మురుగుపోయే దారేదీ..!
ABN , Publish Date - May 25 , 2024 | 12:05 AM
పంట పొలాల్లో ముంపు నీరు ఎప్పటికప్పుడు పారేలా గోరింకల డ్రెయిన్లు ఏర్పాటయ్యాయి. కానీ అవి నేడు పూర్తిగా పూడుకుపోయాయి.
తూడు, గుర్రపుడెక్క వ్యర్థాలతో పూడుకుపోయిన డ్రెయిన్లు
వర్షాల సమయంలో పంట నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన
కనీసం కానరాని ఆధునికీకరణ
రావులపాలెం, మే 24: పంట పొలాల్లో ముంపు నీరు ఎప్పటికప్పుడు పారేలా గోరింకల డ్రెయిన్లు ఏర్పాటయ్యాయి. కానీ అవి నేడు పూర్తిగా పూడుకుపోయాయి. మినీ మురుగు డ్రెయిన్లకు అక్కడక్కడా ఉపాధి కూలీలతో పనులు చేయిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం, అలసత్వమో తెలియదు కానీ పైపై చెత్తాచెదారాలను మాత్రమే తొలగించి ఆధునికీకరణ చేస్తున్నామని చెప్పడంపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వర్షాల సమయంలో పంట పొలాలు ముంపు బారిన పడితే మురుగునీరు ముం దుకు సాగక పంటలు దెబ్బతింటాయి. ఖరీఫ్ నారుమడుల సమయం నుంచీ వర్షాలు కురుస్తూంటాయి. నాట్లు వేసిన నాటి నుంచి ఖరీఫ్ సీజను మొత్తం అల్పపీడనాలు, రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసి పొలాలు ముంపు బారిన పడుతుంటాయి. ఆ సమయంలో పొలాల్లోని ముంపునీరు ప్రధాన మురుగు డ్రెయిన్ల ద్వారా వెళ్లాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా వాటి ఆధునికీకరణకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంతో పంట పొలాలు ముంపుబారిన పడి నాట్లు సైతం దెబ్బతింటున్నాయంటూ పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కొంతమేర ఆధునికీకరిస్తున్నారు. రావులపాలెం మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మురుగు డ్రెయిన్లు డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి. ముం దస్తు ప్రణాళిక రూపొందిచాల్సిన ఆ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు.