సాదాసీదాగా కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:49 AM
వర్షాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నందున శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ అధికారులకు సూచించారు.
ముమ్మిడివరం, మే 31: వర్షాకాలం సీజన్ త్వరలో ప్రారంభం కానున్నందున శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ అధికారులకు సూచించారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వర్షాకాలం సీజన్‌లో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రత్యేకశానిటేషన్ నిర్వహణపై వైద్యఆరోగ్యశాఖ, నగర పంచాయతీ అధికారులు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సమావేశం కేవలం శానిటేషన్ నిర్వహణ, మంచినీటి సరఫరాకు సంబంధించి చేపట్టవలసిన చర్యలు, వాటి నిర్వహణకు నిధులు మంజూరుపై చర్చించి సమావేశాన్ని సాదాసీదాగా ముగించారు. ప్రత్యేక శానిటేషన్ నిర్వహణకు సంబంధించి బ్లీచింగ్, క్రిమిసంహారక మందుల కొనుగోలు, అవసరమైన కన్జెర్వన్సీ సామగ్రి కొనుగోలుకు రూ.2లక్షలు, మంచినీటి సరఫరాకు సంబంధించి 20 వార్డుల్లో పైపులైన్ల నిర్వహణ, పంపులు, మోటార్లు, వాటర్ పైపులైన్ల లీకేజీ వంటి మరమ్మతుల కోసం నగర పంచాయతీ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసేందుకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత 4వ వార్డు కౌన్సిలర్ భార్య, వార్డు వలంటీరు అబ్బాదాసుల వెంకటలక్ష్మి ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేసింది. ఆమె అందించిన సేవలను కొనియాడారు. సమావేశంలో కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి, వైస్‌చైర్మన్ వేటుకూరి బోసురాజు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.