అక్రమంగా మట్టి తరలిస్తున్న 3 లారీలు సీజ్
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:29 AM
కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక గ్రామాల్లో యఽథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న వైనంపై గురువారం ‘తవ్వేస్తున్నారు..
కపిలేశ్వరపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన కేదార్లంక, వీధివారిలంక గ్రామాల్లో యఽథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్న వైనంపై గురువారం ‘తవ్వేస్తున్నారు..’ శీర్షికన ప్రచురించిన ఆంధ్రజ్యోతి కఽథనంపై అధికారులు స్పందించారు. దీనిపై మండపేట రూరల్ సీఐ దొరరాజు ఆదేశాల మేరకు అంగర ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఉంచారు. కేదార్లంక, వీధివారిలంక పరిధిలోని మందపల్లి పొలిమేరలో అనుమతుల్లేకుండా అక్ర మంగా మట్టిని తవ్వి లారీల్లో తరలించడాన్ని గుర్తించారు. కేదార్లంక ప్రాంతంలో అనుమతులు లేకుండా మట్టితో వెళుతున్న లారీలను పట్టుకుని శుక్రవారం ఉదయం అంగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవికుమార్ మాట్లాడుతూ అక్రమంగా మట్టితరలిస్తున్న 3 లారీలను వీఆర్వో బుజ్జిబాబు, అంగర పోలీస్ సిబ్బంది పట్టుకుని స్టేషన్‌కు తరలించి మైనింగ్ అధికారులకు స్వాధీనం చేసినట్టు తెలిపారు. వీటిలో ఒక లారీపై ఆన్‌గవర్నమెంట్ డ్యూటీ, పంచాయతీరాజ్ వర్కు స్టిక్కరుతో మట్టిని తరలిస్తుండడం గమనార్హం.