జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యం
ABN , Publish Date - Nov 23 , 2024 | 12:27 AM
జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్‌మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మిల్లర్లకు వివరించారు.
అమలాపురం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించామని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ప్రతిబంధకంగా మారిన రైస్‌మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. రైతులు సమీపంలోని తమకు నచ్చిన మిల్లులకు ధాన్యం తరలించి విక్రయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సమస్యలను అడిగి తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను మిల్లర్లకు వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వాహనం ట్రక్ సీటు జనరేట్ అయి ఆరు గంటలోపు మిల్లులకు చేరాలని ఆదేశించారు. దళారులు, మధ్యవర్తులకు ధాన్యం అమ్ముకుని మోసపోవద్దని ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరలకు విక్రయించుకోవాలన్నారు. రైతు పండించిన ధాన్యం తేమశాతం, ఇతర నాణ్యతా ప్రమాణాలు ఎఫ్‌ఏక్యూ విశ్లేషించడం జరుగుతుందన్నారు. రైస్ మిల్లర్లు తమ మిల్లులకు చేరిన వాహనాలు నిరీక్షణకు తావు లేకుండా రెండు షిఫ్ట్‌లలో పనిచేసేలా హమాలీలను నియమించుకోవాలన్నారు. ప్రతీ మిల్లుతో పాటు రైతు సేవా కేంద్రాలను తరచుగా సందర్శిస్తామన్నారు. రైతులకు మిల్లర్లు ధాన్యం కొనుగోలులో పూర్తిగా సహాయ సహకారాలు అందించాలన్నారు. నాన్ ట్రేగింగ్ రైస్ మిల్లులకు ధాన్యం సేకరణలో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నాణ్యతా ప్రమాణాలకు లోబడి రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తారన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు ధాన్యం ఎగుమతి చేసిన దగ్గర నుంచి రైసుమిల్లు వద్ద దిగుమతి అయ్యే వరకు జీపీఎస్ పరికరం ద్వారా ట్రాక్ చేయబడుతుందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు వారి ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు నేరుగా సొమ్ము జమ చేయనున్నట్లు చెప్పారు. రైతు సేవా కేంద్రం ద్వారా కాకుండా ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మదలచిన రైతులు సదరు వివరాలను రైతు సేవా కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. ధాన్యం విక్రయంలో రైతులు, మిల్లర్లతో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా కేంద్ర కార్యాలయ కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబరు 1967 లేదా సెల్ 9441692275, 8309432487లను సంప్రదించవచ్చునని జేసీ నిషాంతి స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాలసరస్వతి, జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, మరో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చౌదరి, నారాయణరెడ్డి పాల్గొన్నారు.