Share News

హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య బీమా సదుపాయం

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:19 AM

ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింప చేసేందుకు అన్నిచర్యలు పూర్తి కావచ్చినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు.

  హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య బీమా సదుపాయం

అమలాపురం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ వసతిగృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింప చేసేందుకు అన్నిచర్యలు పూర్తి కావచ్చినట్టు కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలోని సాంఘిక, వెనుకబడిన తరగతులు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు, చైల్డ్‌కేర్‌ సెంటర్లలో ఉన్న 8,383 మంది విద్యార్థులకు ఐసీఐటీఐ లాంబార్డ్‌ ఆరోగ్య బీమా వర్తింప చేస్తున్నామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆరోగ్య బీమా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలు అందిస్తామన్నారు. అంబులెన్సు రవాణా సేవలు కూడా అందించేందుకు బీమా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. ఆసుపత్రుల్లో నగదు రహిత సేవలు అందించేందుకు ఆన్‌లైన్‌ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సమీపంలోని ఆసుపత్రుల ఫోన్‌ నంబర్లు, అంబులెన్సు ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వసతిగృహ సంక్షేమ అధికారులకు, విద్యార్థులకు ఎలక్ర్టానిక్‌ గుర్తింపు కార్డులు జారీకి చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ఆ గుర్తింపు కార్డును చూపించి నగదు రహిత వైద్యసేవలు పొందవచ్చునన్నారు. బీమాసంస్థ ప్రతినిధులుఎస్‌.శ్రీనివాసరావు, శ్రవణ్‌, వెంకటేశ్వరరావు, ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్‌ చల్లా శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2024 | 01:19 AM