబ్బయ్యమ్మపేట, కె.గోపాలపురం వెళ్లే రోడ్డులో 11కేవీ ట్రాన్స్‌ఫారాలు కిందపడ్డాయి. దీంతో విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామస్తులు, రైతులు ఇబ్బందులుపడ్డారు.