షాలిమార్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం
ABN , Publish Date - Mar 29 , 2024 | 12:25 AM
షాలిమార్- సికింద్రాబాద్ వారాంతపు రైల్లో (నెం.22849) సాంకేతిక లోపం ఏర్పడి రాజమండ్రి రైల్వే స్టేషనులో 5.30 గంటలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలుకు కడియం రైల్వే స్టేషను దాటిన తర్వాత రైలు బోగీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
ఐదు గంటలకు పైగా ప్రయాణికులకు నరకం
రాజమహేంద్రవరం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): షాలిమార్- సికింద్రాబాద్ వారాంతపు రైల్లో (నెం.22849) సాంకేతిక లోపం ఏర్పడి రాజమండ్రి రైల్వే స్టేషనులో 5.30 గంటలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్ వెళ్తున్న రైలుకు కడియం రైల్వే స్టేషను దాటిన తర్వాత రైలు బోగీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు రైలును నెమ్మదిగా రాజమండ్రి తీసుకొచ్చి రెండో ప్లాట్‌ఫాం వద్ద నిలిపారు. వెంటనే రైల్వే ఎలక్ట్రికల్ తదితర విభాగాల సిబ్బంది రంగంలోకి దిగి లోపాన్ని గుర్తించే పని చేపట్టారు. ఇంజన్‌లో లోపం ఉందనుకొని వేరొక ఇంజను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. ముందువైపు ఉన్న జనరేటర్ బోగీ (పవర్ కార్)లో లోపం తలెత్తిందని గుర్తించారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెనుక కూడా వేరొక ఇంజను అమర్చి.. వెనుక ఉన్న పవర్ కార్ ద్వారా విద్యుత్తు సరఫరా చేశారు. దీంతో ఉదయం 7.30గంటలకు వచ్చిన రైలు మధ్యాహ్నం 1గంటలకు బయలుదేరింది. అప్పటికే ఈ రైలు రెండు గంటలు ఆలస్యంగా నడుస్తుండడం గమనార్హం.
ఫ ప్రయాణికులకు నరకం
రైలుకు 19బోగీలు ఉండగా అందులో 12 ఏసీ బోగీలు ఉన్నాయి. మొత్తం అన్ని బోగీల్లోనూ విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఏసీలు ఆగిపోవడంతో ఆ బోగీల్లోని ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గాలి ఆడకపోవడంతో చిన్న పిల్లలు అవస్థలు పడ్డారు. సెల్‌ఫోన్లలో చార్జింగ్ అయిపోవడంతో ప్లాట్‌ఫాంపై ఉన్న సాకెట్లలో చార్జింగ్ పెట్టుకొన్నారు. కొన్ని బోగీల్లో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ప్యాంట్రీ కార్ (వంట బోగీ)లో కూడా విద్యుత్ నిలిచిపోవడంతో టీ తయారు చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు. రెండో ప్లాట్‌ఫాంపై ఉన్న స్టేషను మాస్టారు గది వద్ద గుమిగూడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ బంధువు హార్ట్ పేషెంట్ అని, అన్ని గంటలు ఏసీలు ఆగిపోవడంతో తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నారంటూ ఓ మహిళ స్టేషను మాస్టారు వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సైదయ్య, జీఆర్పీ ఎస్‌ఐ లోవరాజు తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్టేషను మేనేజర్ రంగనాథ్, సీటీఐ చంద్రమౌళి, సీసీఐ కల్యాణ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ సురేంద్ర, లోకో ఇన్‌స్పెక్టర్ లక్ష్మణరావు మరమ్మతు పనులను పర్యవేక్షించారు.