వాడీవేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Oct 08 , 2024 | 12:27 AM
అమలాపురం పురపాలక సంఘంలో చెరువుల ఆక్రమణలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు.. రక్షిత తాగునీటికి బదులు కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత తాగునీటిని సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు.
అమలాపురం టౌన్, అక్టోబరు 7: అమలాపురం పురపాలక సంఘంలో చెరువుల ఆక్రమణలు.. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు.. రక్షిత తాగునీటికి బదులు కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అంశాలపై అధికార, విపక్ష కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత తాగునీటిని సరఫరా చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందన్నారు. అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా అమలాపురంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాలను తొలగించాలంటూ వచ్చిన ఉత్తర్వులపై వాడివేడిగా చర్చ జరిగింది. తొలగిస్తే పట్టణంలో ఉన్న అన్ని విగ్రహాలను తొలగించాలని ఏవో రెండు విగ్రహాలను తొలగించడం సమంజసం కాదన్నారు. కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యవహరించవద్దని సభ్యులు అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ అమలాపురం పట్టణంలో పురపాలక సంఘానికి సంబంధించి ఏడు చెరువులు 31 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని ప్రస్తుతం ఎన్ని చెరువులు ఉన్నాయి. ఎంతమేర ఆక్రమణలకు గురైందో మున్సిపల్ అధికారులు గుర్తించారా అని ప్రశ్నించారు. మెయిన్‌రోడ్డులోని కంచర చెరువు ఆక్రమణలకు గురై కనుమరుగైన వ్యవహారంపై అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశానని ఆయన గుర్తుచేశారు. పట్టణంలోని సుబ్బారాయుడు చెరువు డంపింగ్ యార్డుగా మారిపోతే మిగిలిన చెరువులు అంతకంతకు ఆక్రమణలకు గురై కుంచించుకుపోతున్న విషయం మున్సిపల్ అధికారులకు పట్టడం లేదా అని ప్రశ్నించారు. చెరువులు, మురుగుకాల్వలు, రహదారులు ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని తొలగించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అవుతుందని ఫిర్యాదులు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు తిక్కా సత్యలక్ష్మి, అబ్బిరెడ్డి చంటి, మట్టపర్తి నాగేంద్ర ప్రశ్నించారు. ఇప్పటికే పట్టణ ప్రజలు మురుగనీటితో అనారోగ్యాలకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా కోసం లక్షలు ఖర్చు చేస్తున్నా సురక్షిత నీరు అందించకపోవడం సిగ్గుచేటని కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకురాకుండా పురపాలక సంఘం పక్కనున్న భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు కేటాయించడం ఏమిటని పడాల శ్రీదేవి ప్రశ్నించారు. సభ్యులకు తెలియకుండానే కాంట్రాక్టరు పనులు ప్రారంభించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం మిగులు నిధులు రాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్‌కు పంపించిన విషయాన్ని కౌన్సిల్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కౌన్సిలర్ గండి దేవిహారిక ప్రశ్నించారు. మున్సిపల్ డీఈ సతీష్ మాట్లాడుతూ గత నెల 30వ తేదీన సమావేశం నిర్వహించాలనుకున్నామని, అది రద్దు అవ్వడం వల్ల చెప్పలేకపోయామన్నారు. గత మున్సిపల్ కౌన్సిలర్లకు తెలియచేయకుండా కోట్లాది రూపాయిలు బిల్లుల చెల్లింపు చేశారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ దీపాలకు ఆరు నెలల కాలానికి రూ.35 లక్షలు ఎలా కేటాయించారని కౌన్సిలర్ అబ్బిరెడ్డి చంటి ప్రశ్నించారు. పూర్తిస్థాయిలో వీధి దీపాలు వెలిగించడం లేదని మండిపడ్డారు. మార్కెట్‌లో నిల్వ మాంసం, చేపలు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ బండారు గోవిందు ప్రశ్నించారు.చెత్త పన్ను రద్దు అంశంపై చర్చ నిర్వహించారు. సమావేశంలో ప్రతిపక్ష నేత యేడిద శ్రీను, కౌన్సిలర్లు పిండి అమరావతి, సంసాని బులినాని, రుద్రరాజు నానిరాజు, గొవ్వాల రాజేష్, వాసర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.