Share News

యువ కలెక్టర్ల పల్లె బాట

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:34 AM

విధ రాషా్ట్రలకు చెందిన పది మంది ట్రైనీ కలెక్టర్లు రెండు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో పర్యటించారు. రెండు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరుతెన్నులను పరిశీలించారు.

యువ కలెక్టర్ల పల్లె బాట
జేగురుపాడులో సంపద తయారీ కేంద్రాన్ని సందర్శిస్తున్న ట్రైనీ కలెక్టర్లు

కడియం మండలం జేగురుపాడు, పొట్టిలంకల్లో క్షేత్ర స్థాయి పర్యటన... సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరుతెన్నులు పరిశీలన

కడియం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): వివిధ రాషా్ట్రలకు చెందిన పది మంది ట్రైనీ కలెక్టర్లు రెండు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణలో భాగంగా మంగళవారం తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో పర్యటించారు. రెండు బృందాలుగా ఏర్పడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల తీరుతెన్నులను పరిశీలించారు. ఓ బృందం జేగురుపాడు గ్రామాన్ని సందర్శించగా మరో బృందం పొట్టిలంకలో పర్యటించింది. జిల్లా, మండల స్థాయి అధికారులు వారి వెంట ఉండి ఏఏ పథకాలు ఎలా అమలవుతున్నాయో ప్రత్యక్షంగా చూపించారు. తొలుత జేగురుపాడులో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించిన అనురాగ్‌ బాబెల్‌ (టీమ్‌ లీడర్‌), ప్రియారాణి, ఎస్‌.బేగం, పారత్‌, కె.భక్షి బృందానికిసర్పంచ్‌ యాదల సతీష్‌చంద్రస్టాలిన్‌, ఉప సర్పంచ్‌ పాతూరి రాజేష్‌, ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ స్వాగతం పలికారు. అక్కడ చెత్త సేకరణ, వర్మీకంపోస్టు తయారీ, సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని పరిశీలించారు. వాటి పనితీరును జిల్లా పంచాయతీ అధికారి ఎం.నాగలత, డీఆర్డీఏ పీడీ మూర్తి, ఎంపీడీవో రమేష్‌, ఏవో సుబ్బారావు, ఈవోపీఆర్డీ రాంప్రసాద్‌ వివరించారు. అనంతరం రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఏ విధంగా సహకారం అందిస్తున్నామో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.మాధవరావు డిజిటల్‌ బోర్డు ద్వారా వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులు, గర్భిణులకు ఆహారాన్ని ఎలా అందిస్తున్నారో పీడీ కె.విజయకుమారి ద్వారా తెలుసుకున్నారు. పిల్లలకు పెడుతున్న ఆహార పదార్థాలను రుచి చూశారు. గర్భిణులకు సామూ హిక సీమంతం చేశారు. ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఈ బృందానికి డాక్టర్‌ జ్యోత్స్న గ్రామ స్థాయిలో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. అనంతరం సచివాలయానికి చేరుకుని ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను పరిశీలించి విద్యా విధానంపై ఆరా తీశారు. డ్వాక్రా మహిళలతో సమీక్షించి రుణ సదుపాయం, వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాల్లో వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ పథకాల వివరాలను డిజిటల్‌ స్ర్కీన్‌పై ఆయా శాఖల అధికారులు ట్రైనీ కలెక్టర్లకు వివరించారు.

పొట్టిలంకలో ట్రైనీ కలెక్టర్లు నిరంజన్‌ జయదేవరావు (అసిస్టెంట్‌ టీమ్‌ లీడర్‌), టి.నాగి, ఎ. మిశ్రా, స్నేహ పన్నా పర్యటించారు. వారికి సర్పంచ్‌ కొత్తపల్లి సత్యవతి, వైస్‌ ఎంపీపీ కలిదిండి విశాలాక్షి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. డీఎల్డీవో వీణాదేవి, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుజాతకుమారి, వ్యవసాయ శాఖ ఏడీ టీవీఎస్‌ రెడ్డి, సీడీపీవో కనకవల్లి బృందం వెంట ఉండి ప్రభుత్వ పథకాల అమలు తీరుతెన్నులను వివరించారు. స్థానికులు, లబ్ధిదారులతో మాట్లాడించారు.

Updated Date - Nov 13 , 2024 | 12:34 AM