Share News

మెడికోలను చిదిమేసిన జలఖడ్గం

ABN , Publish Date - Sep 24 , 2024 | 12:36 AM

ఆనందంలో మునిగితేలుతున్న ఆ క్షణాలు.. వారికి చివరి క్షణాలయ్యాయి. వైద్య విద్యతో ఒకరికి ప్రాణదానం చేయాల్సిన వీరిని మృత్యువు.. క్షణాల్లో విగతజీవులుగా మార్చేసింది. నిజానికి ప్రకృతి సోయగాలకు అసలైన అందం జలపాతాలే. కొండకోనల్లోంచి పొంగిపొర్లుకుంటూ వాగుల్లోకి వచ్చే దృశ్యాలను వీక్షించేవారు కొందరైతే, పచ్చని ప్రకృతి ఒడిలోంచి వడివడిగా వస్తున్న ఆ చల్లని జలాల్లో ఈదులాడాలని ఉరకలెత్తేవారు కొందరు. ఆ తహతహే కొందరిని మృత్యువు తన ఒడిలోకి లాగేసుకుంటోంది.

మెడికోలను చిదిమేసిన జలఖడ్గం

ఒకరి తలకు, నుదిటికి తీవ్ర గాయాలు

మరొకరి ముఖం ఛిద్రం

జలతరంగిణి సృష్టించిన విలయం

ఏడడుగుల ఎత్తులో ప్రవాహం

ఇప్పటికీ కురుస్తున్న వర్షం

ఇద్దరు విద్యార్థినుల మృతదేహాలు లభ్యం

మరొక విద్యార్థి కోసం గాలింపు

రంగంలోకి ఎనడీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

మారేడుమిల్లి, సెప్టెంబరు 23: ఆనందంలో మునిగితేలుతున్న ఆ క్షణాలు.. వారికి చివరి క్షణాలయ్యాయి. వైద్య విద్యతో ఒకరికి ప్రాణదానం చేయాల్సిన వీరిని మృత్యువు.. క్షణాల్లో విగతజీవులుగా మార్చేసింది. నిజానికి ప్రకృతి సోయగాలకు అసలైన అందం జలపాతాలే. కొండకోనల్లోంచి పొంగిపొర్లుకుంటూ వాగుల్లోకి వచ్చే దృశ్యాలను వీక్షించేవారు కొందరైతే, పచ్చని ప్రకృతి ఒడిలోంచి వడివడిగా వస్తున్న ఆ చల్లని జలాల్లో ఈదులాడాలని ఉరకలెత్తేవారు కొందరు. ఆ తహతహే కొందరిని మృత్యువు తన ఒడిలోకి లాగేసుకుంటోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఆదివారం ఏలూరు ఆశ్రమ్‌ వైద్య కళాశాలకు చెందిన 14 మంది విద్యార్థులు విచ్చేశారు. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో ఐదుగురు కొట్టుకుపోగా వీరిలో గాయత్రి పుష్ప, చింతా హరిణి ప్రియ గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, ఎనడీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన బృందాలు మొత్తం 40 మంది ఆదివారం సాయంత్రం నుంచి మిగిలిన ముగ్గురి కోసం తీవ్ర స్థాయిలో గాలించాయి. రెవెన్యూ, అగ్నిమాపక, అటవీ అధికారుల సమన్వయంతో నిరంతరాయంగా రెస్క్యూ ఆపరేషన కొనసాగుతోంది. ఆదివారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా బొబ్జిలి సమీపంలోని డొంకినవలస గ్రామానికి చెందిన బాలి అమృత (22) మృతదేహాన్ని కనుగొన్నారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బొబ్బిలికి చెందిన కొసిరెడ్డి సౌమ్య(21) మృతదేహాన్ని కనుగొన్నారు. మరొక విద్యార్ధి ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన చింతకుంట్ల హరిదీప్‌(20) ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశాల మేరకు ఎనడీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగించాయి. రంపచోడవరం ఏఎస్పీ జగదీష్‌ అడహళ్లి, డీఎఫ్‌వో బబిత, మారేడుమిల్లి సీఐ సీహెచ మురళీకృష్ణ, తహసీల్దారు కారం సుబ్బారావు గాలింపు చర్యలను పర్యవేక్షించారు.

ఎంత ఘోరం..

మెడికోలు ఆదివారం మధ్యాహ్నం ఒకటిన్నర-రెండు గంటల మధ్య ఇక్కడ స్నానాలకు దిగారు. అప్పటికే వర్షం మొదలైంది. దీనికితోడు కొండల్లోంచి భారీగా వరదనీరు ముంచెత్తింది. ఒక ఉప్పెన మాదిరిగా విలయతాండవం చేస్తూ ఒక్కసారిగా జలతరంగిణి భయోత్పాతం సృష్టించింది. మొత్తం 14 మంది మెడికోలకుగాను ఐదుగురు చిక్కుకుపోయారు. వీరిలో ఒకరు ఏదోలా బయటపడగా, మరొకరిని సమీపంలో కాజ్‌వే వద్ద రక్షించారు. ఇక మిగిలిన వారిలో అమృత మృతదేహం జలతరంగిణి నుంచి కొట్టుకుపోయి ఒకటవ కాజ్‌వే దాటిన తర్వాత ఇసుక దిబ్బ వద్ద లభ్యమైంది. ప్రవాహ వేగానికి రాళ్లకు కొట్టుకుపోవడంతో నుదుటి మీద, తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షణాల్లోనే మృతి చెందినట్టు భావిస్తున్నారు. అలాగే సౌమ్య మృతదేహం కూడా అదే ప్రాంతంలోని తుప్పల్లో చిక్కుకుపోయింది. సౌమ్యకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ముఖం ఛిద్రమైంది. రాళ్ల దెబ్బలకు తగిన గాయాలకే ఆమె కూడా మృతి చెంది ఉండొచ్చని తెలుస్తోంది. జలఖడ్గంలా వచ్చిన పడిన ప్రవాహం అరగంటలో వర్షం తగ్గగా, కొద్దిసేపటికే కొంత తగ్గుముఖం పట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రవాహం మొదటి కాజ్‌వే ప్రాంతంలో ఏకంగా ఏడడుగులుపైనే ఉంటుందని చెబుతున్నారు. మళ్లీ సోమవారం మధ్యాహ్నం ఆకస్మికంగా వర్షం కురవడంతో జలతరంగిణి వద్ద ఒక్కసారిగా జలప్రవాహం పెరిగిపోయింది. దాంతో గాలింపు చర్యలను సైతం నిలిపివేయాల్సి వచ్చింది. సాయంత్రం వర్షం తగ్గాక మరొక విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జలతరంగిణి నుంచి పాములేరు వాగు వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. వాగు వంపులు తిరుగుతూ వెళుతుంది. దాంతో ప్రవాహ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రెండో కాజ్‌వే వద్ద తూముల్లో కూడా గాలించారు.

Updated Date - Sep 24 , 2024 | 12:36 AM