Share News

ఉత్తుత్తి..రిజిస్ట్రేషన్లు

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:40 AM

ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదు లుకోవడంలేదు.. ఏదో ఒక విధంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.. గత ఐదేళ్లుగా గుర్తుకురాని ప్రజాప్రయోజన కార్యక్రమా లను హడావుడిగా చేస్తోంది..ఈ హడావుడిలోనే పట్టాల రిజిస్ర్టేషన్లకు తెరలేపింది..

ఉత్తుత్తి..రిజిస్ట్రేషన్లు
రండి.. కూర్చోండి : కొవ్వూరు సచివాలయంలో రిజిస్ర్టేషన్లకు హాజరైన లబ్ధిదారులు

స్టాంపులు లేవు.. కాగితం ఇవ్వరు..

పదేళ్ల తర్వాతే డాక్యుమెంట్‌?

జగనన్న ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్‌ తీరిది

గందరగోళంగా మారిన వైనం

తప్పులు సరిదిద్దే ఆప్షన్‌ లేక ఇక్కట్లు

66,523 పట్టాల రిజిస్ర్టేషన్‌ లక్ష్యం

26,632 మాత్రమే పూర్తి

ఆవ భూముల్లో రిజిస్ర్టేషన్లు నిల్‌

సర్వర్‌ పనిచేయక గగ్గోలు

ఉదయం వెళితే రాత్రికే వచ్చేది

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదు లుకోవడంలేదు.. ఏదో ఒక విధంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.. గత ఐదేళ్లుగా గుర్తుకురాని ప్రజాప్రయోజన కార్యక్రమా లను హడావుడిగా చేస్తోంది..ఈ హడావుడిలోనే పట్టాల రిజిస్ర్టేషన్లకు తెరలేపింది.. సచివాలయాల్లో పేదలను గంటల తరబడి కూర్చోబెట్టి.. కాసేపు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి మీ రిజిస్ర్టేషన్‌ పూర్తయింది వెళ్లమని చెబుతున్నారు.. ఇది చూసి పేదలు తెల్లముఖం వేస్తున్నారు.. రిజిస్ర్టేషన్‌ అంటే కాగితాలు ఇవ్వాలి కదా.. వచ్చి వెళ్లిపొమ్మంటున్నా రేమిటని కంగారుపడుతున్నారు. ఎందుకీ ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లు అంటూ మండిపడుతున్నారు. పేదలందరికీ ఇళ్లు - నవరత్నాల పేరుతో జగనన్న కాలనీల పేరిట ఊళ్లకు ఊళ్లే నిర్మిస్తామని గొప్పగా ప్రక టించిన వైసీపీ ప్రభుత్వం ఆచరణలో ఫలితాలు చూప లేకపోయింది. ఇప్పటికే ప్రకటించిన మేరకు పట్టా లివ్వ లేదు.ఇచ్చిన మేర ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ఎన్నికల వేళ ఇచ్చిన పట్టాలను పదేళ్ల తర్వాత అమ్మేసుకోవడానికి వీలుగా ఉత్తుత్తి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ఆరంభించారు. సచివాలయ ఉద్యోగులకు రిజిస్ర్టేషన్‌ అధికారాలు ఇచ్చి రిజిస్ర్టేషన్‌ చేయిస్తోంది. కానీ రిజి స్ర్టేషన్లు పూర్తయిన వాటి డాక్యుమెంట్లను లబ్ధిదారులకు ఇవ్వడంలేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పడంలేదు. లబ్ధిదా రులను పిలిచి మమ అనిపిస్తున్నారు. అధికార వర్గాల్లో నలు గుతున్న సమాచారం ప్రకారం పదేళ్ల తర్వాతే ఈ డాక్యుమెంట్లను లబ్ధిదారులకు ఇస్తారని, అప్పటి వరకూ వీఆర్వోల వద్దేనే ఉంటాయనే ప్రచారం ఉంది. ఇది లబ్ధిదారుల్లో తీవ్ర గందరగోళం సృష్టిస్తోంది.

26,632 పట్టాలకే రిజిస్ట్రేషన్‌..

జిల్లాలో సుమారు లక్షా 40 వేల మందికి ఇళ్లు ఇస్తా మని ప్రకటించారు.కానీ ఇప్పటి వరకూ జిల్లాలో 66,523 మందికి పట్టాలు ఇచ్చారు.అందులో కొందరికి పట్టాలు చూపలేదు. గోపాలపురంలో లబ్ధిదారులు తిర స్కరించిన భూమిలో ఇచ్చిన పట్టాలకే రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గత నెల 29 నుంచి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా సాంకేతిక కారణాల వల్ల 29, 30, 31 రిజిస్ట్రేషన్లు కాలేదు. ఈ నెల 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. 19వ తేదీకి పూర్తి చేయాలని చెప్పినట్టు సమాచారం. ఈ లోపు ఎన్నికల షెడ్యూల్‌ వస్తే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయోననే భయం ఉంది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో కూడా రిజిస్ర్టేషన్లు లేవు.జిల్లాలో ఇప్పటి వరకూ 26,632 పట్టాలకు రిజిస్ర్టేషన్‌ చేశారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో 40,788 పట్టాలకు రిజి స్ర్టేషన్లు చేయవలసి ఉండగా ఇప్పటి వరకూ 24,820 పట్టాలకు రిజిస్ర్టేషన్లు చేశారు.కొవ్వూరు డివిజన్‌లో 25,735 పట్టాలకు రిజిస్ర్టేషన్‌ చేయవలసి ఉండగా ఇప్ప టి వరకూ 1812 పట్టాలకు మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేశా రు.రాజమహేంద్రవరం అర్బన్‌ పేదలకు సుమారు 60 వేల పట్టాల వరకూ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ సుమారు 7 వేల మందికి మాత్రమే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. జిల్లాలో కేవలం 22 వేల ఇళ్ల వరకూ పూర్త యినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక ఆవభూమికి ప్రత్యామ్నాయం చూపడంలేదు. పట్టాలకు రిజిస్ర్టేషన్లూ లేవు.ప్రస్తుతం సర్వర్‌ సమస్య, ఇతర టెక్నికల్‌ సమస్యల వల్ల బాగా ఆలస్యం అవుతున్నాయి. ఒక్కో సచివాలయం లో రోజూ 30 చేయడం కూడా కష్టమవుతోంది.

తప్పులు సరిదిద్దే ఆప్షన్‌లేక..

ఇళ్ల పట్టాలు పొందిన వారికి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. కానీ పట్టా లోని తప్పులను సరిదిద్దే ఆప్షన్‌లేక తప్పులతో రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. పట్టాలో లబ్ధిదారు భర్తలేదా తండ్రి పేరు లేకపోతే కొన్ని చోట్ల రిజిస్ర్టేషన్లు చేయడం లేదనే సమ స్య ఎదురవుతోంది.గతంలో హడావుడిగా జగన్న బొమ్మ లతో పట్టాలు పంపిణీ చేశారు.రాత్రీ పగలూ కూర్చుని లబ్ధిదారుల పేర్లు రాసేశారు. అందులో అనేక తప్పులు ఉన్నాయి.వాటిని సరిదిద్దకుండా రిజిస్ర్టేషన్‌ చేయడం వల్ల పదేళ్ల తర్వాత అమ్ముకోవాలనుకుంటే ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో.. అప్పటి పరిస్థి తులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం వద్దే డాక్యుమెంట్లు?

రిజిస్ర్టేషన్‌ చేస్తున్న పట్టాలకు సంబంధించి డాక్యు మెంట్లను లబ్ధిదారులకు ఇవ్వడంలేదు. డాక్యుమెంట్‌లో లబ్ధిదారు ఫొటోతో పాటు, వీఆర్వో, సెక్రటరీల ఫొటోలు కూడా ఉండడం గమనార్హం.ఈ డాక్యుమెంట్లన్నీ అధికా రుల వద్దే ఉండిపోతున్నాయి. ఇంత వరకూ ఎవరికీ ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో కూడా చెప్పడంలేదు. తమకు సమాచారం ఇంకా రాలేదని కొందరు అధికారులు చెబుతున్నారు.కానీ ప్రస్తుతం ఉన్న పట్టా మాత్రమే లబ్ధిదారుడి వద్ద ఉంటుందని రిజిస్టర్‌ డాక్యుమెంట్‌ మాత్రం లబ్ధిదారుడికి పదేళ్ల వరకూ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.ప్రస్తుతం లబ్ధిదారులకు అంతా గందరగోళంగా మారింది. పైగా కొందరి ఇళ్ల స్థలాలు చూపకుండానే పట్టాలు రిజిస్ర్టేష ను జరిపిస్తున్నట్టు సమాచారం.

సర్వర్‌ కష్టాలు..

కొవ్వూరు/కడియం,ఫిబ్రవరి 12 : జగనన్నకాలనీ లబ్ధిదారుల ఇంటి రిజిస్ట్రేషన్లలో ఇటు లబ్ధిదారులు, మరో వైపు సచివాలయ కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు. సచివాలయాల వారీగా రిజిస్ట్రేషన్లు చేపట్టినప్పటికి సర్వర్‌ మొరాయించడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్‌ పనిచేయక లబ్ధిదారులు, సచివాలయ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నా రు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 11, 12 గంటల వరకు రిజిస్ట్రేషన్లను చేస్తున్నారు. ఒక సచివాలయం పరిధిలో 400 మంది ఇళ్ల లబ్ధిదారులు ఉం డగా గత నాలుగు రోజులుగా కేవలం 130 మందికి మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్లయ్యాయి. కడియం మం డలానికి సంబంధించి జేగురుపాడు పరిధిలో పాములమెట్ట, వేమగిరిలోను ఇళ్ళస్థలాల పంపిణీ జరిగింది. 3,700 మందికి ఇళ్ళస్థలాలు ఇవ్వగా ఇప్పటి వరకు 600 మంది ఇళ్లు నిర్మించుకున్నారు.ఇప్పటి వరకు సుమారు 1,400 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు సబ్‌రిజిస్టార్‌ ఆర్‌వీ రామారావు తెలిపారు. రోజువారి కార్యక్రమాలతో పాటు బీఎల్‌వో డ్యూటీలు, మరో ప్రక్క రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలతో సచివాలయ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సర్వర్‌ సమస్యను సరిదిద్దాలని ప్రజ లు, సచివాలయ సిబ్బంది కోరుతున్నారు.

Updated Date - Feb 13 , 2024 | 12:40 AM