కార్తీక మాసోత్సవాలకు సిద్ధం
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:59 AM
కార్తీక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పన, తెప్పోత్సవం, గిరిప్రదక్షణ లపై ఆదివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఈవో, చైర్మన్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే అధ్యక్షతన పలు శాఖల అధికారులతో అన్నవరం దేవస్థానం ఈవో, చైర్మన సమీక్ష
అన్నవరం, అక్టోబరు 27: కార్తీక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పన, తెప్పోత్సవం, గిరిప్రదక్షణ లపై ఆదివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అధ్యక్షతన ఈవో, చైర్మన్, పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ పర్వదినాల్లో వ్రతం టిక్కెట్ల కౌంటర్‌ను రాత్రి 10 గంటలకు ప్రారంభించి 12 గంటల నుంచి వ్రతాలు, ఒంటి గంట నుంచి సర్వదర్శనాలను ప్రారంభిస్తామన్నారు. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా తిరుమలలో మాదిరిగా కంపార్ట్‌మెంట్, క్యూలైన్లలో భక్తులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
రూ.1.43 కోట్లతో పర్మినెంట్, తాత్కాలిక సదుపాయాలు సమకూర్చామన్నారు. పర్వదినాల్లో సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బందిని అదనంగా నియమించామన్నారు. మిగిలిన కార్యకలాపాలకు సింహాచలం దేవస్థానం నుంచి పలువురు ఉద్యోగులను డిప్యుటేషన్‌పై తీసుకుంటామన్నారు. ప్రధాన మార్గాల్లో సమాచార కేంద్రాలు, భక్తులు అధికంగా ఉండేచోట్ల మరుగుదొడ్లు, స్నానపు గదులు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.300 వ్రతం భక్తులకు 9 మండపాలు సిద్ధం చేయగా... ఏక కాలంలో సుమారు 3,500 వ్రతాలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు.
కార్తీక పౌర్ణమి రోజైన నవంబరు 15వ తేదీ ఆచార సంప్రదాయలను గౌరవిస్తూ ఉదయం 7.30 గంటలకు పల్లకిలో స్వామి, అమ్మవార్లకు గిరి ప్రదక్షిణ చేయిస్తామన్నారు. మధ్యా హ్నం 2.30 గంటలకు సత్య రథంతో భక్తులతో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామన్నారు. తద్వారా దర్శనాలు, వ్రతాలు చేయించుకునే భక్తులు, గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తుల తాకిడి తగ్గి స్వామిని ప్రశాంతంగా దర్శించుకునే వీలుంటుందన్నారు. సత్యగిరి నుంచి రత్నగిరికి చేరుకునే వారికి ఉచిత వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ఉచిత బస్సులు తిరుగుతుండగా టాటా మ్యాజిక్ వాహనాలను అదనంగా అందుబాటులో ఉంచుతామన్నారు. కొండ దిగువ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు.. గిరిప్రదక్షిణ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ప్రత్తిపాడు సీఐ సూరి అప్పారావు కోరగా ఈవో అంగీకరించారు. భక్తులు బసచేసే ప్రదేశాలు, అధికంగా సంచరించే ప్రాంతాల్లో అధిక నిఘా పెడతామని, దేవస్థానం సహకరించాలని కోరారు.
కొండ దిగువున మెయిన్‌రోడ్డు ఆక్రమణకు గురికాకుండా, దుకాణ సముదాయాలు రోడ్డుపైకి రాకుండా, ట్రాఫిక్‌కి ఇబ్బం ది లేకుండా చూస్తామని రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ శాఖ అధికారులు తెలిపారు. నిరంతరం బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను, అంతరాయం లేకుండా విద్యుత సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను, కొండ దిగువ, కొండపైన, సత్యగిరిపై ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కోరారు.
తెప్పోత్సవానికి పంపా సరోవరంలో తగినంత నీటి నిల్వలు ఉండేలా చూడాలని, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఇరిగేషన్ అధికారులను ఈవో కోరారు.
అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో ఉండి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎమ్మెల్యే సత్యప్రభ సూచించారు. సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ఆర్డీవో శ్రీరమణి, అన్నవరం ఎస్‌ఐ హరిబాబు, దేవస్థానం ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.