Share News

ఏంటీ పని!

ABN , Publish Date - Oct 22 , 2024 | 01:06 AM

ఛాయ్‌ మనస్సుకు మందురా భాయ్‌.. ఈ ఛాయ్‌ గళాసుకీ జైజై అంటూ ఓ సినీ కవి ఛాయ్‌పై ఓ గీతాన్ని రచించాడు.. దీనిలో టీ వినియోగంపై ఎంత మోజు ఉందో అర్థమవుతుంది.

ఏంటీ పని!
జీడిపిక్కలు, చింత పిక్కల పొడులను కళ్ళంలో ఆరబెడుతున్న కూలీలు

బూట్‌ పాలిష్‌ పేరుతో నకిలీ టీపొడి

ప్రజారోగ్యంతో వ్యాపారుల ఆటలు

జిల్లాలో అనేక చోట్ల తయారీ ప్రక్రియ

రాష్ట్రంలో అనేక చోట్లకు సరఫరా

అధికారులు స్పందించాలని డిమాండ్‌

అనపర్తి అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : ఛాయ్‌ మనస్సుకు మందురా భాయ్‌.. ఈ ఛాయ్‌ గళాసుకీ జైజై అంటూ ఓ సినీ కవి ఛాయ్‌పై ఓ గీతాన్ని రచించాడు.. దీనిలో టీ వినియోగంపై ఎంత మోజు ఉందో అర్థమవుతుంది. సాధారణంగా కూలీ నుంచి కోటీశ్వరుడి దాకా టీ అంటే ఇష్టపడని వారుండరు. టీ తయారీలో ప్రధానంగా కావలసిన టీపొడి ధరలు మాత్రం సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో అనేక ప్రాంతాలలో నకిలీ టీ పొడి తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కంపెనీ టీ పొడిని తలదన్నే విధంగా అనేక రసాయనాలను కలిపి విక్రయాలు చేసి ప్రజారోగ్యాన్ని కొల్లగొడుతున్నారు. నిన్న మెన్నటి వరకు నాసి రకం తేయాకును తెచ్చి దానికి కొంచెం కెమికల్స్‌ను గుప్పించి తక్కువ ధరలకు విక్రయాలు సాగించేవారు. ఇటీవల నకిలీ టీ పొడి కొత్త పుంతలు తొక్కింది. జీడిపిక్కలు పొడి, చింత పిక్కల పొడిని తయారు చేసి డికాషన్‌ వచ్చే విదంగా కెమికల్స్‌ అద్ది టీ పొడిగా విక్రయాలు సాగించే ముఠాలు పెచ్చు మీరిపోతున్నాయి. జిల్లాలో అనేక చోట్ల గొడౌన్లను అద్దెకు తీసుకుని అక్కడికి చింతపిక్కలు, జీడి పిక్కల పొట్టును తెచ్చి ప్రత్యే కంగా తయారు చేసిన యంత్రాల ద్వారా వీటిని గుండ చేస్తున్నారు. తరువాత గుండను గొడౌ న్లలోని కళ్ళంలో ఆరబెట్టి గొడౌన్లలో ఏర్పాటు చేసిన యంత్రాలతో టీపొడిని తయారు చేస్తు న్నారు.ఆ పొడిని బస్తాల ద్వారా చిన్న చిన్న టీ పొడి తయారీ కేంద్రాలకు తరలించగా అక్కడ ఈ పొడికి రంగు, రుచి, సువాసన వచ్చే విదంగా మరిన్ని కెమికల్స్‌ను జోడించి వివిధ బ్రాండ్ల పేరుతో తయారు చేసిన కవర్లలో ప్యాకింగ్‌లు చేసి విక్రయాలు సాగిస్తున్నారు. నిర్వాహకులు బూట్‌ పాలిష్‌కు ముడి సరుకుగా వినియోగిం చేందుకు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నామంటూ అధికారులను నమ్మ బలుకుతున్నారు. గతంలో అనపర్తి, బిక్కవోలు మండలాల్లో ఈ తరహా నకిలీ టీ పొడి తయారీపై అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. దీంతో నిర్వాహ కులు తమ దందాను మరో చోటికి మార్చారు. తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ నకిలీ టీ పొడి తయారీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తే వారి ఆట కట్టించవచ్చని ప్రజలు భావిస్తున్నారు. కల్తీ టీ పొడి భారిన పడి అనేక కుటుంబాలు అనారోగ్యాల భారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు.. ఒక్కో పరిశ్రమ నుంచి రోజుకు వంద బస్తాల వరకు టీ పొడి తయారు చేయడమే కాకుండా రాష్ట్ర నలుమూలలకు సరఫరా అవుతుంది. నకిలీ డీపొడిని తయారు చేసేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు. జీడి పిక్కల పొట్టు, చింత పిక్కల ఫౌడర్‌ను యంత్రాల్లో ఆడించి మూడు రకాల పొడులు విడదీసి వాటిని కళ్ళంలో ఆరబెట్టి సంచుల్లో నింపుతున్నాను. ఈ సంచులను రాత్రి సమయాలలో తరలిస్తున్నారు. అయితే ఈ టీపొడి కేజీ 200 నుంచి రూ. 300 వరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఇలా రవాణా చేసిన టీపొడి వివిధ ప్యాకింగ్‌ల రూపంలో తయారు చేసి పెద్ద ఎత్తున విక్రయాలు సాగిస్తున్నారు. అనపర్తి పరిసరాల నుండి ఇన్‌స్టాల్‌ మెంట్‌ వ్యాపారం నిర్వహించే అనేక మంది రెండు తెలుగు రాష్ట్రాల్లోను వ్యాపారాలు సాగిస్తుండగా నకిలీ టీ పొడి వ్యాపారులు వీరిని ఆశ్ర యించి ఈ టీపొడిని వారి ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు.దీంతో ఎవరికి అనుమానం రాకుం డా సరుకులు సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. కల్తీ టీపొడిని తయారు చేసే కేంద్రాలపై నిఘూ పెట్టి వీటిని అరికట్టకపోతే ఎంతో మంది ఆరోగ్యాలు పాడవుతాయని అఽధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నకిలీ టీ పొడితో జీర్ణకోశ వ్యాధులు

నకిలీ పొడికి వినియోగించే రసాయనాలతో అనేక వ్యాధులు వ్యాపించడమే కాకుండా ప్రాణాంత కంగా కూడా మారతాయి. గ్యాస్ట్రిక్‌, అల్సర్‌, గ్యాస్‌ ట్రైటిస్‌ వ్యాధులతో పాటు కేన్సర్‌కు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. ఈ రసాయనాలు క్రమేపి రక్తంలో ప్రవేశించడం ద్వారా లివర్‌, కిడ్నీలకు సం బంధిత వ్యాదులు వస్తాయి. రక్త హీనత ఏర్పడుతుంది. కంటి చూపు మందగించడం, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కు వ. చిన్నారుల్లో ఎదుగుదల క్షీణించడమే కాకుండా అనేక వ్యాధులు వచ్చి జ్ఞాపక శక్తి లోపిస్తుంది. - డాక్టర్‌ తాడి రామగుర్రెడ్డి సూపరిండెంట్‌ ఏరియా ఆసుపత్రి అనపర్తి

Updated Date - Oct 22 , 2024 | 01:06 AM