Share News

పవన్‌ షో..

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:58 AM

రాజోలు అనే పదం తనకు తీపి గుర్తు అని, కోనసీమ కొబ్బరి బొండం ఎంత తీపిగా ఉంటుందో 2019లో ఒక్క రాజోలు విజయం తనకు అంత ఆనందాన్ని ఇచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

పవన్‌ షో..
పవన్‌ అభిమానం : రోడ్‌ షోలో భాగంగా పవన్‌కు యువత జేజేలు

మలికిపురం, ఏప్రిల్‌ 26: రాజోలు అనే పదం తనకు తీపి గుర్తు అని, కోనసీమ కొబ్బరి బొండం ఎంత తీపిగా ఉంటుందో 2019లో ఒక్క రాజోలు విజయం తనకు అంత ఆనందాన్ని ఇచ్చిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజోలు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం బహిరంగ సభలో పవన్‌ ప్రసంగించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతుల సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తానన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే వైసీపీ నాయకులే అల్లర్లు సృష్టించారన్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పేరులో అల్లర్లు చేసిన అన్యం సాయి అనే వ్యక్తిని మంత్రి వెనకే తిరుగుతున్న సంగతిని అందరూ గమనిస్తున్నారన్నారు. మోరి, మోరిపోడుకు చెందిన అనేక మంది జీడిపప్పు పరిశ్రమను కుటీర పరిశ్రమగా గుర్తించమని అడిగారని, కూటమి పాలన రాగానే వారి కోరిక తీరుస్తామన్నారు. మత్స్యకార నాయకుడు కొపనాతి కృష్ణమ్మ అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం నిర్మించారని, అటువంటి చోట దుండగులు స్వామివారి రథాన్ని దగ్ధం చేస్తే నేటికీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. సీఎంపై గులకరాయి వేస్తే పోలీసులంతా హడావుడి చేశారని, అంతర్వేది రథంలో దోషులను మాత్రం గుర్తించడానికి ఖాళీ లేకుండా పోయిందన్నారు. నర్సాపురం-సఖినేటిపల్లి మధ్య వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి, కోనసీమలో రైలు కూత వినిపించడానికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి రాజోలు, పి.గన్నవరం, అమలాపురం తీర ప్రాంతాల్లో కేరళ, రాజస్థాన్‌ తరహా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఒక సెంటు భూమి ఇవ్వలేని వైసీపీ నాయకులు ఉన్నారని, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాత్రం కత్తిమండలో ఐదెకరాల్లో పెద్ద భవనం నిర్మించుకున్నారని ఆరోపించారు. రాజోలు ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్‌, పార్లమెంటు అభ్యర్థి హరీష్‌మాధుర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.అంతకు ముందు పవన్‌ ర్యాలీతో మలికిపురం రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. వారాహిపై అభ్యర్థులు గంటి హరీష్‌మాధుర్‌, దేవవరప్రసాద్‌లతో పాటు కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, మాజీ ఎమ్మెల్యే వేమా, లింగోలు పెద్దబ్బులు, ఎంపీపీలు కేతా శ్రీను, ఎంవీ సత్యవాణి, తాడి మోహన్‌, దిరిశాల బాలాజీ, గెడ్డం మహాలక్ష్మిప్రసాద్‌, గుండుబోగుల పెదకాపు, వనమాలి మూలాస్వామి ఉన్నారు.

కూటమి ప్రభుత్వం రాబోతోంది..

ద్రాక్షారామ, ఏప్రిల్‌ 26: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతుందని వైసీపీ అవినీతి కోటలు బద్దలు కొడుతున్నామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ బోసుబొమ్మ సెంటర్‌లో శుక్రవారం రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో ప్రసంగించారు.ర్యాలీగా అక్కడకు చేరుకునే సరికి 9.55 గంటలు కావడంతో సమయం లేక ఐదు నిమిషాలు మాత్రమే ప్రసం గించారు. రామచంద్రపురంలో జనసేన పోటీ చేయాల్సిందని, కూటమి ధర్మం ప్రకారం మన స్థానాలు టీడీపీకి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. ఈసారి స్థిరత్వం, సుస్థిరత కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, వలసలు ఆగాలి.. తాగు, సాగునీరు కావాలి, గుంతలు లేని రోడ్లు కా వాలి, కాలుష్యం పోవాలి అన్నారు. ప్రతిఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం కావాలి. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి వాసంశెట్టి సుభాష్‌ను గెలిపించాలని, ఎంపీ అభ్యర్థిగా హరీష్‌మాధుర్‌ను, మండపేటలో జోగేశ్వరరావును సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నియో జక వర్గ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్‌, టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జి సుజయకృష్ణ రంగారావు, మండపేట ఇన్‌ చార్జి వేగుళ్ల లీలాకృష్ణ, టీడీపీ నాయకులు రాయపురెడ్డి సూరిబాబు నెక్కంటి బాలకృష్ణ, రేవు శ్రీను, చింతపల్లి అర్జున్‌, తెలుగు యువత ఉపాధ్యక్షుడు అక్కల రిష్యంత్‌రాయ్‌, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ దూడల శంకరనారాయణ, జనసేన నాయకులు చిక్కాల దొరబాబు, బుంగరాజు, సంపతి సత్యనారాయణ పాల్గొన్నారు.

రాజోలు సమస్యలన్నీ పరిష్కరిస్తాం..

కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్‌

రాజోలులో నీటి ఎద్దడి అధికంగా ఉంది..ఏటిగట్లు, రోడ్లు, కాల్వలు, డ్రైనేజీలు అధ్వాన్నంగా ఉన్నాయని పవన్‌ దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామన్నారు.

రామచంద్రపురంలో వార్‌ వన్‌సైడ్‌

అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌

పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీ కోరుకుంటే ఏకంగా హగ్‌ ఇచ్చారు. ఆ ఒక్క ఫొటోతోనే తనను జనసైనికులు అక్కున చేర్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఈ రోజు పవన్‌ పర్యటనతో రామచంద్రపురంలో వార్‌ వన్‌సైడ్‌.

పవన్‌ బాటలో నడుస్తాం..

మండపేట అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు

పవన్‌కల్యాణ్‌ చూపిన బాటలో నడుస్తాం.. నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. జనసైనికులకు అండగా ఉంటాం.

Updated Date - Apr 27 , 2024 | 12:58 AM