Share News

లిక్కర్‌ లక్కీడ్రా నేడే

ABN , Publish Date - Oct 14 , 2024 | 12:35 AM

నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.

లిక్కర్‌ లక్కీడ్రా నేడే

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం మద్యం షాపుల లక్కీడ్రా నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరు ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 133 మద్యం షాపులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా 4087 దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 81.74 కోట్లు ఆదాయంగా సమకూరింది. కలెక్టరేట్‌ గోదావరి భవన్‌లో దరఖాస్తు దారుల సమక్షంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ లాటరీ ద్వారా మద్యం షాపులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందు కోసం కలెక్టరేట్‌లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ ఆదివారం కలెక్టరేట్‌లోని ఏర్పాట్లను పరిశీలించారు. నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి ప్రతీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజల్లో గానీ, మద్యం వ్యాపారుల్లో గానీ ఎటువంటి అపోహలకు తావు లేకుండా జవాబుదారీతనంతో కలెక్టర్‌ సమక్షంలో లక్కీడ్రా జరగనుంది. ఈ లాటరీ విధానాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించడానికి ఎక్సైజ్‌శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మద్యం లాటరీలో పాల్గొనే వ్యాపారులకు ఇప్పటికే కలెక్టరేట్‌ లక్కీడ్రాలో పాల్గొనేందుకు ఎంట్రీ పాస్‌లను కూడా మంజూరు చేశారు. మద్యం వ్యాపారులు తమ వ్యాపార భవితవ్యాన్ని సోమవారం జరిగే లక్కీడ్రా ద్వారా నిర్దేశితమవుతుంది. ఇందుకోసం భారీగా వ్యాపారులు సన్నద్ధమవుతున్నారు. భారీ భద్రత నడుమ లక్కీడ్రా నిర్వహణకు ఎక్సైజ్‌ శాఖ పూర్తిస్థాయి ఏర్పాట్లను సిద్ధం చేసింది.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు..

సోమవారం కలెక్టరేట్‌లో జరిగే జిల్లాస్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేశారు. డివిజన్‌ మండల స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం మద్యం లాటరీ జరగనున్న దృష్ట్యా మీ కోసం కార్యక్రమం రద్దు చేశారు.

Updated Date - Oct 14 , 2024 | 12:35 AM