12 ఇసుక రీచ్‌లకు అనుమతులు
ABN , Publish Date - Oct 10 , 2024 | 12:21 AM
నదిలో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్నిశాఖల అనుమతులతో పన్నెండు ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది.
అమలాపురం, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): నదిలో నీటి ప్రవాహం తగ్గగానే ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అన్నిశాఖల అనుమతులతో పన్నెండు ఇసుక రీచ్‌లను గుర్తించామన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో ఆర్.మహేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లో ఇసుక తవ్వకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 12 ఇసుక రీచ్‌లలో ఇసుకను తవ్వే ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ఎంపికకు సంబంధించిన విధివిధానాలను జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్ నోటిఫికేషన్ కమిటీ గురువారం తయారు చేస్తుందన్నారు. త్వరలోనే టెండరు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెప్పారు. పట్టా భూముల్లో ఇసుకను తవ్వుకోవడానికి రైతులు దరఖాస్తులు పెట్టుకుంటారని సంబంధిత భూములను రెవెన్యూ, గ్రౌండ్ వాటర్, రివర్ కన్జర్వేటర్, వ్యవసాయం, మైన్స్ శాఖల అధికారులు సభ్యులుగా ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీ పరిశీలించి ఇసుకను తవ్వవచ్చా లేదా అనేది నిర్ధారిస్తుందన్నారు. 12 రీచ్‌ల నుంచి ఇసుకను బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైన ర్యాంపు పాయింట్లు, యాక్సెస్ రోడ్లు, ఇసుకను నిల్వ చేసేందుకు స్టాకు యార్డులను సంబంధిత ఆర్డీవోలు గుర్తించాలన్నారు. పోలీసుల సహకారంతో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాకు యార్డుల వద్ద పోలీసుశాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక వెలికితీత, రీచ్‌ల నిర్వహణ, పన్నులు అన్నీ కలిపి ఖర్చు ఎంతమేర అవుతుందో తదుపరి జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఇసుక రీచ్‌ల వద్దకు వెళ్లే భారీ వాహనాలు ఏటిగట్లు దాటాల్సిన పరిస్థితులు ఉంటే బలహీనమైన ఏటిగట్లను గుర్తించి నివేదికలు సిద్ధం చేయాలని జలవనరులశాఖ హెడ్‌వర్క్స్ అధికారులకు సూచించారు. ఇసుక ర్యాంపుల రవాణా వాహనాలకు ఇన్వాయిస్ ఇవ్వడానికి అవసరమైన మొబైల్ ఫోన్లు, పీవోఎస్ మిషన్లు కొనుగోలు చేయాలన్నారు. ఇసుక బుకింగ్, రవాణా తదితర సమస్యలను పరిష్కరించడానికి జిల్లాస్థాయిలో కలెక్టరేట్‌లో వివిధ శాఖల సిబ్బందితో ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం ఆర్డీవోలు శ్రీకర్, కె.మాధవి, కతీబ్‌కౌశర్‌భానో, జిల్లా మైన్స్ అధికారి బి.అశోక్‌కుమార్, ఇసుక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.