Share News

మూడు నెలలకు ఒకేసారి

ABN , Publish Date - Nov 21 , 2024 | 12:43 AM

గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్‌ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్‌ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్‌ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

 మూడు నెలలకు ఒకేసారి

అమలాపురం రూరల్‌, (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో పింఛన్‌దారుడు ప్రతీ నెల పెన్షన్‌ తీసుకోవాల్సిందే. ఒక నెల అందుబాటులో లేకపోతే తర్వాత నెలలో ఆ పెన్షన్‌ వచ్చేది కాదు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక నెల పెన్షన్‌ నగదు తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని తర్వాత నెల పెన్షన్‌తో కలిపి ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఒక్కో సందర్భంలో రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మొత్తం నగదును అందజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో వృద్ధులతో పాటు దివ్యాంగులు హర్షం ప్రకటిస్తున్నారు. 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోను ఇదే విధానాన్ని అమలు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిబంధనల పేరుతో వృద్ధులకు నరకం చూపించారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉండేవారు కొందరైతే, వయోభారంతో ఇతర ప్రాంతాల్లోని కుమార్తెలు, కుమారుల ఇళ్ల వద్దకు వెళ్లేవారు కొందరు. ఇలా వారు ప్రతీ నెల పెన్షన్‌ అందుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటువంటి వారికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో ఊరట లభించింది. పెన్షన్‌ పంపిణీ నిర్ణయంపై జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ పీడీ డాక్టర్‌ వి.శివశంకరప్రసాద్‌ మాట్లాడుతూ మూడు నెలల పెన్షన్‌ ఒకేసారి తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెన్షన్‌ పంపిణీకి సంబంధించి ఫైలు ఇప్పటికే ప్రభుత్వం ఆర్థికశాఖకు పంపించింది. త్వరలోనే ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. ఉత్తర్వులు అందిన తర్వాత నిబంధనల మేరకు పెన్షన్లు పంపిణీ చేస్తాం. జిల్లా వ్యాప్తంగా 2,39,368 మంది పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతీ నెల ప్రభుత్వం రూ.99,44,08,500 నగదును కేటగిరీల వారీగా పంపిణీ చేయాల్సి ఉంది. నవంబరు నెలలో 2,37,323 మంది పెన్షన్‌దారులకు రూ.98.64 కోట్లు పంపిణీ చేశామని డీఆర్డీఏ పీడీ శివశంకరప్రసాద్‌ తెలిపారు. 2045 మంది వివిధ కారణాల వల్ల పెన్షన్‌ తీసుకోలేకపోయారు. వీరిలో 705 మంది మృతిచెందినట్టు గుర్తించారు. 346 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. 203 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో 605 మంది ఉండగా 186 మంది తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని వివరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు జరిగితే ఇటువంటి పేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుంది.

Updated Date - Nov 21 , 2024 | 12:43 AM