Share News

కాకినాడ మెయిన్‌లైన్‌ ఇక కలేనా

ABN , Publish Date - Feb 10 , 2024 | 01:07 AM

కాకినాడ మెయిన్‌లైన్‌ ఇక కలగానే మిగలనుందా. జిల్లావాసులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న ప్రతిపాదనలు కోల్డ్‌ స్టోరేజీకి చేరుకున్నాయా. అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో వరుసగా రెండో ఏడాది రూ.వెయ్యి మాత్రమే కేటాయించడం ఇందుకు అద్దం పడుతోంది.

కాకినాడ మెయిన్‌లైన్‌ ఇక కలేనా

  • కేంద్ర బడ్జెట్‌లో మరోమారు మొండిచేయి

  • రూ.వెయ్యే కేటాయింపు

  • రూ.45కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు చేరిన అంచనా వ్యయం

  • కోల్డ్‌స్టోరేజీలోనే ప్రతిపాదనలు

కాకినాడ మెయిన్‌లైన్‌ ఇక కలగానే మిగలనుందా. జిల్లావాసులు దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న ప్రతిపాదనలు కోల్డ్‌ స్టోరేజీకి చేరుకున్నాయా. అంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో వరుసగా రెండో ఏడాది రూ.వెయ్యి మాత్రమే కేటాయించడం ఇందుకు అద్దం పడుతోంది. ఈ లైన్‌ గురించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కేంద్రం దీన్ని పట్టాలు తప్పించినట్లు చెప్తున్నారు.

పిఠాపురం, ఫిబ్రవరి 9: అది దశాబ్ధాల కల. ఎంతో చరిత్ర కలిగి ఒకప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి, నేడు కాకినాడ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉన్న కాకినాడ నగరాన్ని రైల్వేల పరంగా విశాఖపట్టణం-విజయవాడ మెయిన్‌లైన్‌లో కలపాలన్న డిమాండ్‌ సుదీర్ఘకాలంగా ఉంది. పోర్టు ఉండి పారిశ్రామికంగా అన్నిరకాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉన్న కాకినాడకు ప్రధాన రైల్వేలైను లేకపోవడం ఒక్కటే లో టుగా మిగిలింది. ప్రస్తుతం సామర్లకోటనుంచి కాకినాడకు ప్రత్యేక రైలు మార్గం ఉంది. విజయవాడ, విశాఖ వైపుల నుంచి వచ్చే ప్రయాణికులు సామర్లకోటలో దిగి కాకినాడ మార్గానికి మారాల్సి ఉంటుంది. దేశంలో ప్రధానమైన ప్రాం తాలకు వెళ్లే రైళ్లు కాకినాడనుంచి లేకపోవడంతో సామర్లకోట లేదా రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది.

కాకినాడ మెయిన్‌లైన్‌ ప్రతిపాదనలు ఇలా..

విశాఖ-విజయవాడ మెయిన్‌ రైల్వేలైన్‌లోకి కాకినాడను తీసుకువచ్చేందుకుగాను పిఠాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో నుంచి ప్రత్యేకంగా రైలుమార్గాన్ని నిర్మించి కాకినాడను కలుపుకొంటూ ప్రస్తుతం ఉన్న సామర్లకోట రైల్వేలైను మార్గంలో కలపాలని ప్రతిపాదించారు. పిఠాపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో లేదా పూర్వ చిత్రాడ రైల్వేగేటు దాటిన తర్వాత చంద్రపా లెం సమీపంనుంచి కాకినాడ రైల్వేలైనును తీసుకువెళ్లేం దు కు సర్వే జరిగింది. 21.5 కిలోమీటర్ల ఉండే ఈ లైనుకు తొలు త రూ.48కోట్లు ఉన్న అంచనాలు 2014-15లో రూ.220.30కోట్లకు చేరుకున్నాయి. 2017-18లో ఇది రూ.350కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం పెరిగిన భూసేకరణ వ్యయంతో ఇతర రేట్ల ను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం ఇది రూ.వెయ్యి కోట్ల కు చేరుకుందని చెబుతున్నారు.

గతంలో పుష్కలంగా నిధులు

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఉండడం, అందులో భాగస్వామిగా టీడీపీ ప్రభుత్వం ఒత్తిడితో కాకినాడ మెయిన్‌రైల్వే లైనుకు 2016-17 రైల్వేబడ్జెట్‌లో రూ.50కోట్లు, 2017-18 బడ్జెట్‌లో రూ.150కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు వ్యయంలో కీలకమైన భూసేకరణవ్యయాన్ని భరించేందుకు అప్పుడు రాష్ట్రం లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అంగీకారం తెలపడంతో రైల్వేలైను పనులు ప్రారంభమవుతాయని ఆశిం చారు. సమగ్ర సర్వేతోపాటు అంచనాలు రూపొదించిన తర్వా త రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, భూ సేకరణ వ్యయం భరించడంపై వెనక్కి తగ్గడంతో ఈ ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి.

వరుసగా రెండో ఏడాది అంతే

కాకినాడ మెయిన్‌లైన్‌పై రాష్ట్ర ప్రభుత్వంనుంచి ఒత్తిడి లేకపోవడం, వైసీపీ ప్రజాప్రతినిధులు అంతగా దృష్టిసారించకపోవడంతో కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయింపు జరగడం లేదు. ఐదు బడ్జెట్‌లు గా నామమాత్రంగా నిధులు ఇస్తున్నారు. గత బడ్జెట్‌ లో రూ.వెయ్యి ఇచ్చినట్లు చూపిన కేంద్రం, ఇప్పు డు వరుసగా రెండోఏడా ది రూ.వెయ్యి కేటాయించినట్లు చూపడం విస్మయాన్ని కలిగిస్తోంది. కేం ద్ర రైల్వేబడ్జెట్‌లో అంచ నాలను మాత్రం పదేళ్ల క్రితం ఉన్నరూ.220కోట్ల కే పరిమితం చేయడం గమనార్హం. నామమాత్రపు కేటాయింపులు జరపడంతో కాకినాడ మెయిన్‌లైన్‌ ఇక శాశ్వతంగా కో ల్డ్‌స్టోరేజీకి వెళ్లిందాఅన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నాటి నివేదికకే కట్టుబడిందా..

ఐదేళ్ల క్రితం రైల్వే బోర్డు కాకినాడ మెయిన్‌లైన్‌పై సర్వే ని ర్వహించి ఇది ఆర్థికంగా ప్రయోజనకరం కాదని తేల్చింది. దీనిపై ప్రజాప్రతినిధులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యా యి. కాకినాడలో పోర్టుతోపాటు పలు పరిశ్రమలు ఉన్నాయి. పెట్రో కారిడార్‌ ఈ ప్రాంతం మీదుగా వెళ్లడంతోపాటు కాకినాడ సెజ్‌లో పలు పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోర్టు ద్వారా భారీగా ఎగుమతులు, దిగుమతులు జ రుగుతున్నాయి. విశాఖ-విజయవాడ ప్రధాన రైలుమార్గంలో కాకినాడను కలపడం ద్వారా రైల్వే ద్వారా ఈ ఎగుమతులు, దిగుమతులు జరగడంతోపాటు వాణిజ్య, వ్యాపార అవసరాల కు అనువుగా ఉంటుంది. ఈ ప్రయోజనాలను రైల్వేశాఖ ప ట్టించుకోకపోడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం గట్టి ఒత్తిడి తెస్తేనే కాకినాడ మెయిన్‌ లైన్‌ కల నెరవేరుతుందని, లేకుంటే ఇది ప్రతిపాదనలుగానే మిగిలిపోతుందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Feb 10 , 2024 | 01:07 AM