Share News

రోడ్ల అభివృద్ధి చర్యలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 12:42 AM

పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పీపీపీ విధానంలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. కార్లపై ప్రయాణించే వారి నుంచి మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వాహనాలకు టోల్‌ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పిస్తే వాటి మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రోడ్ల అభివృద్ధి చర్యలు

అమలాపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పూర్వపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పీపీపీ విధానంలో రోడ్లు అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. కార్లపై ప్రయాణించే వారి నుంచి మాత్రమే టోల్‌ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వాహనాలకు టోల్‌ ఫీజు ఉండదని స్పష్టం చేశారు. అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీకి సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పిస్తే వాటి మంజూరు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. అమలాపురం అర్బన్‌ డెవలెప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం మెట్ల రామలక్ష్మి కల్యాణ వేదికపై ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులు కేటాయిస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ముందస్తుగానే నామినేటెడ్‌ పదవుల భర్తీని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన జిల్లాగా కోనసీమను తీర్చిదిద్దేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు. ముందుగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మాట్లాడుతూ అముడా అభివృద్ధి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ భూ ఆక్రమణలు వంటి ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 42 ఏళ్లుగా టీడీపీలో కింగ్‌ మేకర్‌గా పనిచేస్తూ వచ్చిన స్వామినాయుడు పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి నేడు కింగ్‌గా ఎదిగారని ప్రశంసించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుకు పార్టీ సముచిత స్థానం కల్పించడం ఖాయమన్నారు. ముందుగా అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట ఎమ్మెల్యేలు ఆనందరావు, దాట్ల బుచ్చిబాబు, బండారు సత్యానందరావు, వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన అమలాపురం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్‌ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని కోరారు. సమావేశంలో కూటమి నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, మానేపల్లి అయ్యాజీవేమా, నామన రాంబాబు, బండారు శ్రీనివాస్‌, శిరిగినీడి వెంకటేశ్వరరావు, కల్వకొలను తాతాజీ మాట్లాడారు. అనంతరం అముడా చైర్మన్‌గా అల్లాడ స్వామినాయుడుచే జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌, దంగేటి వెంకటరెడ్డినాయుడు (చిట్టిబాబు), పలచోళ్ల పద్మనాభం, కానూరి బాబ్జి, దాట్ల బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 12:42 AM