భయం గుప్పెట్లో లంక గ్రామాలు
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:11 AM
గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి నది ప్రవహిస్తోంది. సుమారు 14.50 లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమీ నదీ పాయల్లో వరద క్రమంగా పెరుగుతూ లంక గ్రామాలను ముంచెత్తుతోంది.
పొలాలు నీట మునక
(అమలాపురం-ఆంధ్రజ్యోతి) గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి నది ప్రవహిస్తోంది. సుమారు 14.50 లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి విడుదల చేయడంతో కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమీ నదీ పాయల్లో వరద క్రమంగా పెరుగుతూ లంక గ్రామాలను ముంచెత్తుతోంది. ఇప్పటికే నది పరివాహక మధ్య లంకల్లో ఉన్న పశువులను, పంటలను సంరక్షించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించుకునే పనిలో రైతులు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి వరద ప్రభావం పెరుగుతుండడం వల్ల లంక గ్రామాల్లోకి రాకపోకలు స్తంభించి ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితి, అధికారుల సన్నద్ధతపై ఆరా తీస్తున్నారు. కలెక్టర్ మహేష్‌కుమార్ ఐ.పోలవరం మండలంలోని గౌతమి నది పరివాహక ప్రాంతాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. వరద పెరుగుదలపై అంచనాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ నిషాంతి సఖినేటిపల్లి మండలంలోని అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద ముంపు ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను పరామర్శించారు. అక్కడ పరిస్థితులపై వారి నుంచి సమాచారం తెలుసుకోవడంతో పాటు అధికారుల సన్నద్ధతను సమీక్షించారు. గౌతమీ నది పొంగి కోటిపల్లిలోని ఒడ్డున గల వ్యాపార సముదాయాల్లోకి నీరు చొచ్చుకురావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముందు జాగ్రత్తగా నదుల్లో పంట్లు, పడవ ప్రయాణాలు కూడా అధికారులు నిలుపుదల చేశారు. వరద ప్రభావానికి గురైన కొన్ని ప్రాంతాల్లో విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు.