11 మంది ట్రైనీ ఐఏఎస్‌ల పరిశీలన
ABN , Publish Date - Nov 11 , 2024 | 01:15 AM
ఫీల్డ్‌స్టడీ అండ్ రీసెర్చి ప్రోగ్రాం (ఎఫ్‌ఎస్‌ఆర్‌పీ) 99వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు 11 మంది ఆదివారం రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు.
రాజమహేంద్రవరం అర్బన్/సిటీ, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఫీల్డ్‌స్టడీ అండ్ రీసెర్చి ప్రోగ్రాం (ఎఫ్‌ఎస్‌ఆర్‌పీ) 99వ ఫౌండేషన్ కోర్సులో భాగంగా ట్రైనీ ఐఏఎస్‌లు 11 మంది ఆదివారం రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించారు. అర్బన్ హెల్త్ సెంటర్‌లో రోగులకు, గర్భిణులు తదితరులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ల్యాబ్‌ను సందర్శించి అక్కడ నిర్వహించే పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఫార్మసీలో మందుల స్టాకు వివరాలు, గడువు దాటిన మందుల విషయంలో తీసుకుంటున్న చర్యలు తదితర వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న అర్బన్ హెల్త్ సెంటర్లలో అందిస్తున్న వైద్యసేవల గురించి ట్రైనీ ఐఏఎస్‌లకు వివరించారు. ముందుగా, ఓపీ వివరాల నమోదు చేసి వాటిని ఆన్‌లైన్‌లో ఉంచుతామని, అనంతరం అవసరమైన వైద్యసేవలందిస్తామని తెలిపారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ను సందర్శించారు. నగరపాలక సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై కమిషనర్ కేతన్ గార్గ్ అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విపులంగా వివరించారు. ఈట్ రైట్ క్యాంపైన్ ద్వారా చేపట్టిన ఆహార విక్రయకేంద్రాల తనిఖీలు, శానిటేషన్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల వివరాలు, నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కేంద్రాలను ఈ బృందం సందర్శించారు. అనంతరం ఇన్నీసుపేటలోని పీహెచ్‌సీని పరిశీలించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, డాక్టర్ హరిబాబు, డాక్టర్ షమ్మీకుమార్, ఎపిడమాలజిస్ట్ సుధీర్, అర్బన్ హెల్త్ విజిటర్ విజయకుమారి,డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, ఎస్‌ఈ జి.పాండురంగారావు, సిటీ ప్లానర్ కోటయ్య పాల్గొన్నారు.