తేటగుంట శివాలయంలో దొంగల బీభత్సం
ABN , Publish Date - Jan 22 , 2024 | 12:51 AM
వరుస దొంగతనాలతో దుండగులు హడలెత్తిస్తున్నారు. ఏడాది కాలంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న తేటగుంట గ్రామంలో పలు ఆలయాల్లో దేవతామూర్తుల బంగారం, వెండి ఆభరణాలు, హుండీల చోరీ ఘటనలు మరువక ముందే ఆదివారంరాత్రి దుండగులు ఆలయాల్లో భీభత్సం సృష్టించారు.
హుండీల్లో నగదు, బంగారు ఆభరణాల చోరీ
తునిరూరల్, జనవరి 21: వరుస దొంగతనాలతో దుండగులు హడలెత్తిస్తున్నారు. ఏడాది కాలంలో జాతీయ రహదారి వెంబడి ఉన్న తేటగుంట గ్రామంలో పలు ఆలయాల్లో దేవతామూర్తుల బంగారం, వెండి ఆభరణాలు, హుండీల చోరీ ఘటనలు మరువక ముందే ఆదివారంరాత్రి దుండగులు ఆలయాల్లో భీభత్సం సృష్టించారు. మెట్టలో ప్రసిద్ధి ఆలయమైన తేటగుంట శివాలయంలో దుండగులు చొరబడ్డారు. ఆలయ ద్వారాలకు ఉన్న తాళాలు పగలకొట్టి గుడిలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు ధ్వంసం చేశారు. అనంతరం స్వామివారి గర్భగుడి తలుపులను తొలగించి అమ్మవారి మెడలోని మంగళసూత్రం, హుండీలను చోరీ చేశారు. అదేవిధంగా శివాలయం ప్రక్కనే గల సాయిబాబా ఆలయంలో ఈ తరహాలోనే చోరీకి పాల్పడిఅక్కడహుండీలోని నగదును అపహరించారు. దీంతో స్వామి వారి మేలుకొల్పు పూజకు ఆలయాలకు వెళ్లిన అర్చకులు చెల్లా చెదురుగా ఉన్న వస్తువులను చూసి ఖంగుతిన్నారు. దీంతో ఆలయ కమిటీలకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇటీవల గ్రామంలో వరుస దొంగతనాలతో ఆలయాలకు రక్షణ కరువైందని రెండేళ్లలో శివాలయంలో మూడుసార్లు ఆలయంలో దొంగలు ప్రవేశించి ఆలయ సంపదను చోరీ చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు చర్యలు చేపట్టి దొంగలను పట్టుకుని ఆలయాలకు రక్షణ కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులు తెలుపుతున్నారు.