Share News

విఘ్నాలు తొలగించేసిద్ధి వినాయకుడు

ABN , Publish Date - Sep 09 , 2024 | 01:26 AM

కోరిన కోర్కెలు తీర్చే దైవం. విఘ్నాలు తొలగించే అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 3.45 నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు.

విఘ్నాలు తొలగించేసిద్ధి వినాయకుడు
విశేష అలంకారంలో శ్రీసిద్ధివినాయకుడు, బారులు తీరిన భక్తులు

అయినవిల్లి, సెప్టెంబరు 8: కోరిన కోర్కెలు తీర్చే దైవం. విఘ్నాలు తొలగించే అయినవిల్లి శ్రీవిఘ్నేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వినాయక చవితి సందర్భంగా ఉదయం 3.45 నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో రుద్రాభిషేకం, లక్ష దూర్వార్చన, గణపతి కల్పం, శ్రీలక్ష్మీగణపతి హోమం నిర్వహించారు. మూషిక వాహనంపై శ్రీస్వామివారికి మాడవీధిసేవ అనంతరం స్వామివారికి విశేష అలంకరణ జరిపారు. పంచ హారతులు ఇచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. క్యూలైన్లు, రహదారులు భక్తులతో కిక్కిరిశాయి. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో సహాయ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు స్వాగతం పలికారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేదాశీర్వచనం చేశారు.

జోరువానలో భక్తుల జోరు..

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం జోరువానలో అధికసంఖ్యలో భక్తులు అయినవిల్లి సిద్ధివినాయకుడిని దర్శించుకున్నారు. వినాయక చవితి రోజున 25వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 10వేల మంది భక్తులు అన్నప్రసాద ట్రస్టులో అన్నప్రసాదం స్వీకరించారు. ఉచిత దర్శనాలు కల్పించడం పట్ల భక్తులు హర్షం వక్తం చేశారు.

చెవిలో చెబితే కోర్కెలు తీర్చే లక్ష్మీగణపతి

అంగరంగ వైభవంగా చవితి వేడుకలు

బిక్కవోలు, సెప్టెంబరు 8: చెవిలో చెబితే కోర్కెలు నెరవేర్చే స్వామిగా పేరొ ందిన తూర ్పుగోదావరి జిల్లా బిక్కవోలులో ఉన్న లక్ష్మీగణపతి ఆల యంలో చవితి ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారంరాత్రి 1-59కు తీర్ధపుబిందె సేవతో స్వామివారికి ఉత్సవకమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబారెడ్డి, కమిటీ సభ్యులు పాలచర్ల శివప్రసాద్‌చౌదరి దంపతులు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. శనివారం ఉదయం 10-29కు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు, కుమారుడు మనోజ్‌, కుమార్తె డాక్టర్‌ సనాతనిలతో కలసి కలశస్థాపనచేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తూర్పుచాళుక్యులు ఏర్పాటుచేసిన ఈ లక్ష్మీగణపతి ప్రాశస్తం దేశం అంతా తెలిసేలా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఇప్పటికే దేవదాయశాఖ రూ. 3కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా వుందని, దీనికి జతగా గ్రామస్తులు రూ.2కోట్లు సమకూరుస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్‌ పథకం ద్వారా మరిన్ని నిధులు తీసుకువచ్చి బిక్కవోలు, గొల్లలమామిడాలోని ఆలయాలను అభివృద్ధి చేసి టెంపుల్‌ టూరిజంగా మారుస్తామని ఆయన వివరించారు. తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌వారు స్వామికి 50కిలోల లడ్డూను బహూకరించారు. స్వామి వారిని దర్శించిన ప్రముఖుల్లో జనసేన నియోజవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, డీ అండ్‌ హెచ్‌ఎం వెంకటేశ్వరరావు, కూటమి నేతలు పల్లి శ్రీనివాసరెడ్డి, రావాడ నాగు, ఇందల వీరబాబు, పవన్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్‌ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా స్వామి దర్శనాలు కల్పించారు. అనపర్తి సీఐ శివగణేష్‌ ఆధ్వర్యంలో 25 మంది పోలీసులతో బిక్కవోలు ఎస్‌ఐ రవిచంద్రకుమార్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఘనంగా శ్రీపాద వల్లభుని జయంతి

ముగిసిన సప్తాహా మహోత్సవాలు

పిఠాపురం, సెప్టెంబరు 8: శ్రీపాదవల్లభుని జన్మస్థానంగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కాకినాడజిల్లా పిఠాపురంలోని శ్రీపాదశ్రీవల్లభ మహాసంస్థానంలో శ్రీపాదుని జయంతిని ఘ నం గా నిర్వహించారు. శ్రీపాదశ్రీవల్లభులు, దత్తాత్రేయస్వామి, నృసింహసరస్వతులను పుష్పాలు, మారేడు దళాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు, పూలంగి సేవ, అభిషేకాలు జరిగాయి. మహాగణపతి పూజ, స్వామి దివ్యపాదపద్మములకు మహాన్యాసపూర్వక శత రుద్రాభిషేకం, సర్వపుష్పపూజ, శ్రీసూక్త, పురుష సూక్తములతో సహస్రనామార్చన, మంగళహారతి, వేదపారాయణ, రుత్విక్కులచే దత్త మూలమంత్ర అనుష్టానము, గురుచరిత్ర పారాయణ, శ్రీపాదశ్రీవల్లభ చరితామృత పారాయణం జరిగాయి. సాయంత్రం అగ్ని ప్రతిష్ఠాపన, దత్తమంత్రహోమం, సాయంకాల అర్చన నిర్వహించారు. హోమానికి పూర్ణాహుతి జరిగింది. రాత్రి శ్రీపాదశ్రీవల్లభుల రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులకు మహాన్నప్రసాద వితరణ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. వారంరోజులపాటు జరిగిన జయంతి ఉత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్‌.సౌజన్య ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Updated Date - Sep 09 , 2024 | 01:26 AM