వారం వ్యవధిలో నలుగురు చిన్నారుల మృతి
ABN , Publish Date - Aug 05 , 2024 | 12:51 AM
వారం వ్యవఽధిలో నలుగురు చిన్నారులు మృతి చెందడం మన్యంలో ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఈ దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నా యి.
మలేరియా, టైఫాయిడ్, శ్వాస కోస సమస్యలే కారణమా?
చింతూరు, ఆగస్టు 4: వారం వ్యవఽధిలో నలుగురు చిన్నారులు మృతి చెందడం మన్యంలో ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని వేర్వేరు గ్రామాల్లో ఈ దురదృష్టకర ఘటనలు చోటుచేసుకున్నా యి. కన్నాపురానికి చెందిన సవలం కన్నారావు-నాంచారమ్మ దంపతుల మూడు నెలల పసిబిడ్డ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతోంది. అంతేగాక తరచూ వాంతులు కూడా అవుతున్నాయి. దీంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి గురువారం తీసుకెళ్లారు. శనివారం ఉదయం వరకు చికిత్స అందించిన వైద్యులు మధ్యాహ్న సమయానికి పరిస్థితి విషయమించిందని చేతులెత్తేశారు. చేసేదిలేక మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బిడ్డ ప్రాణాలు లేవని రెండో ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. కన్నాపురం సమీపంలోని గంగన్నమెట్టలో కన్నారావు బంధువైన సున్నం దుర్గారావు రెండు నెలల పసిబిడ్డ కూడా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ ఆరు రోజుల క్రితం మృతి చెందింది. ఇదే మండలం లోని బొడ్డుగూడేనికి చెందిన సమ్మక్క 13 నెలల కూతురు జ్వరం బారిన పడింది. ముందుగా చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ పసి బిడ్డ మార్గమధ్యంలో మృతి చెందింది. చదలవాడకు చెందిన సాందల దేవిరెడ్డి-భద్రమ్మ 11 నెలల పసిబిడ్డ టైఫాయిడ్ బారిన పడింది. రెండు రోజుల పాటు చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించగా ఈ నెల 2వ తేదీన మృతి చెందింది. కాగా మరణాల విషయాన్ని చింతూరు డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ పుల్లయ్య దృష్టికి ‘ఆంధ్రజ్యోతి’ తీసుకెళ్లగా సమీక్షిస్తున్నామని చెప్పారు.
పుట్టిన ప్రతి బిడ్డా మృతే
ఇప్పటికి ముగ్గురు అదే తీరున ప్రాణాలొదిలారు
శోక సంద్రంలో తల్లిదండ్రులు
చింతూరు, ఆగస్టు 4: ఆ దంపతులకు పుట్టిన ప్రతి బిడ్డ మృత్యువాత పడుతోంది. ఇప్పటికి ముగ్గురు మగ బిడ్డలు ఒకే తీరున మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతాఇంతా కాదు. అ ల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం, కన్నాపు రంలో చోటుచేసుకున్న ఈ విషా దకర ఘటన వివరాలు. కన్నాపురానికి చెందిన కన్నారావు నాంచారమ్మల మూడు నెలల పసిబిడ్డ శ్వాసతీసుకోవడంలో ఏర్పడ్డ ఇబ్బందికి తోడు వాంతుల బారిన పడి శనివారం మృతి చెందింది. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఐతే ఈ దురదృష్టకరమైన ఘటన ఆ కుటుంబంలో ఇదే మొదిటిది కాదు. ఇప్పటికి ఇది మూడోసారి కావడం విశేషం. కన్నారావు నాంచారమ్మల వివాహం 2019లో జరిగింది. తొలుత వారికి ఒక మగ బిడ్డ జన్మించింది. కాగా మూడు నెలల వయస్సులో ఆ బిడ్డ శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బంది పడుతూ మృతి చెందింది. ఆ పిదప మరో మగ బిడ్డకు ఆ తల్లి జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా అదే తీరున మూడు నెలల వయస్సులోనే మృతి చెందినది. తాజాగా మరో బిడ్డకు నాంచారమ్మ దంపతులకు కలగింది. ఐతే ఈ బిడ్డకు కూడా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది మొదలైంది. దీంతో ఎట్టాగైనా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు తపించారు. ఈ మేరకు తమవద్దనున్న సొమ్ములన్ని పట్టుకొని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి పరుగులు తీసారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స జరిగింది. ఎంతఖర్చుకైనా వెనుకాడేదిలేదని ఆ దంపతులు భావించారు. తల తాకట్టుపెట్టైన బిడ్డ ప్రాణాలు నిలుపుకోవాలని వారు పట్టుపట్టుకకూర్చున్నారు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మానారు. ఐతే వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరకు ఈ బిడ్డకూడా తుదిశ్వాస విడచింది. దీంతో ఏమి తోచని స్థితిలో ఆ దంపతులు కొట్టుమిట్టాడు తున్నారు.