పట్టాలున్నాయి.. స్థలాలు చూపించండి
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:30 AM
తమకు పట్టాలిచ్చినా ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు చూపించలేదంటూ విలసవిల్లి రెవెన్యూ సదస్సులో పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు.
ఉప్పలగుప్తం, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): తమకు పట్టాలిచ్చినా ఇళ్లు కట్టుకునేందుకు స్థలాలు చూపించలేదంటూ విలసవిల్లి రెవెన్యూ సదస్సులో పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సలాది ఊర్మిళాసతీష్ అధ్యక్షతన మంగళవారం విలసవిల్లిలో రెవెన్యూ సదస్సు జరిగింది. గతంలో గ్రామంలోని 4.19ఎకరాల శివాలయం భూమిలో 135మందికి రెండేసి సెంట్ల వంతున ఇళ్ల నిర్మాణానికి కేటాయించారు. సకాలంలో గృహ నిర్మాణాలు జరగనందున స్థలాలు చేతులు మారాయి. అప్పట్లో అధికారులువేరే వారికి స్థలాలను బదలాయించారు. అయితే 40మంది మాత్రమే గృహాలు నిర్మించుకోగా మిగిలిన స్థలాలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుత సర్పంచ్ సలాది ఊర్మిళాసతీష్ శివాలయం కాలనీలో అర్హులకు స్థలాలు ఇస్తే బాగుంటుందని సూచించినా వైసీపీ పెద్దలు వేరే ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించారు. కాగా శివాలయం కాలనీలో తమ స్థలాలు చూపించాలంటూ కొందరు పట్టాలను తహసీల్దార్ దివాకర్‌కు చూపించారు. సర్వే చేయించి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్ చెప్పారు.