Share News

నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీ వినియోగించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 12:07 AM

నేర పరిశోధనలో కాలానుగుణంగా మారుతున్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తుల ఆట కట్టించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు.

  నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీ వినియోగించాలి

అమలాపురం టౌన్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నేర పరిశోధనలో కాలానుగుణంగా మారుతున్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తుల ఆట కట్టించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సూచించారు. నేరాల అదుపు కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన సీసీ టీవీ కెమెరాలకు అదనంగా ముఖ్యమైన చోట్ల పోలీసుల చొరవతో ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసుస్టేషన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఆరా తీశారు. నేర సమీక్షలో భాగంగా త్వరలో జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జిల్లాలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా నేర పరిశోధనలో టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా కేసులను ఎలా పరిష్కరించవచ్చో సోదాహరణంగా వివరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఏవీఆర్‌ పీబీ ప్రసాద్‌, అమలాపురం డీఎస్పీ టీఎస్‌ఆర్కే ప్రసాద్‌తో పాటు సీఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:07 AM