Share News

టెన్షన్‌..టెన్షన్‌గా

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:58 PM

గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది.

 టెన్షన్‌..టెన్షన్‌గా
ముక్తేశ్వరం వద్ద నీట మునిగిన పాత వంతెన

కోనసీమలో పెరుగుతున్న వరద

లంక గ్రామాలకు చేరుతున్న వరదనీరు

మునుగుతున్న కాజ్‌వేలు..

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): గోదావరి వరద పెరుగుతుండడంతో కోనసీమలోని లంక గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయగా ధవళేశ్వరం వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దాంతో కోనసీమలోని గౌతమీ, వశిష్ఠ, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహించడం వల్ల సమీపంలోని లంక గ్రామాల్లోకి వరదనీరు చేరుతోంది. గురువారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. లంక గ్రామాలకు ముంపు ముప్పు వచ్చి పడింది. అధికారులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు రహదారి అయిన కనకాయలంక-చాకలిపాలెం కాజ్‌వే నీట మునిగి రవాణా సౌకర్యాలకు ఆటంకం కలుగుతుంది. వీటితో పాటు నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు పల్లపు కాజ్‌వేలు వరద నీటిలో మునిగాయి. మరికొన్ని కాజ్‌వేల పైకి నీరు చేరుతుంది. ముఖ్యంగా వివిధ మండలాల పరిధిలో ఉన్న 30కి పైగా ఉన్న లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడికక్కడే పడవలపై లైఫ్‌జాకెట్లు సాయంతో ప్రయాణికులను దాటించడంతో పాటు ఇతర జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. అయినవిల్లి ఎదురుబిడియం వద్ద వరద నీరు కాజ్‌వేపై ప్రవహిస్తుంది. మళ్లీ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తీర ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్తేశ్వరంలో పాత వంతెన నీట మునిగింది. అప్పనపల్లి కాజ్‌వే వద్ద ఉన్న ఇటుక బట్టీలు వరద ప్రవాహంలో మునిగాయి. వరద కాజ్‌వేపైకి చేరుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులతో పాటు మండల స్థాయిలో ఉన్న అధికారుల బృందాలు విస్తృతంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి పెరుగుతున్న వరద పరిస్థితిని పరిశీలించారు. రాగల రెండు రోజుల్లో వరద పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు ప్రజలను కోరుతున్నారు. వరద పెరుగుదల పరిస్థితిపై జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా గోదావరి నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్న ఏటిగట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాల వద్ద రక్షణ చర్యలు చేపట్టడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోను బలహీన గట్ల వద్ద నిర్లక్ష్యం వహించకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2024 | 11:58 PM