Share News

ఓఎన్జీసీ సైట్‌లో భారీగా శబ్దాలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:47 AM

చల్లపల్లి ఓఎన్జీసీ సైట్‌లో జీఎండీఏ-14 బావి నుంచి బుధవారం అర్ధరాత్రి బ్లోఅవుట్‌ను తలపించేలా భారీ శబ్దాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో బెస్తవారిపేట, గోపవరం మెయిన్‌, కోటమాయమ్మకాలనీ, జగ్గరాజుపేట, అయితాబత్తులవారిపేట పరిసర ప్రాంతాల జనం భయాందోళనకు గురయ్యారు. బ్లోఅవుట్‌ భయంతో పరుగులు తీఽశారు. విషయాన్ని కొందరు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు.

 ఓఎన్జీసీ సైట్‌లో భారీగా శబ్దాలు
చల్లపల్లి జీఎండీఏ-14 బావి

ఉప్పలగుప్తం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): చల్లపల్లి ఓఎన్జీసీ సైట్‌లో జీఎండీఏ-14 బావి నుంచి బుధవారం అర్ధరాత్రి బ్లోఅవుట్‌ను తలపించేలా భారీ శబ్దాలు వెలువడ్డాయి. అర్ధరాత్రి ఏమి జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో బెస్తవారిపేట, గోపవరం మెయిన్‌, కోటమాయమ్మకాలనీ, జగ్గరాజుపేట, అయితాబత్తులవారిపేట పరిసర ప్రాంతాల జనం భయాందోళనకు గురయ్యారు. బ్లోఅవుట్‌ భయంతో పరుగులు తీఽశారు. విషయాన్ని కొందరు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు. గురువారం వేకువజామున అధికారులు వచ్చి గ్యాస్‌ లీకేజీని నియంత్రించారు. అత్యధిక ఒత్తిడితో గ్యాస్‌ బయటకు రావడంతో పెద్దపెద్ద శబ్దాలు వెలువడినట్టు ఓఎన్జీసీ అధికారులు విశ్లేషించారు. అయితే గ్యాస్‌ లీక్‌కు అసలు కారణం మాత్రం వైట్‌ ఆయిల్‌ చోరులే అని అక్కడి ఆనవాళ్లను బట్టి గుర్తించారు. వైట్‌ ఆయిల్‌ చోరీకి వచ్చినవారు ఆయిల్‌ పైప్‌ వాల్వ్‌కు బదులు గ్యాస్‌ పైప్‌ మీటర్‌ వాల్వ్‌ను తెరవడంతో ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఒకే సారి ఎక్కువ పీడనంతో గ్యాస్‌ వెలువడటంతో భయంకర శబ్దాలు వెలువడ్డాయి. దొంగలు తమ వాహనాన్ని దూరంగా ఉంచి, కేవలం టిన్నులనే సైట్‌లోకి తీసుకురావడంతో పెనుప్రమాదం తప్పిందని అంచనా వేస్తున్నారు. వాహనాన్ని బావి వద్దకు తీసుకొస్తే నిప్పంటుకుని తీవ్రస్థాయిలో మంటల చెలరేగి భారీ అగ్నిప్రమాదం జరిగేదని అంటున్నారు. జరిగిన సంఘటనలో ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం ఉందని స్థానిక రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఎన్జీసీ ఐ.ఎం రామచంద్రుడు, రైతుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ మొత్తం ఉదంతంపై రైతులు రమేష్‌రాజు, జగన్‌రాజు, ఇసుకపట్ల రఘుబాబు, గొలకోటి చిన్నా, ధారపురెడ్డి శ్రీధర్‌ తదితరులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. చల్లపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఓఎన్జీసీ సైట్‌ల వల్ల తాము గతంలో ఆయిల్‌, గ్యాస్‌ లీకేజీల వల్ల ఎంతో నష్టపోయామని విన్నవించారు. సైట్‌ల వద్ద ఎటువంటి భద్రత లేక వైట్‌ ఆయిల్‌ చోరీలు జరుగుతున్నాయన్నారు. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. జీఎండీఏ-14 సైట్‌ వద్ద పరిసర ప్రాంతాల కుటుంబాలకు ఎటువంటి హాని జరగకుండా తగిన భద్రత కల్పించాలని కోరారు. నివాసాల చెంతన చమురు, గ్యాస్‌ ఉత్పత్తులకు తాము సహకరిస్తున్నా, ఓఎన్జీసీలో కొందరు అధికారులు మాత్రం తమ పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమకు జరిగిన నష్టాలకు అరకొరగా సాయం అందించి చేతులు దులుపుకున్న ఓఎన్జీసీతో భవిష్యత్‌లో తాము పోరాటాలు చేసే పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.

Updated Date - Oct 25 , 2024 | 12:47 AM