రారండోయ్.. చూసొద్దాం!
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:54 AM
మనకూ ఒకరోజు కావాలి.. మన నచ్చినట్టు ఉండాలి.. పదిమందితో కలిసి ఆనందంగా గడపాలి.. గంతులు వేయాలి.. ఆటలు ఆడాలి.. పాటలు పాడాలి.. డ్యాన్స్ చేయాలి.. ఆ రోజంతా ఖాళీగా గడపాలి.. ఇలా ఏడాదికి ఓ రోజు.. చాలు ఏడాదంతా జ్ఞాపకం చేసుకుంటూ బతికేస్తాం.. ఇదీ ప్రస్తుత తరం ఆలోచన.
కాకినాడ/ అమలాపురం/ రాజమహేంద్రవరం సిటీ/ దివాన్‌చెరువు/ కడియం/పెరవలి (ఆంధ్రజ్యోతి) : మనకూ ఒకరోజు కావాలి.. మన నచ్చినట్టు ఉండాలి.. పదిమందితో కలిసి ఆనందంగా గడపాలి.. గంతులు వేయాలి.. ఆటలు ఆడాలి.. పాటలు పాడాలి.. డ్యాన్స్ చేయాలి.. ఆ రోజంతా ఖాళీగా గడపాలి.. ఇలా ఏడాదికి ఓ రోజు.. చాలు ఏడాదంతా జ్ఞాపకం చేసుకుంటూ బతికేస్తాం.. ఇదీ ప్రస్తుత తరం ఆలోచన. ఎందుకంటే బిజీ జీవితం.. తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు.. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకూ పరుగులే.. ఎక్కడా ఖాళీ ఉండదు.. సాయంత్రానికి ఖాళీగా కూర్చుని ఆలోచిస్తే ఇంతేనా జీవితం అనిపిస్తుంది.. ఎందుకంటే ప్రస్తుతం ఉమ్మడిగా చేసుకునే పండుగల్లేవ్.. సరదాగా కలుసుకునే సందర్భాల్లేవ్.. వచ్చామా.. వెళ్లామా అంతే.. అందుకే కార్తీక మాసం సందర్భంగా ఏడాదికో మారు పిక్నిక్ పెట్టుకుంటున్నారు.. కుటుంబీకులు, స్నేహితులు కలిసి రీఫ్రెష్ అవుతున్నారు.. మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాల అని ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాలరావు అన్నట్టు.. ఆ రోజంతా తమ కళాపోషణ బయటపెడుతున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆనందంగా గడిపి బై బై చెప్పుకుని ఇళ్లకు చేరుకుంటున్నారు.. ఆనందంగా గడిపేందుకు మనకు ఎన్నెన్నో అందమైన పిక్నిక్ స్పాట్‌లు ఉన్నాయి.. అవేంటో ఒకసారి చూసేద్దాం!ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా పిక్నిక్‌ల సందడి నెలకొంది. కార్తీక మాసం కావడంతో ఎక్కడికక్కడ జనం గార్డెన్ పార్టీలతో సందడి చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, వివిధ సామాజికవర్గా లు, కార్మిక సంఘాలు, ఉద్యోగ యూనియన్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు ఎవరికివారే పిక్నిక్‌ల బాటపడుతున్నారు. ఆదివారం రోజైతే ఉమ్మడి జిల్లాలో మామిడి, కొబ్బరి తోటలు, గోదావరి గట్లు, పార్కులు పిక్నిక్‌లతో సందడిగా మారుతున్నా యి. కాకినాడలో అయితే సర్పవరం జంక్షన్, ఇంద్ర పాలెం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, తునిరూరల్‌లోని అనేక ప్రైవేటు గార్డెన్లు, గెస్ట్‌హౌస్‌లు, కొబ్బరితోటల్లో పిక్నిక్‌లు భారీగా జరుగు తున్నా యి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా రాజమహేం ద్రవరం, కడియం, రాజానగరం తదితర ప్రాంతాల్లో తోటలు, నర్సరీలు గోదావరి ఇసుక తిన్నెలు, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరితోటలు, సముద్రతీరం వెంబడి, గోదావరి పాయల వెంబడి ఇసుక మధ్యలో సరదాసరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సామాజికవర్గాల వారీగా నిర్వహించే పిక్నిక్‌లు అయితే ఓ భారీ ఈవెంట్‌నే తలపిస్తాయి. డీజేలు, సినిమా నటులతో డ్యాన్సులు, స్థానిక కళాకారులతో స్టెప్పులు, ఆటపాటలతో సందడి చేస్తారు. ప్రధానంగా కాకినాడ, అమలాపురం, రాజమహేంద్ర వరంలో కొన్ని సామాజికవర్గాలు రెండు వారాలుగా భారీస్థాయిలో వీటిని నిర్వహిస్తున్నాయి. కాకినాడలో ఓ కీలక సామాజికవర్గ పిక్నిక్‌లో ఆటపాటల్లో గెలిచినవారికి కారు, బైక్‌లు కూడా గిఫ్ట్‌లుగా అందిస్తున్నారు. మిమిక్రీ, కామెడీ పండించే కళాకారులను సైతం పిలిపిస్తున్నారు. కోనసీమ జిల్లాలో తోటల్లో నిర్వహిస్తోన్న పిక్నిక్‌ల్లో సరదాగా కార్డులతోపాటు ఉత్తుత్తి కోడిపందేలు నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో పిక్నిక్‌ల సందడి హోరెత్తిస్తోంది. మరోపక్క కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, శంఖవరం మండలాలు, యానాం వద్ద గోదావరి అందాలు, ఏజెన్సీలో మారేడుమిల్లి, చింతూరు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో జలపాతాల వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు వాటర్‌ఫాల్స్ మరింత శోభాయమానంగా మారి పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
ఆహా.. ఏమి రుచి..అనరా..
పిక్నిక్ అంటే విందు కీలకం. వెజ్, నాన్‌వెజ్ భోజనాల్లో రకరకాల కమ్మటి వంటలు వేడివేడిగా తినడం అదో ఆనందం. ఈ నేపథ్యంలో పిక్నిక్‌లకు కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో కొన్ని హోటళ్లకు భారీ వెజ్, నాన్‌వెజ్ భోజనాల ఆర్డర్లు వస్తున్నాయి. కాకినాడలో ఓ ప్రముఖ వెజ్ హోటల్ ఆదివారం రోజైతే లగేజీ ఆటోల్లో తుని వరకు, ఆ చివరన యానాం వరకు పది నుంచి పదిహేను పిక్నిక్ గ్రూపులకు భోజనాలు అందిస్తున్నాయి. నాన్‌వెజ్ కేటరింగ్‌లకు సైతం గిరాకీ భారీగా ఉంది. రకరకాల నాన్‌వెజ్ వంటకాలు వండి పిక్నిక్ స్పాట్‌ల వద్దకు చేర వేయడం, పిక్నిక్ జరిగే ప్రదేశంలోనే భారీ వంటకాలు సైతం కొందరు చేయించుకుంటు న్నారు. కొందరైతే గోదావరి సమీపంలో పిక్నిక్‌లు చేసుకుంటూ లైవ్ ఫిష్ వండించుకుతింటున్నారు. దీంతో ఆదివారం వస్తే కేటరింగ్ సంస్థలకు భారీ ఆర్డర్లు వస్తున్నాయి. వెజ్‌లో పది రకాల ఐటమ్స్‌కు ప్లేటుకు రూ.250 నుంచి వసూలు చేస్తుండగా, నాన్‌వెజ్ అయితే రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. పిక్నిక్‌లో సుష్టిగా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆంధ్రా కేరళ కోనసీమ
పచ్చని అందాలకు నెలవు కోనసీమ.. ఎటుచూసినా పచ్చదనమే.. ఏవైపు చూసినా పిక్నిక్ స్పాట్‌గానే ఉంటుంది.. ఎందుకంటే ఆంధ్రా కేరళ.. ఎత్తయిన కొబ్బరిచెట్లు.. పచ్చదనంతో నిండిన చేల మధ్య నుంచి నల్లటి తారు రోడ్లపై వెళుతుంటే ఆ అనుభూతే వేరు.. కేశవదాసుపాలెం, కేశనపల్లి, ఓడలరేవు, వాసలతిప్ప, ఎస్.యానాం బీచ్‌లతో పాటు గోదావరి తీరప్రాంతాలైన యానాం, కోటిపల్లి, ముక్తేశ్వరం, ఆదుర్రు, సోంపల్లి, దిండి రిసార్ట్స్, లొల్లలాకులు తదితర ప్రాంతాలు పిక్నిక్ స్పాట్‌లుగా ప్రసిద్ధికెక్కాయి. వీటితోపాటు ఆధ్యాత్మిక ప్రాంతాలైన అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, మురమళ్ళ, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. కోనసీమకు ఓవైపు గోదావరి.. మరో వైపు బీచ్ ఉండడం గమనార్హం. కోనసీమకు వెళ్లేందుకు రావులపాలెం, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మీదుగా బస్ సౌకర్యం ఉంది. రావులపాలెం మీదుగా అంతర్వేదికి 65 కి.మీ. ఓడలరేవు అయితే 51 కి.మీ.. పాలకొల్లు నుంచి అంతర్వేది అయితే 26 కి.మీ ఉంటుంది.
‘తూర్పు’న అందాలు
అన్ని అందాలు కలగలిపినదే తూర్పుగోదావరి జిల్లా.. ఒకవైపు గోదావరి.. మరోవైపు కడియం పూలతోటలు.. ఇంకోవైపు కోరుకొండలో పాండవుల మెట్ట.. గోకవరంలో సూదికొండ.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కాటన్‌మ్యూజియం, గోదావరి అందాలు.. పెరవలి మండలం తీపర్రు గోదావరి చెంతనే ఇసుక తిన్నెలు.. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నోఎన్నెన్నో.. ఇక రాజమహేంద్రవరం పట్టణవాసులకు అయితే నగరంలో దివాన్‌చెరువు వద్ద ఉన్న పుష్కరవనం.. లోపలకు వెళితే మళ్లీ రావాలనిపించదు. ఎందుకంటే చుట్టూ చెట్ల మధ్యన పిక్నిక్ అద్భుతం.. బిజీ జీవితం గడిపే పట్టణవాసులకు ఈ పుష్కరవనం ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఒకటా రెండా సుమారు 250 ఎకరాలపైనే ఈ పార్కు విస్తీర్ణం. ఒక 20 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. తరువాత ఎటు చూసినా పచ్చనిచెట్లు గుబురుగా గుబురుగా పెరిగి ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలో పిక్నిక్ స్పాట్లకు రాజమహేంద్రవరం నగరం నుంచి ప్రత్యేకంగా బస్ సౌకర్యం ఉంది.. ఇక రాజమహేంద్రవరం రావడానికి విమానయానం, రైలు, బస్ తదితర సదుపాయాలు ఉన్నాయి.
ప్రకృతి చుట్టూ కాకినాడ
చుట్టూ అందాలు.. మధ్యలో కాకినాడ జిల్లా.. ఒకప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రం ఇది.. ఒకవైపు చూపరులను కట్టపడేసే అందమైన ఏజెన్సీ.. మరోవైపు కాకినాడనే ఆనుకుని ఉన్న మడ అడవులు.. ఇంకోవైపు యానాం.. మరోవైపు పచ్చని కోనసీమ.. ఇక అందరినీ ఆకట్టుకునే కాకినాడ బీచ్.. ఇంతేనా అనుకోవద్దు.. ఏజెన్సీలో విహరిద్దామని అనుకుంటే ఒకటా రెండా ఏకంగా 8 జలపాతాలు ఉన్నాయి. అన్నీ జలకళతో పర్యాటకులను రారమ్మని పిలుస్తున్నాయి. మరోవైపు అందాల యానాం ఆస్వాదించేందుకు రమ్మంటుంది.. మడ అడవులను తిలకిస్తే ఆ ఆనందమే వేరు.. కాకినాడ జిల్లాకు ఎటు చూసినా అందమే మరి.. ఒకసారి ఆ అందాన్ని ఆస్వాదిద్దాం.. కాకినాడ జిల్లాలోని ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు బస్ సౌకర్యం ఉంది. ఏజెన్సీలోని జలపాతాల వద్దకు వెళ్లాలంటే సొంత వాహనం లేదంటే అద్దెకు మాట్లాడుకుని అయినా వెళ్లాల్సిందే.
తీపర్రు తీరం..ఆహ్లాదం
లాలాచెరువు సమీపంలో జాతీయరహదారిని ఆనుకుని దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి మహా పుష్కరవనం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పుష్కరవనంలో ప్రత్యేకించి కార్తీకవనం కూడా ఉంది. ఇందులో దాదాపు 80 వరకూ ఉసిరి చెట్లు ఉంటాయి. ఈ పుష్కరవనంలో వనభోజనాలు చేయాలంటే పెద్దలకు రూ.40, పిల్లలకు రూ.10 వంతున ప్రవేశరుసుంగా చెల్లించాలి. పెరవలి మండలం తీపర్రులో గోదావరి తీరం ప్రకృతి రమణీ యతకు నిదర్శనంగా ఉంటుంది. పచ్చని చేల మధ్య విహారం..ఆహ్లాదమే మరి..
హరితవనం.. కడియం
మనం ఒకటి రెండు రకాలు పూలు చూస్తేనే ముచ్చట పడిపోతాం.. అటువంటిది వందలాది రకాల పూలమొక్కలు విరబూస్తూ ఓ చోట కనిపిస్తే ఆ సుందర దృశ్యం చూడతరమా.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో నర్సరీల పూలకొలువు. మండలంలో పది గ్రామాల్లో సుమారు 3 వేల ఎకరాల్లో 1100 నర్సరీలు ఉన్నాయి. ఇక్కడ పూలు, పండ్లు, ఆర్నమెంటల్, ఔషధ, సెమిషేడ్, క్రీపర్, ఇండోర్, ఔట్‌డోర్, హేంగింగ్ వంటి రకాల మొక్కలు అనేకం ఉంటాయి. కార్మికుల శ్రమసౌందర్యంతో విరజిల్లే మొక్కలు ఆకుపచ్చని విన్యాసం చేస్తూ పర్యాటకులకు ప్రణమిల్లుతాయి. ప్రకృతి ఒడిలో హరితశోభగా గోదావరి నదిఒడ్డున వెలసిన కడియం పూలసీమలో ఈ కార్తీక వేళ సేదతీరి ఉసిరిచెట్టు కింద సహపంక్తి వన భోజనాలు చేయడానికి అనేక మంది ఇష్టపడతారు. కడియపులంక జాతీయ రహదారిని అనుకుని ఉంటుంది. రాజమహేంద్రవరం నుంచి 13 కి.మీ ప్రయాణం చేస్తే కడియం చేరుకోవచ్చు. రావులపాలెం మీదుగా అయితే 23 కి.మీ ఉంటుంది. నిరంతరం బస్, ఆటోలు ఉంటాయి.