Share News

అనపర్తిలో ఇద్దరు ఫీల్ట్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌

ABN , Publish Date - Dec 20 , 2024 | 01:16 AM

గత పాలకులు ఉపాధి నిధులను పందికొక్కుల్లా మెక్కారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

అనపర్తిలో ఇద్దరు ఫీల్ట్‌ అసిస్టెంట్ల సస్పెన్షన్‌
పెడపర్తి, రామవరం ఫీల్డ్‌ అసిస్టెంట్లను ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అనపర్తి, డిసెంబరు 19 (ఆంద్రజ్యోతి) : గత పాలకులు ఉపాధి నిధులను పందికొక్కుల్లా మెక్కారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో గురువారం 17వ ఉపాధి హామీ సామాజిక ప్రజా వేదిక నిర్వహించారు. 2023-24 సంవత్సరంలో అనపర్తి మండలంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి ఈ నెల 10 నుంచి సోషల్‌ ఆడిట్‌ బృందం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలను తయారు చేశారు. గతే డాది కాలంలో మండలంలోని 11 గ్రామాల్లో రూ.8.40 కోట్ల నిధులు ఖర్చు చేయగా వీటిలో వేతనాలకు రూ.5.10 కోట్లు, మెటీరియల్‌ కోసం 3.30 కోట్లు ఖర్చు చేసినట్టు పీడీ నాగమహేశ్వరరావు తెలిపారు. పలు గ్రామాల్లో మస్తర్ల విషయంలో అవకతవకలు జరిగినట్టు గుర్తించారు. పెడపర్తి గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ బోడపాటి వినయ్‌ ప్రతాప్‌ తన తల్లి, సోదరుడి పేరున కూడా జాబ్‌ కార్డులు సృష్టించి రూ.2.05 లక్షలు కాజేసినట్టు గుర్తించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ స్వయంగా అవినీతికి పాల్పడినట్లు అధికారుల ఎదుట అంగీకరించాడు. రామవరం గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరెడ్డి విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్నందున ఇరువురిని సస్పెండ్‌ చేశారు. మస్తర్లతో కాజేసిన రూ.2.56 లక్షలు, పెనాల్టీ రూ.22 వేలు రికవరీ చేయాలని పీడీ ఆదేశించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో అవినీతి పెరిగిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఏపీవో రామ్‌ ప్రసాద్‌, ఖాదర్‌ బాషా, ఎంపీడీవో ఎం.రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌లు వారా కుమారి, గొల్లు హేమతులసి, కూటమి నాయకులు సిరసపల్లి నాగేశ్వరరావు, డీసీ చైర్మన్‌ తమలంపూడి సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 01:16 AM