కోట్లాట!
ABN , Publish Date - Jan 17 , 2024 | 12:23 AM
సై అంటే సై.. ఎంతైనా ఓకే.. పండుగ సందడిలో బరి తెగించారు.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బరులు వెలి శాయి. కోట్లాట హోరెత్తింది.. బరిలో కోళ్లు కత్తులు దూశాయ్.. నువ్వా నేనా అంటూ తలపడ్డాయ్..
జిల్లాలో వెలిసిన 100 బరులు
రెచ్చిపోయిన పందెగాళ్లు
వేలు..లక్షల్లోనే సాగిన పందేలు
రూ. 100 కోట్లు ఆడేశారు..
జోరుగా గుండాట, కోతాట
యథేచ్ఛగా మందు.. విందు.. పసందు
వైసీపీ నేతల కనుసన్నల్లోనే బరులు
కళ్లు మూసుకున్న అధికారులు
మామూళ్ల మత్తులో పోలీసులు
( రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
సై అంటే సై.. ఎంతైనా ఓకే.. పండుగ సందడిలో బరి తెగించారు.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బరులు వెలి శాయి. కోట్లాట హోరెత్తింది.. బరిలో కోళ్లు కత్తులు దూశాయ్.. నువ్వా నేనా అంటూ తలపడ్డాయ్.. యజమానులను గెలిపిం చాలని రక్తం చిందించాయ్..మూడు రోజుల కిందట సం క్రాంతి పందెం కోడి పోలీసులపై నెగ్గినట్టు కనిపించినా.. చివరికి బరిలో తుదిశ్వాస విడిచి ఓడిపోయింది. మూడు రోజుల కిందటి వరకూ ప్రగల్బాలు పలికిన పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇచ్చింది పుచ్చుకుని ప్రేక్షకపాత్రకే పరిమితమయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడా ది రూ. కోట్లలో కోడిపందాలు, గుంటాటలు , పేకాటలు, మూడు ముక్కలాటలు జరిగాయి. ఎన్నికల ఏడాది కావడం తో నాయకులు సైతం అడిగినవారికి కాదనుకుండా బరులకు అనధికార అనుమతులిచ్చేశారు..మేమున్నాం మీరు వేసుకోం డి అంటూ వెన్నుదన్నుగా నిలిచారు. గత మూడు రోజుల నుంచి వైసీపీ ప్రముఖులే కీలక పాత్ర పోషించారు. దీంతో పందేలు జోరుగా సాగాయి. ఎన్నడూ లేనిది జిల్లా కేంద్రం చుట్టు పక్కల భారీగా బరులు వెలిశాయి. పోలీసులు బరికి రూ.లక్షల్లో తీసుకొని ఇళ్లలో పడుకున్నట్టు విమర్శలు వచ్చా యి. సంక్రాంతికి ముందు పందెం ఆడనిచ్చేలేదని చెప్పి విస్త్రత ప్రచారంచేసి, అవగాహన సదస్సులు కూడా నిర్వ హించారు. అయితే భోగి పండుగ మధ్యాహ్నం 12 గంటల మొదలు కనుమ వరకూ ఎక్కడా కనిపించలేదు. పబ్లిక్‌గా రోడ్ల ప్రక్క, ఊళ్ల మధ్యన బరులు వేసి రాత్రి పగలూ పందాలు నిర్వహించినా ఎవరూ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివి జన్లలో ఒక్కో మండలంలోనూ కనీసం రెండు నుంచి పది వరకూ బరులు వెలిశాయి. మొత్తంగా జిల్లాలో 80 నుంచి 100 బరులు వరకూ ఏర్పాటు చేసినట్టు అంచనా. గోకవరం మండలంలో భారీస్థాయిలో కోడిపందేలు నిర్వహించారు. ఒక్కో చోట కనీసం 20 పందేల నుంచి 50 వరకూ జరిగాయి. వీరలంకపల్లిలో భారీ బరి ఏర్పాటు చేశారు. వందలాది మంది పందెగాళ్లు కార్ల మీద ఇతర ప్రాంతాల నుంచి ఇక్క డకు వచ్చారు. ఒక్కో పందెం రూ. లక్ష వరకూ సాగింది. ఎల్ ఈడీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి, బయట జనానికి కూడా స్పష్టం గా కోళ్ల కొట్లాట కనిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సారి బరులు హైటెక్ స్థాయిలో ఏర్పాటు చేశారు. టెంట్ , ఫెన్సింగ్ ఏర్పాటు చేసి లోపలకు కొంతమందిని మాత్రమే అనుమతిం చారు. టికెట్లు కూడా పెట్టారు. అచ్చుతాపురంలో స్థానికులు పందాలు వేశారు. గోకవరం,కృష్ణునిపాలెం, కొత్తపల్లి, మల్లవరం,తిరుమలాయపాలెం, రంప ఎర్రంపాలెం, వెదురు పాక, తంటికొండ ప్రాంతాల్లో జోరుగా పందాలు, గుండా టలు సాగాయి. ఒక్కో పుంజు తరపున రూ.లక్ష వరకూ పం దెం జరగగా..బయట పందేలు వేలల్లో జరిగాయి. రాజమ హేంద్రవరం రూరల్‌లో పిడింగొయ్యలో పెద్దపందెం వేశారు. పందెం ఒకటి రూ.లక్ష. రాత్రి పగలూ కూడా ఆడేస్తు న్నారు. కవలగొయ్యలో కూడా గట్టిగా ఆడారు. కడియం మండ లంలో వీరవరం, బుర్రిలంక గ్రామాల్లో కోడి పందేలు సాగా యి. అనపర్తి, రంగంపేట, బిక్కవోలులో అనేక చోట్ల పెద్ద పందాలు జరిగాయి. సీతానగరం మండలంలో వైసీపీ రెండు వర్గాలు చీలి రెండు బరులు పెద్దవి నిర్వహించింది. రూ.ల క్షలు చేతులు మారాయి.కోరుకొండ, రాజానగరం మండలాల్లో అధికంగా జరిగాయి. రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పెద్ద బరి ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ వేలాదిగా జనం వచ్చి పందేలను తిలకించారు. గోపాలపురం మండలంలో గోపాలపురం,వేళ్లచింతలపూడి, వెంకటాయపాలెం, గుడ్డిగూ డెం, కొవ్వూరుపాడు, దొండపూడి, హకుంపేట, గ్రామాల్లో రూ.కోట్లలో పందేలు జరిగాయి. కొవ్వూరు, నిడదవోలు, పెర వలి, ఉండ్రాజవరం, చాగల్లు, తాళ్లపూడి, నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లో అత్యధికంగా పందాలు జరిగాయి. జిల్లాలో సుమారు 80 నుంచి 100 వరకు బరులు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు బందోబస్తు చర్యలు చేపట్టారు.సుమారు రూ.100 కోట్ల వరకూ పందెం, గుంటాలు జరిగినట్టు చెబుతున్నారు. సందట్లో సడేమియాగా మద్యం వ్యాపారం జోరుగా సాగింది. పందెం దగ్గర అందరూ ఊగే వాళ్లు, తూగేవాళ్లే. చుక్కేసి ముక్కేసి ఆడేశారు. అయినా పోలీ సులు మాత్రం పట్టించుకోలేదు. కోడి పందేల ముసుగులో జూదం భారీగా సాగింది. ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు వెలి సినా ఎస్‌ఈబీ అధికారులు నోరుమెదపకపోవడం గమ నార్హం.గుంటాటలు కనీసం రూ.100 కాస్తేనే కానీ అనుమ తించలేదు. ఎక్కువ మంది రూ.500 నుంచి వేలల్లో కాశారు. గుంటాట నిర్వాహకులు, పందెం నిర్వాహకులు భారీగా సం పాదించారు. ఎన్నికల ముందు సంక్రాంతి కావడంతో రాజ కీయనేతలంతా లోపాయికారిగా సహకరించి పందేలు వేయిం చారు. పోలీసులకు కూడా భారీగా ముడుపులు అందినట్టు నిర్వాహకులే చెబుతున్నారు.ఇదిలా ఉండగా కొవ్వూరులో 49 కేసులు నమోదు చేశారు. వందల్లో బరులు ఏర్పాటు చేసి.. రూ.కోట్లల్లో జూదక్రీడ రెచ్చిపోగా.. కొన్ని కేసులు పెట్టి ఈ ఏడాది చేతులు దులుపుకునే పనిలో పడ్డారు. ప్రజాప్రతి నిధుల అధికార దండం ముందు జిల్లా పోలీస్ బాస్ చేతులు కట్టుకోక తప్పలేదు. కోడి పందేల విషయంలో కోర్టు ఆదేశాలనే పాటిస్తామని స్పష్టంగా చెప్పిన మాటలనూ పక్కన పెట్టేయక తప్పలేదు.
కత్తి దిగింది..రక్తం చిందింది!
రాజమహేంద్రవరం, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కోడి పందేల విషయంలో ఈ ఏడాదీ అదే బొమ్మ పడింది. పండుగకు వారం ముందు జూలు విదిల్చిన నాలుగో సింహం చతికిల పడక తప్పలేదు. దీంతో మళ్లీ యంత్రాంగంపై పందెం పుంజు పైచేయి సాధించింది. ప్రతి ఏడాదీ జనాలకు అలవాటైపోయిన తంతే అయినా.. ఈసారి పోలీసుల దూకుడు చూసి పందెం బరుల పనైపోయిందనే చర్చ నడిచింది. పందెం బరులను ధ్వంసం చేయడం, కోడి పందేల జోలికెళ్తే జైలు తప్పదనే అత్యంత కఠినమైన హెచ్చరికలు చూసిన జనం నిజంగా నిజం కాబోలు అనుకున్నారు. శ్రమకోర్చి జిల్లాలో ఓ వెయ్యిలోపు కోడి కత్తులు స్వాధీనం చేసుకోవడంతో ఈసారి పందెం పుంజు తోకముడవక తప్పదనుకున్నారు. కానీ.. చివరికి కేసులు.. కాసులు.. కోసలు హల్‌చల్ చేశాయి. జాతి వైరం మాటున జరుగుతున్న హింసాక్రీడలో వందలాది మూగజీవాల రక్తంతో బరులు తడిచి ముద్దయ్యాయి. గుండాట, పేకాట తదితర జూదాలపై కూడా ఈ మూడు రోజులు చట్టం ముఖం చాటేసింది. సంక్రాంతి వచ్చిం దంటే గోదావరి జిల్లాల్లో కోడి పందేలు ఆపడం ఎవరికీ సాధ్యం కాదనే విషయం మరోసారి రుజువైంది. గతంలో చాటుమాటుగా పందేలు జరిగేవి ఇప్పుడు ప్రధాన రహదార్ల పక్కనే బరులు ఏర్పాటు చేస్తుంటే పోలీసులు కాపలా కాయాల్సిన దుస్థితి దాపురించింది. ఈసారి జిల్లాలో రూ.100కోట్లపైనే కోడి పందేలపై డబ్బు చేతులు మారగా.. గుండాట, పేకాట, మూడు ముక్కలాట వంటి క్రీడల్లో జనం మరో రూ.10కోట్ల వరకూ పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
కేసులు.. కాసులు.. కోసలు
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషను పరిధిలోనూ కోడి పందేలు జరిగాయి. పెద్ద బరుల్లో కోట్లాది రూపాయల్లో జూదం ఆడారు. కోడి పందేలు ఆపడం సాధ్యం కాదనే విషయం యంత్రాంగానికి అనుభవంలో ఉండడంతో ఉభయ కుశలోపరి కింద ప్రజాప్రతినిధుల సలహాలతో ఓ లోపాయికారీ ఒప్పందం నడిచింది. పోలీస్ స్టేషనుకు బరిని బట్టి కాసులు.. కేసులు.. కోశలు లెక్కన వెసులుబాటును తెరపైకి తెచ్చారు. కనీసం మూడు కేసులు బనాయించే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ‘మామ్మూళ్లు’ మామూలే. చిన్న బరికి రూ.50 వేలు పెద్ద బరి స్థాయిని బట్టి రూ.లక్ష పైనే వసూలు చేశారు. ఇక స్టేషనుకు ఇన్ని కోసలు(ఓడిపోయి చనిపోయిన పందెం పుంజు) ఇవ్వాలనే హుకుం కూడా ఇచ్చారు.అంతే కాదండోయ్ మూడు కోళ్లు పట్టుకున్నట్టు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.
కోసకు డిమాండ్
నల్లజర్ల/ గోపాలపురం/ కొవ్వూరు : పందెంలో ఓడిన కోడి(కోస)కు డిమాండ్ పెరిగింది.కనుము కావడంతో కోసాకు జనం పరుగులు తీశారు.రెండు కేజీలు ఉన్న కోస మాంసం రెండు వేల ఉంచి 3 వేల వరకు పలికింది.కోస మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో నల్లజర్ల మండలం అనంతపల్లి,చోడవరం,ప్రకాశరావుపాలెం,దూబచర్లలో ఇంట్లో పెంచుకుని కోడి పుంజులను తక్కువ ధరకు కొనుగొలు చేసి బ్లేడ్‌తో కోసి వాటిని కాల్చి కోస మాంసంగా విక్రయించారు. వెయ్యి రూపాయలకు కొనుగొలు చేస్తే రెండు వేల వరకు వసూలు చేశారు. గోపాలపురం ఒక్కొక్క కోస రూ.2500 నుంచి దాని బరువును బట్టి రూ.5వేల వరకు ధర పలికింది. కొవ్వూరులో అయితే రూ.3 వేల వరకూ విక్రయించారు.
రూ.కోట్లలో సాగుతున్న పేకాట
మిర్తిపాడు- మధురపూడి మధ్య భారీ పేకాట శిబిరం
రాజమహేంద్రవరం, జనవరి16(ఆంధ్రజ్యోతి) : సంక్రాంతిని పురస్క రించుకుని సందట్లో సడేమియా అన్నట్టు మధురపూడి, మిర్తిపాడు గ్రామాల మధ్య కోరుకొండ పోలీసు స్టేషన్ పరధిలో భారీ పేకాట శిబిరం నిర్వహించారు. రాత్రి పగలూ ఒకటే ఆట. రూ.కోట్లలో పేకాట ఆడినట్టు సమాచారం.పలువురు ప్రముఖులు ఆయా ఊర్ల పెద్దలు, మోతుబరులు ఈ మూడు రోజులు పేకాటలోనే నిమగ్నం కావడం గమనార్హం. మరో పక్క మూడు ముక్కలాట, గుండాట వంటి జూదంగా భారీగా ఆడడం గమనార్హం. పోలీసులు కనీసం కన్నెత్తి చూడలేదు. ఇది రాజకీయనేతలు, పోలీసులకు తెలిసే జరిగినట్టు సమాచారం.రాత్రి వేళ భారీ లైటింగ్ ఏర్పాటు చేసుకుని జూదంలో నిమగ్నమయ్యారు. కొందరు భారీగా డబ్బు పోగొట్టుకోగా, కొందరు జేబులు నింపుకున్నారు. నిర్వాహకులు భారీ వెనకేసుకున్నట్టు చెబుతున్నారు.