వైభవంగా గో, వృషభ కల్యాణం
ABN , Publish Date - Dec 15 , 2024 | 01:08 AM
లోక క్షేమం, పశుసంపద వృద్ధికి జరిగే గో, వృషభ కల్యాణాన్ని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలో శనివారం వైభవంగా జరిపారు.
ఆలమూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): లోక క్షేమం, పశుసంపద వృద్ధికి జరిగే గో, వృషభ కల్యాణాన్ని కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పెదపళ్లలో శనివారం వైభవంగా జరిపారు. వృషభం తరపున పెదపళ్ల గ్రామానికి చెందిన ఉండమట్ల రాంబాబు వెంకటపద్యావతి దంపతులు, గోవు తరఫున రామచంద్రపురం మండలం చెల్లూరుకు చెందిన మాగాపు శ్రీనివాస్, అగ్నిజ్యోతి దంపతులు తల్లిదండ్రులుగా వ్యవహరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య రుత్వికులు కల్యాణాన్ని జరిపారు. ఆవుకు, ఎద్దుకు మంగళస్నానాలు చేయించి పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించి బాసికాలు కట్టి ఉదయం 8.03 గంటలకు జీలకర్ర బెల్లం పెట్టించారు. అనంతరం మంగళవాయిద్యాలు, పండితుల మంత్రోచ్ఛారణల మధ్య తాళి కట్టించి తలంబ్రాల కార్యక్రమం జరి పారు. తదుపరి వృషభానికి శంఖు, చక్రం అచ్చు వేసి గ్రామంలో వదిలిపెట్టారు.