శంభో..శివ శంభో..
ABN , Publish Date - Nov 16 , 2024 | 12:49 AM
కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పవిత్ర గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామస్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. అధిక సంఖ్యలో గోష్పాదక్షేత్రానికి చేరుకుని అఖండ గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
శివ నామస్మరణతో మారుమోగిన గోష్పాదక్షేత్రం
గోదావరి నదిలో పుణ్యస్నానాలు
కార్తీక పౌర్ణమి పూజలు
సాలగ్రామ, దీప దానాలు
కొవ్వూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పవిత్ర గోదావరి తీరం కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తజన సందోహంగా మారింది. శివ నామస్మరణతో క్షేత్రమంతా మారుమోగింది. అధిక సంఖ్యలో గోష్పాదక్షేత్రానికి చేరుకుని అఖండ గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలోని శివలింగాలకు నదీ జలాలతో అభిషేకాలు చేశారు. మహిళలు అరటి డొప్పల్లో నేతి దీపాలను వెలిగించి నదిలో విడిచిపెట్టారు. క్షేత్రంలోని శివ, కేశవులను, సుందరేశ్వరస్వామిని దర్శించుకుని పంచామృత అభిషేకాలు నిర్వహించారు. రావిచెట్టు వద్ద నాగశిలలకు నదీ జలాలు, పాలతో అభిషేకించారు. ప్రధాన స్నానఘట్టం, తులసి చెట్టు, రావిచెట్ల వద్ద సుందరేశ్వరస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం, నందీశ్వరుని వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. సుందరేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులు బారులుతీరి స్వామివారిని దర్శించుకున్నారు. బ్రాహ్మణులకు సాలగ్రామ, దీప దానాలతో పాటు స్వయంపాకం దానం చేశారు. అలాగే మండలంలోని వాడపల్లి, ఆరికిరేవుల, కుమారదేవం, చిడిపి, పెనకనమెట్ట, ధర్మవరం, దొమ్మేరు, మద్దూరు, వేములూరు, తోగుమ్మి గ్రామాలలోని శివాలయాల్లో భక్తులు కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు.
జ్వాలాతోరణం..
గోష్పాదక్షేత్రంలో సుందరేశ్వరస్వామి ఆలయం వద్ద జ్వాలాతోరణం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు ప్రదోషకాలంలో క్షేత్రానికి చేరుకుని కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం సుందరేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ఊరేగించారు. జ్వాలాతోరణం వెలిగించి ఉత్సవమూర్తులతో పాటు భక్తులు ప్రదక్షిణలు చేశారు. అలాగే స్నానఘట్టంలో కాశీ విశ్వేశ్వరుని వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు.
కార్తీక వనసమారాధన
రోడ్డు కం రైలు బ్రిడ్జి సమీపంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రకృతి రావణబ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయం 7వ వార్షికోత్సవాన్ని భక్తులు నిర్వహించారు. శ్రీ శివభక్త రావణబ్రహ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యం లో శి వాల యంలో కార్తీక వనసమారాధన జరిపారు. శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలతో అభిషేకాలు చేశారు. అనం తరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.