Share News

ఉద్యమమే ఊపిరిగా

ABN , Publish Date - Oct 14 , 2024 | 12:33 AM

ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి, ఉద్యమాలతో ప్రభుత్వాలపై గళం విప్పే చైతన్యమూర్తి విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోకరకొండ సాయిబాబా. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మృతిచెందారన్న వార్త కోనసీమ వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అమలాపురంలో పుట్టిన సాయిబాబా గురించి తెలిసినవారెవరైనా ఆయన ఉద్యమ మార్గాన్ని కొనియాడుతున్నారు.

 ఉద్యమమే ఊపిరిగా

అమలాపురం, అక్టోబరు13(ఆంధ్రజ్యోతి): ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే వ్యక్తి, ఉద్యమాలతో ప్రభుత్వాలపై గళం విప్పే చైతన్యమూర్తి విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ గోకరకొండ సాయిబాబా. ఆయన శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో మృతిచెందారన్న వార్త కోనసీమ వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అమలాపురంలో పుట్టిన సాయిబాబా గురించి తెలిసినవారెవరైనా ఆయన ఉద్యమ మార్గాన్ని కొనియాడుతున్నారు. ప్రజా హక్కల కోసం నిరంతరం పోరాడే మహోన్నత వ్యక్తిగా ఆయనను కీర్తిస్తున్నారు.. ఉన్నత విద్యాభ్యాసం వరకు అమలాపురంలోనే చేసిన ఆయన ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లి సెంట్రల్‌ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసి పౌర హక్కుల పోరాటాల్లో కీలకంగా మారారు. అటువంటి సాయిబాబా ఇక లేరన్న వార్తను కోనసీమ ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు. ఆయన పుట్టి పెరిగిన ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికీ ఆయన నివాసం ఉండే వీధి, వారి అత్తవారిల్లు శిథిలస్థితికి చేరినప్పటికీ వాటిని చూసేందుకు కూడా ప్రజలు తరలివస్తున్నారు. సాయిబాబా మృతి పట్ల ప్రజా సంఘాలు కూడా దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాలు తెలిపారు.

వైకల్యాన్ని జయించి..ఉద్యమ నేతగా..

ప్రముఖ రచయిత, విద్యావేత్త, మానవహక్కుల ఉద్యమనేత, ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ గోకరకొండ సాయిబాబా(57) శనివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతిచెందారు. అమలాపురం పట్టణంలో గాంధీనగర్‌లో ఓ పేదరైతు కుటుంబంలో 1967లో సాయిబాబా జన్మించారు. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆయన అమలాపురంలోని సెయింట్‌జాన్‌ హైస్కూల్‌లో టెన్త్‌ వరకు, ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశారు. ఐదేళ్ల వయసులోనే ఆయన వీల్‌చైర్‌కు పరిమితమయ్యారు. అమలాపురంలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే ఆయన వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. తర్వాత ఆల్‌ ఇండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరం(ఏఐఆర్‌పీఎఫ్‌)లో చేరారు. గాంధీనగర్‌లో నివాసం ఉండే సాయిబాబా అమలాపురం పట్టణంలోని మైపాల వీధికి చెందిన అరిగెల వసంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కుమార్తె మంజీల ఉన్నారు. కాలేజీ చదువుల సమయంలోనే కుటుంబమంతా హైదరాబాద్‌ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారి సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు సైతం హైదరాబాద్‌లోనే స్థిరపడడంతో గోకరకొండ సాయిబాబాకు సంబంధించిన సమాచారం ఇక్కడ పెద్దగా తెలియరాలేదు. వారికి సంబంధించిన దూరపు బంఽధువులు గోకరకొండ వంశీ అమలాపురం రూరల్‌ మండలం నల్లమిల్లి గ్రామంలో ఉన్నారు. సాయిబాబా మరణవార్త తెలుసుకున్న తర్వాత వారితో పాటు కొందరు ముఖ్యులు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. అయితే సాయిబాబా వ్యక్తిత్వం, వారి కుటుంబం నేపథ్యం గురించి అమలాపురం పట్టణంలో ప్రజలంతా మంచిగానే చెబుతున్నారు. ఆయన మృతిపట్ల అమలాపురం పట్టణంలో పలు ప్రజా సంఘాలు, పౌరహక్కల సంఘాలు, వామపక్ష నేతలు ఘన నివాళులర్పించారు.

Updated Date - Oct 14 , 2024 | 12:33 AM