Share News

రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

ABN , Publish Date - May 31 , 2024 | 12:39 AM

చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పిల్లి ధరణిసత్య (23) మృతిచెందింది.

 రైలు ఢీకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

తాళ్లరేవు, మే 30: చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయునిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పిల్లి ధరణిసత్య (23) మృతిచెందింది. యువతి మృతితో తాళ్లరేవు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. పిల్లి ఏడుకొండలు, ఈశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ధరణిసత్య, పావనిశ్రీహిత, భవానిశ్రీభవ్య ఉన్నారు. కూలి పనులు చేసుకుని ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. పెద్దకుమార్తె ధరణిసత్య బీటెక్‌ పూర్తి చేసి 8 నెలల క్రితం చెన్నైలోని పెరుంగళతూర్‌ సదన్‌ల్యాండ్‌ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. స్నేహితులతో అక్కడే నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తుంది. బుధవారం ఉదయం 5.30 గంటలకు డ్యూటీకీ తన స్నేహితులతో వెళుతూ లోకల్‌ ట్రైన్‌ దిగి పెరుంగళతూర్‌ ప్రాంతంలో రైల్వేట్రాక్‌ దాటుతుండగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ధరణిసత్యను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సెల్‌ఫోన్‌ ఆధారంగా ఇంటికి ప్రమాద సమాచారం తెలియజేశారు. కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు చెన్నై వెళ్లారు. చెన్నై క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తాళ్లరేవుకు తరలిస్తున్నారు.

Updated Date - May 31 , 2024 | 12:39 AM