Share News

ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:25 AM

జిల్లాలో ఇసుక రీచ్‌ల ద్వారా రోజువారీ 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు.

 ఇసుక రీచ్‌ల ద్వారా 20 వేల మెట్రిక్‌ టన్నుల తవ్వకాలు జరగాలి

అమలాపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక రీచ్‌ల ద్వారా రోజువారీ 20 వేల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కపిలేశ్వరపురం, తాటిపూడి రీచ్‌లలో నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతుందని రామచంద్రపురం ఆర్డీవో డి.అఖిల కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే నిర్దేశిత ఆపరేటింగ్‌ ఏజెన్సీల ద్వారా ఇసుక తవ్వకాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఒక్కో రీచ్‌ నుంచి సుమారుగా 500 మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలు చేపట్టాలని సూచించారు. నార్కేడుమిల్లి, ఆలమూరు, పొడగట్లపల్లి రీచ్‌లలో డిసెంబరు 1 నుంచి తవ్వకాలను ఆపరేటింగ్‌ ఏజెన్సీల ద్వారా చేపట్టాలన్నారు. వారు ముందుకు రాని పక్షంలో నోటీసులు జారీ చేయాలన్నారు. రీచ్‌ల నుంచి స్టాక్‌ యార్డుకు, స్టాక్‌ యార్డు నుంచి వినియోగదారులకు ఎంత పరిమాణంలో ఇసుక విక్రయించబడుతుందో రోజువారీ నివేదిక సమర్పించాలన్నారు. భవన నిర్మాణ రంగాలకు అవసరమైన డిమాండుకు అనుగుణంగా ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. కపిలేశ్వరపురం-2 నుంచి స్థానిక వినియోగం కోసం ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నదీ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మూడో వ్యక్తికి విక్రయిస్తున్నారేమో గమనించాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పట్టా భూముల్లో ఇసుక ఎంత పరిమాణంలో ఉందో అంచనాలు వేసి ఆ మేరకు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో తరలించుకునేందుకు అనుమతులను గ్రామస్థాయిలో ఇవ్వాలని సూచించారు. పట్టా భూముల్లో ఇసుక నిల్వలు ఉన్నాయని, దరఖాస్తు చేసుకున్న వారికి జియో కోఆర్డినేట్స్‌తో డీజీపీఎస్‌ సర్వే, ఎఫ్‌ఎల్‌సీ సర్వేలను పూర్తిచేసి అనుమతులు ఇచ్చి డిసెంబరు 6వ తేదీ నాటికి పర్యావరణ అనుమతులు జారీ చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, జిల్లా గనులు, భూగర్భశాఖ ఏడీ ఎల్‌.వంశీధర్‌రెడ్డి, ఆర్డీవోలు అఖిల, కె.మాధవి, పి.శ్రీకర్‌, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శంకరరావు, జిల్లా రవాణాధికారి డి.శ్రీనివాసరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సీహెచ్‌ఎన్వీ కృష్ణారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ బి.రాము, జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు, రియాల్టీ ఇన్‌స్పెక్టర్‌ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:25 AM