Share News

ట్యాంక్‌ బండ్‌లా.. గోదారి బండ్‌

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:07 AM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాజధాని హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ అంటే అద్భుతమైన పర్యాటక ప్రదేశం. అదే రీతిలో ఇప్పుడు రాజమహేంద్రవరం గోదావరి బండ్‌ తయారుకానుంది.

ట్యాంక్‌ బండ్‌లా.. గోదారి బండ్‌
రాజమహేంద్రవరంలో గోదావరి బండ్‌ రోడ్డు

  • భవిష్యత్‌లో రివర్‌ ఫ్రంట్‌ వ్యూ నిర్మాణం

  • రూ.70 కోట్లతో నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు

  • 2027 పుష్కరాల నాటికి మరింత ముస్తాబయ్యేలా చర్యలు

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 29: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి రాజధాని హైదరాబాద్‌లో ట్యాంక్‌ బండ్‌ అంటే అద్భుతమైన పర్యాటక ప్రదేశం. అదే రీతిలో ఇప్పుడు రాజమహేంద్రవరం గోదావరి బండ్‌ తయారుకానుంది. 2003 పుష్కరాలకు సుమారు కిలోమీటరు పొడవున రాజమహేంద్రవరం గోదావరి బండ్‌ రోడ్డును, పార్కులను, లైటింగ్‌ ట్రీలను, బోటింగ్‌ స్పాట్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు. అంతకు ముందు సాధారణ రివిట్‌మెంట్‌ వాల్‌ ఉండి రోడ్డు ఉండేది. అటుపై గోదావరి బండ్‌ రోడ్డును వెడల్పు చేసి అభివృద్ధి చేసి పార్కులు నిర్మించాక లుక్‌ మారింది. సర్‌ అర్థర్‌ కాటన్‌, మహాత్మజ్యోతిరావు పూలే, బాపు రమణలు, మహానటుడు ఎస్‌వీ రంగారావు, హాస్యనటుడు రాజబాబు, సుప్రసిద్ధ గాయకుడు ఘంటశాల, ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు, తొలితెలుగు ప్రధాని పీవీ నరసింహరావు, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు, ఉద్యమకారుడు సర్దార్‌ గౌతులచ్చన్న విగ్రహాలతోపాటు ఇటీవల హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య వంటి మహనీయులు, రచయితలు, కవులు, కళాకారులు, త్యాగధనుల విగ్రహాలతో కొలువుదీరింది. అయితే క్రమేపీ పార్కుల్లో లైటింగ్‌ ట్రీలు, ఫౌంటేన్‌ మరుగున పడ్డాయి. మళ్లీ 2027 పుష్కరాల నాటికి ముస్తాబు చేసే యోచనలో నగరపాలక సంస్థ ఉంది.

  • రివర్‌ ఫ్రంట్‌ వ్వ్యూ నిర్మాణానికి చర్యలు

రాజమహేంద్రవరం గోదావరి వెంబడి రివర్‌ ఫ్రంట్‌ వ్యూ నిర్మాణం చేస్తే ప్రస్తుతం ఉన్న గోదావరి బండ్‌ మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ మేరకు సుమారు రూ.70 కోట్ల ప్రతిపాదనలతో నిర్మాణానికి చర్యలు ఆరంభమయ్యాయి. రోడ్‌ కం రైలు బ్రిడ్జి నుంచి ప్రారంభమై సుమారు కిలోమీటరన్నర ప్రధాన మంచినీటి విభాగం దిగువ నుంచి పుష్కరాల రేవు వరకు రివర్‌ ఫ్రంట్‌ వ్యూను నిర్మించనున్నారు.

Updated Date - Sep 30 , 2024 | 12:07 AM