షోలాపూర్ ఉల్లి వచ్చినా..లొల్లి!
ABN , Publish Date - Nov 16 , 2024 | 01:41 AM
మహారాష్ట్ర పాత ఉల్లిపాయలు మార్కెట్‌లో దొరకడంలేదు. హోల్‌సేల్ ట్రేడర్లు నో స్టాక్ అని చెబుతున్నారు. రేటు ఎంతైనా కొందామని ప్రయత్నిస్తున్నా చాలా మంది ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో లేకుండా పోయాయి.
కొత్త ఉల్లి ధరలకు రెక్కలు
మార్కెట్లో కిలో రూ.80 పైనే
భారీగా పెరుగుతున్న రేట్లు
సామాన్యుల బెంబేలు
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మహారాష్ట్ర పాత ఉల్లిపాయలు మార్కెట్‌లో దొరకడంలేదు. హోల్‌సేల్ ట్రేడర్లు నో స్టాక్ అని చెబుతున్నారు. రేటు ఎంతైనా కొందామని ప్రయత్నిస్తున్నా చాలా మంది ఎగువ మధ్యతరగతికి ఇవి అందుబాటులో లేకుండా పోయాయి. మహారాష్ట్ర నుంచి సరుకు రావడంలేదని, లారీలు ఎప్పుడొస్తాయో తెలియదని ఇక్కడి ట్రేడర్లు చేతులెత్తేస్తున్నారు.ఒకరిద్దరు హోల్‌సేల్ ట్రేడర్లు ధైర్యం చేసి రెండు, మూడు లారీలు రప్పిస్తున్నా వాటిని సెమీహోల్‌సేల్,సూపర్ మార్కెట్లు హాట్‌కేకుల్లా పట్టుకుపోతున్నారు. మధ్యతరగతి ప్రజలకు అందనీయడంలేదు. దీంతో షోలాపూర్ రకం కొత్త ఉల్లిపాయలకు సెమీ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఈ రకం ఉల్లి ఏ మాత్రం నిల్వ ఉండకపోయినా ధర మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. నాణ్యత అంతంతమాత్రంగా ఉండి, నిల్వకు ఏ మాత్రం పనికిరాని షోలాపూర్ రకం ఉల్లిపాయలను హోల్‌సేల్‌లోనే కిలో రూ.45 నుంచి రూ.50ల వరకూ విక్రయిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక సూపర్‌మార్కెట్లు, సెమీ హోల్‌సేల్ వ్యాపారుల వద్ద అరకొరగా దొరికే పాత ఉల్లిపాయలు కిలో రూ.80పైనే విక్రయిస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు సామాన్యులతో పాటు మధ్యతరగతి వర్గాలను బెంబేలెత్తిస్తున్నాయి. రైతు బజార్లలో ఉల్లిపాయలు కిలో రూ.32లకు విక్రయిస్తున్నారు. కొంతమంది కర్నూలు రకం,మరికొందరు షోలాపూర్ ఉల్లిపాయలు విక్రయిస్తున్నా రు. ఇవి చాలా నాసిరకంగా ఉంటున్నా సామాన్య ప్రజలకు మరోదారి లేక కొనుగోలు చేస్తున్నారు.
కార్తీకమాసంలోనూ ఇలాగెందుకు..
దీపావళి తర్వాత మార్కెట్లోకి మహారాష్ట్ర కొత్త ఉల్లిపాయలు వస్తాయని, దీంతో ధరలు తగ్గుతాయని హోల్‌సేల్ ట్రేడర్లు చెబుతూ వచ్చారు. అనుకున్నట్టే షోలాపూర్ రకం కొత్త ఉల్లిపాయలు మార్కెట్‌లోకి వచ్చాయి. ఇదే సమయంలో కర్నూలు ఉల్లిపాయలు వచ్చినా మార్కెట్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. పరిస్థితి తారుమారైంది. మహారాష్ట్ర నాసిక్‌రకం పాత ఉల్లిపాయలు మార్కెట్‌కు రాకపోవడంతో నిల్వకు ఏ మాత్రం పనికిరాని షోలాపూర్ ఉల్లి ధరలు టాప్ రేటులో ఉన్నాయి. ట్రేడర్ల అంచనాలకు భిన్నంగా ధరలు మరింత పెరగడం ప్రారంభమయ్యాయి. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఉల్లి వినియోగం గణనీయంగా తగ్గుతుందని భావించినా ఆ పరిస్థితి కనిపించడంలేదు. ధరలు ఏ మాత్రం దిగిరావడంలేదు. ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందనే దానిపై హోల్‌సేల్ ట్రేడర్లు సైతం చెప్పలేకపోతున్నారు. దీంతో సామాన్యులు, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.