Share News

మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తీరుపట్ల అసంతృప్తి

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:25 AM

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ పనితీరు పట్ల పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అధికార కూటమి శాసనసభ్యులు సైతం మంత్రి సుభాష్‌తో పెద్దగా సఖ్యత ప్రదర్శించకపోవడంతో ఆయన ఏకాకిగానే నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు.

 మంత్రి వాసంశెట్టి సుభాష్‌ తీరుపట్ల అసంతృప్తి

నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తుల ఏలుబడి

పట్టభద్రుల ఓట్ల నమోదులో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం

పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరిక

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్‌ పనితీరు పట్ల పార్టీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అధికార కూటమి శాసనసభ్యులు సైతం మంత్రి సుభాష్‌తో పెద్దగా సఖ్యత ప్రదర్శించకపోవడంతో ఆయన ఏకాకిగానే నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తున్నారు. మంత్రి సుభాష్‌ సొంత నియోజకవర్గమైన రామచంద్రపురం కంటే పక్కనే ఉన్న అమలాపురం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంలోనే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు జిల్లాస్థాయిలో జరిగే సమీక్షా సమావేశాలు గానీ, ఇతర కీలక సమావేశాలకు సుభాష్‌ గైర్హాజరవుతున్నారనే విమర్శలు ఇటీవల కాలంలో వ్యక్తమవుతున్నాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తుల ఏలుబడిలోనే కార్యకలాపాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల ముందు వరకు వైసీపీలో ఉన్న సుభాష్‌ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. వెంటనే రామచంద్రపురం అసెంబ్లీ టిక్కెట్‌ కోసం చేసిన ప్రయత్నాలు సామాజిక కోణంలో ఫలవంతమయ్యాయి. దాంతో ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఐదు నెలలు దాటుతున్న తరుణంలో మంత్రి సుభాష్‌ పనితీరు పట్ల ఇటు జిల్లా ఎమ్మెల్యేలతో పాటు అటు సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఆయన పనితీరుకు అద్దం పడుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు జాయిన్‌ చేసే విషయంలో నియోజకవర్గంలో సుభాష్‌ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటు పార్టీ కోసం పనిచేయని మీకు రాజకీయాలెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యే అయ్యావ్‌. పార్టీ గౌరవించి ఫస్ట్‌టైమ్‌ ఎమ్మెల్యే అయినా మంత్రిని చేశాం. అయినా పనితీరు మార్చుకోకపోతే సహించబోనంటూ సీఎం చంద్రబాబు సుభాష్‌ను నేరుగానే హెచ్చరించారు. మీ పద్ధతి మారకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటానంటూ అసహనం కూడా వ్యక్తం చేశారు. దీనికితోడు ఇటీవల జరుగుతున్న కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రి సుభాష్‌ పేరును కనీసం బ్యానర్‌లో కూడా పెట్టని తీరు చూస్తుంటే ఆయనతో వారికున్న సఖ్యత ఏ పాటిదో అర్థమవుతోంది. సభ్యత్వాల నమోదే కాదు నియోజకవర్గంలో టీడీపీ, కూటమి శ్రేణుల పట్ల మంత్రి సుభాష్‌ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ అక్కడక్కడా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. రామచంద్రపురం కేంద్రంగా మంత్రి బంధు వర్గీయులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తనిఖీలు చేయడం అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం వంటివి ఇటీవల జరిగాయి. నియోజకవర్గంలో పార్టీ పట్టు కోల్పోతుందనే ఆ పార్టీ నాయకత్వం ఆవేదన చెందుతున్నప్పటికీ పట్టించుకునేవారే కరువయ్యారు.

Updated Date - Nov 05 , 2024 | 12:25 AM