సహకార వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలి
ABN , Publish Date - Nov 15 , 2024 | 01:52 AM
సహకార వ్యవస్థ బలో పేతానికి అందరూ కృషిచేయాలని కాకినాడ జిల్లా సహకార అధికారి(డీసీవో) జి.వెంకటకృష్ణ కోరారు.
కాకినాడ రూరల్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): సహకార వ్యవస్థ బలో పేతానికి అందరూ కృషిచేయాలని కాకినాడ జిల్లా సహకార అధికారి(డీసీవో) జి.వెంకటకృష్ణ కోరారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా సహకార సదన్, డీసీవో కార్యాలయం, నాగమల్లితోట జంక్షన్‌లోని డీసీసీబీలోనూ డీసీవో సప్తవర్ణ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 20 వరకు సహకార వారోత్సవాలు జరుగుతాయన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అంశంపై వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సహకార వ్యవస్థ ఏర్పడి 120 ఏళ్లు పైబడినా అనుకున్నంత ఫలితాలు సాధించలేదన్నారు. డీసీసీబీ సీఈవో నరసింహారావు మాట్లాడుతూ బ్యాంకు ద్వారా రైతునేస్తం కింద రూ.545 కోట్లు రుణాలిచ్చామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 298 పీఏసీఎస్‌ల ద్వారా 6.50 లక్షల మంది సభ్యులకు మెరుగైన సేవలందిస్తున్నామని తెలిపారు. సహకార వారోత్సవాలు ప్రాముఖ్యతపై వారోత్సవాల ఇన్‌ఛార్జ్ ఆదిమాలం వెంకటేశ్వరరావు వివరించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎమ్ సోము నాయుడు, డీసీసీబీ జీఎం పి.ప్రవీణ్‌కుమార్, డీఎల్‌సీవో దుర్గాప్రసాద్, డీజీఎం శ్రీధర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.