Share News

8,500 మంది వసతిగృహ విద్యార్థులకు బీమా సదుపాయం

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:46 AM

జిల్లాలో 8,500మంది విద్యార్థులకు బీమా సదుపాయం కల్పించినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వెల్లడించారు.

  8,500 మంది వసతిగృహ విద్యార్థులకు బీమా సదుపాయం

అమలాపురం టౌన్‌, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 8,500మంది విద్యార్థులకు బీమా సదుపాయం కల్పించినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ వెల్లడించారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాలలు, చిల్డ్రన్‌ హెల్త్‌కేర్‌ కేంద్రాల చిన్నారులు, అనాథాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్న 8,500 మంది విద్యార్థులను గుర్తించి ఐసీఐసీఐ లాంబార్డ్‌ హెల్త్‌ ఇన్సూరెన్సు వర్తింప చేశామన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో వసతిగృహ సంక్షేమ అధికారులు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలతో బీమా వర్తింపు ఆన్‌లైన్‌ ప్రక్రియ విధి విధానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రమాదం జరిగిన మొదటి గంటలో (గోల్డెన్‌ అవర్‌) అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈపథకాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. వసతిగృహాలకు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులను మ్యాపింగ్‌ చేయడం ద్వారా తక్షణ వైద్య సేవలకు అవకాశం లభిస్తుందన్నారు. రూ.50వేల వరకు తొలుత నగదు రహిత వైద్య సేవలు పొందవచ్చునన్నారు. జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లోని ఎంప్యానల్‌ ఆసుపత్రులను వసతిగృహాలకు టైఅప్‌ చేయడం జరిగిందన్నారు. డిసెంబరు 3 నాటికి మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వైద్య సేవలు పొందిన 40 నిమిషాల్లో ఆసుపత్రులకు పేమెంట్‌ జరుగుతుందని ఐసీఐసీఐ లాంబార్డ్‌ ప్రతినిధి ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపారు. ఉపాధ్యాయులు సందేహాల నివృత్తి కోసం 1800, 2666 టోల్‌ఫ్రీ నంబర్లలో సంప్రదించవచ్చునన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.దుర్గారావుదొర, ఐసీడీఎస్‌ పీడీ ఎం.ఝాన్సీరాణి, బీసీ సంక్షేమ అధికారి ప్రసాద్‌, సాంఘిక సంక్షేమశాఖ డీడీ పి.జ్యోతిలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

కాలుష్య నివారణకు చర్యలు..

జిల్లాలోని వివిధ మేజర్‌ డ్రెయిన్ల మురుగునీటి కారణంగా జలాలు కాలుష్యం కాకుండా నివారణా చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హైడ్రాలజీ సైంటిస్ట్‌ ఆర్‌ఎస్‌ రావు జిల్లాలో నీటి కాలుష్య ప్రమాణాలపై సర్వేకు అనుగుణంగా రూపొందించిన పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను కలెక్టర్‌ వీక్షించారు. జిల్లాలో భూగర్భ జలాలు, వ్యర్థాల కారణంగా నీటి కాలుష్యం పెరుగుతోందని కలెక్టర్‌ తెలిపారు. కూనవరం, అయినవిల్లి, దేవగుప్తం మేజర్‌ డ్రెయిన్ల మూలంగా కాలుష్యం వ్యాప్తి చెందుతుందన్నారు. వీటి నివారణకు గుజరాత్‌ తరహా టెక్నాలజీతో చర్యలు చేపట్టనున్నట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - Nov 30 , 2024 | 12:46 AM