Share News

సాహసం.. సాగరం!

ABN , Publish Date - Dec 04 , 2024 | 01:46 AM

కాకినాడ సాగరం రక్షణపరంగా తూర్పు నావికా దళా నికి అత్యంత కీలకం. గడచిన కొన్నేళ్లుగా కాకినాడ సము ద్ర జలాల్లో ఇండియన్‌ నేవీ పలు రకాల మాక్‌డ్రిల్స్‌, ఎక్సర్‌సైజ్‌లతో భద్రతను పటిష్టం చేస్తోంది.

సాహసం.. సాగరం!
కాకినాడలో సిద్ధమవుతున్న యుద్ధ విమాన మ్యూజియం

కేజీ బేసిన్‌లో చమురు,గ్యాస్‌

లక్షల కోట్లతో నిక్షేపాలకు అన్వేషణ

కీలకంగా మారిన భద్రత

ఎప్పటికప్పుడు నేవీ నిఘా

ప్రతి ఏటా ప్రస్థాన్‌ పేరిట మాక్‌డ్రిల్‌

రక్షణ చర్యలపై అవగాహన

వచ్చే ఏడాది మార్చిలో విన్యాసాలు

నేడు భారత నౌకాదళ దినోత్సవం

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

కాకినాడ సాగరం రక్షణపరంగా తూర్పు నావికా దళా నికి అత్యంత కీలకం. గడచిన కొన్నేళ్లుగా కాకినాడ సము ద్ర జలాల్లో ఇండియన్‌ నేవీ పలు రకాల మాక్‌డ్రిల్స్‌, ఎక్సర్‌సైజ్‌లతో భద్రతను పటిష్టం చేస్తోంది. ఈ మేరకు అమెరికన్‌ నేవీతో సైతం పలు రకాల ప్రత్యేక ఉమ్మడి విన్యాసాలు చేస్తూ తీరాన్ని, సముద్రజలాల సరిహద్దును కంటికి రెప్పలా కాపాడుతోంది. వాస్తవానికి నావికాదళం అంటే విశాఖలోని తూర్పునావికాదళ స్థావరంగా చెబు తారు.దీని పరిధిలో కాకినాడ సాగరం కూడా ఉండడం తో గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో వ్యూహాత్మక రక్షణ చర్యలు చేపడుతోంది. నేడు భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

దేశానికి ఆయువుపట్టు కేజీ బేసిన్‌

ప్రధానంగా కాకినాడ తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేజీ బేసిన్‌ దేశానికి అతిపెద్ద ఆయువు పట్టు. సముద్రం మధ్యలో 50 వేల చదరపు కిలో మీట ర్లకుపైగా విస్తరించి ఉన్న బేసిన్‌లో 2003 నుంచి 26 బావుల్లో చమురు,గ్యాస్‌ను ఓఎన్‌జీసీ, రిలయన్స్‌, కెయిన్‌ ఎనర్జీ వంటి ప్రఖ్యాత కంపెనీలు తవ్వుతున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులతో వందలాది మంది నిపుణులు, సిబ్బంది.. పదుల సంఖ్యలో నౌకల్లో ఉంటూ ఈ కార్యక లాపాలు నిర్వహిస్తున్నాయి. దీని రక్షణ భారత తూర్పు నావికాదళం పర్యవేక్షిస్తోంది. కేజీ బేసిన్‌లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదాలు జరిగినా, విద్రోహశక్తులు కన్నేసినా దీన్ని ఎలా రక్షించుకోవాలి? అనేదానిపై ప్రతి ఏటా ప్ర త్యేక మాక్‌డ్రిల్‌ నిర్వహిస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో అమెరికన్‌ నేవీతో కలిసి ఈసారి విన్యాసాలు చేసేందుకు మన ఇండియన్‌ నేవీ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ప్రతి ఏడాది విన్యాసాలు..

2022 అక్టోబరులో భారత నేవీ ఆఫ్‌షోర్‌ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్‌ను ప్రస్థాన్‌ పేరుతో నిర్వహించింది. నౌకల్లోకి నేవీ విమానాలు ఎగురుకుంటూ వచ్చి భద్రత చర్యలు చేపట్టడం, బాంబులు పసిగట్టడం వంటి వాటిపైనా, నిపుణులను రక్షించి తీసుకువెళ్లడంపై మాక్‌డ్రిల్‌ నిర్వ హించింది.2023 జనవరిలో ఆర్మీ,నేవీ,ఎయిర్‌ఫోర్స్‌ కలిపి కాకినాడలో యాంపెక్స్‌-2023 నిర్వహించాయి. తీరం లోను సముద్రంలోపల విదేశీ శక్తులు, ఉగ్రవాదులు చొరబడితే వారిని మట్టుపెట్టడం ఎలా? రక్షణ విష యంలో ఎలా చురుగ్గా వ్యవహరించాలి? వ్యూహాల అమలు..వంటివాటిపై ఎక్సర్‌సైజ్‌ చేపట్టాయి. 2023 ఏప్రిల్‌లో సముద్రంలో చమురు కార్యకలాపాల వల్ల సాగర జలాలు కాలుష్యం నేపథ్యంలో వాటిని ఎలా సంరక్షించుకోవాలి? సముద్రంలో బోట్లు, షిప్పులో జరిగే అగ్నిప్రమాదాల సమయంలో ఆస్తినష్టం తగ్గించుకుం టూ అందులో ఉన్న వారిని కాపాడుకోవడం ఎలా? అనే దానిపై నేవీ విన్యాసాలు నిర్వహించింది. నౌక ల్లోంచి నేవీ సిబ్బంది ప్రమాద ఘటనలో ఇతర నౌకల్లో మంటలను అదుపు చేయడం, అందులోని సిబ్బందిని ప్రత్యేక బాక్సుల్లో ఈదుకుంటూ వెళ్లి రక్షించడం, హెలీ కాఫ్టర్ల నుంచి తాడుతో దిగి వారిని కాపాడడం వంటి వాటిని సాహసోపేతంగా చేసి చూపించింది. అదే ఏడా ది అక్టోబరులో చమురుసంస్థలు, కోస్ట్‌గార్డ్‌,కస్టమ్స్‌ తో కలిపి రక్షణ చర్యలు చేసి చూపించింది. నేవీకి చెందిన ఐఎన్‌ ఎస్‌ కోర,ఐఎన్‌ఎస్‌ టిహాయులు మెరైన్‌ కమాం డోలతో కలిపి బాంబు డిస్పోజబుల్‌ నిపుణులు ప్రమా దాల సమయంలో ఏవిధంగా దేశ తీరజలాలను కాపా డుకోవాలో చేసి చూపించాయి.ఈ ఏడాది సెప్టెం బరు లో కాకినాడలో తూర్పు నావికాదళం 47వ ప్రాంతీయ సదస్సు ఇక్కడే నిర్వహించింది. ఏటా అమెరికన్‌ నేవీతో కలిసి విన్యాసాలు చేస్తూ కాకినాడ తీరం,సముద్ర జ లాల సరిహద్దుల్లో గస్తీ పెంచి విశేష సేవలందిస్తోంది.

సిద్ధమైతే.. అద్భుతమే!

కాకినాడలో టీయూ-142ఎం యుద్ధ విమాన మ్యూజియం

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందిన కాకినాడ బీచ్‌లో ఏర్పా టు చేసిన యుద్ధ విమాన మ్యూజియం త్వరలో సం దర్శకులకు వినోదం, విజ్ఞానం అందించనుంది. దేశ భద్రత,రక్షణ కోసం త్రివిధ దళాలు అందిస్తున్న సేవ లు, రక్షణ రంగంలో టీయూ-142 ఎం యుద్ధ విమా నం అందించిన సేవలను మ్యూజియం రూపంలో థీమ్‌పార్కు పేరిట కాకినాడ రూరల్‌ ఎన్టీఆర్‌ బీచ్‌లో 2020లో రూ.5.89 కోట్ల గుడా నిధులతో నిర్మాణ పనులు చేపట్టారు. సుమారు రెండెకరాల స్థలంలో టీయూ-142 విమాన మ్యూజియం నిర్మాణం పనుల టెండర్‌ని తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇంకా యుద్ధ విమానం లోపల ఏసీ, విద్యుద్దీకరణ, లైటింగ్‌ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆయుధాల నిల్వ, వాటిని ఏవిధంగా ప్రయోగిస్తారు, విమాన టేకాఫ్‌, ల్యాండింగ్‌ తదితర వివరా లు, దేశానికి అందించిన సేవలు, డిస్‌ప్లే, వీడియో, ఆడియో తదితర సమాచార వ్యవస్థ, గేమింగ్‌ జోన్‌, విజ్ఞానంపై సమాచారం ఏర్పాటు చేయాల్సి ఉంది. మ్యూజియంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పను లను డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నా, క్షేత్రస్థాయి లో పరిస్థితి పరిశీలిస్తే మరింత సమయం పట్టే అవ కాశం ఉంది. కానీ ఇవన్నీ పూర్తయితే మ్యూజి యం సందర్శకులకు కనువిందు చేయనుంది. ఇది ఎప్పుడు పూర్తవుతుందా అని జనం ఎదురుచూస్తున్నారు.

యుద్ధ విమానం ప్రత్యేకతలివే..

టీయూ-142 యుద్ధ విమానాన్ని రష్యా దేశం నుంచి కొనుగోలు చేశారు. కార్గిల్‌ యుద్ధంలో ఇది విశేష సేవలు అందించింది. ఒక్కసారి ప్యూయల్‌ నింపుకుని ప్రపంచదేశాలను కేవలం 16 గంటల్లో చుట్టివచ్చే సామర్థ్యం దీని సొంతం. ఇది గంటకు 925 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. విమానం పొడవు, వెడల్పులు 50 మీటర్లు, రెక్కల పొడవు 50 మీటర్లు .దీని బరువు 90 వేల కిలోలు. ప్రపంచంలోనే అతి భారీ, పురాతన యుద్ధ విమానాల్లో ఒకటైన టీయూ -142ఎం ఎయిర్‌క్రాప్ట్‌ భారత నావికాదళం వైమానిక విభాగంలో 28 ఏళ్లపాటు దేశానికి విశేష సేవలు అందించింది. సముద్ర తీర గస్తీ, జలాంతర్గామి నిరోధక సేవలు అందించడంలో ఖ్యాతి గడించిన ఈ యుద్ధ విమానం 2017లో నేవీ నుంచి వైదొలిగి, తమిళనాడులోని అరక్కోణం బేసల్‌ ఎయిర్‌స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ రాజసంలో విశ్రాంతి తీసుకుంటుంది. ఈ విమానాన్ని తమిళనాడు నుంచి కాకినాడ బీచ్‌కు 14 భారీ వాహనాల ద్వారా తెనేజా ఏరో స్పేస్‌ లిమిడెట్‌ సంస్థ తీసుకువచ్చింది.

Updated Date - Dec 04 , 2024 | 01:46 AM