ఇదొక ప్రకృతి వనం!!
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:39 AM
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ఇప్పుడు ఏం తిందామన్నా కల్తీ అయిపోయింది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా అన్నీ రసాయన మందులతో కలుషితమై పోతున్నాయి. వాటిని తినడంవల్ల ఆరోగ్యమూ పాడవుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు ప్రకృతి సిద్ధంగా ఏ రసాయనిక ఎరువులు, పురు
మేడపైనే కూరలు, పండ్లు, పూల మొక్కల పెంపకం
సహజ సిద్ధంగా పంటలు
మిద్దె తోట సాగుతో ఆరోగ్యం.. ఆనందం..
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 2 (ఆంధ్ర జ్యోతి): ఇప్పుడు ఏం తిందామన్నా కల్తీ అయిపోయింది. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇలా అన్నీ రసాయన మందులతో కలుషితమై పోతున్నాయి. వాటిని తినడంవల్ల ఆరోగ్యమూ పాడవుతోంది. వీటికి చెక్ పెట్టేందుకు ప్రకృతి సిద్ధంగా ఏ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా తమ ఇంటిపైన మిద్దె తోట సాగు చేపట్టారు కాకినాడకు చెందిన వాసిరెడ్డి సూర్యప్రకాశరావు, సుజాత దంపతులు. గతంలో మార్కెట్‌నుంచి కూరగాయలు, ఆకుకూరలు కొనుగోలు చేసి ఉపయోగించేవారు. అవితినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఆస్పత్రులకు ఎంతో డబ్బు ఖర్చుపెట్టేవారు. దీంతో వీరికి మిద్దెతోట ఆలోచన వచ్చింది. సారవంతమైన మట్టి తెచ్చి ఇంట్లో ఉన్న పనికిరాని డబ్బాలు, డ్రమ్ముల్లో మట్టిని నింపి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల విత్తనాలు నాటారు. ఎటువంటి రసాయనిక ఎరువులు వేయకుండా పశువుల పేడ మాత్రమే ఉపయోగిస్తూ సాగు చేపట్టారు.
ఏఏ రకాలు పండిస్తున్నారు..
వంగ, బెండ, టమాటా, చిక్కుడు, పచ్చిమిర్చి మొదలైన కూరగాయలతోపాటు గోంగూర, కొత్తిమీర, తోటకూర వంటి ఆకుకూరలు, మామిడి, జామ, డ్రాగన్, నారింజ, నిమ్మ, బొప్పాయి, బత్తాయి, లక్ష్మీఫలం వంటి పండ్లను కూడా సాగు చేస్తున్నారు. గులాబీ, కనకాంబరం, బంతి, మొదలైన పూల మొక్కలతోపాటు గోరింటాకు వంటి మొక్కలను పెంచుతున్నారు. తమ కుటుంబ అవసరాలకు పోను మిగిలినవి బంధువులకు, స్నేహితులకు ఉచితంగా ఇస్తున్నారు.
మొక్కల పెంపకం అంటే ఇష్టం..
మాకు మొక్కలుపెంచడం అంటే ఇష్టం. ఇప్పుడంతా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడి పండించిన కూరగాయలనే తినాల్సి వస్తోంది. అందుకనే మేడపైనే మిద్దె తోట సాగు చేపట్టాం. రోజుకు రెండు గంటల పాటు మిద్దె తోటలో పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
-వాసిరెడ్డి సుజాత, గృహిణి, కాకినాడ