యువరైతు మృతికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత
ABN , Publish Date - Feb 24 , 2024 | 12:19 AM
న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండను సాగించడంతో యువ రైతు మృతిచెందాడని, దీనికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని పలు కార్మిక సంఘాలు, రైతు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాల నేతల నిరసన
రాజమహేంద్రవరం అర్బన్, ఫిబ్రవరి 23: న్యాయమైన హక్కుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటంపై మోదీ ప్రభుత్వం దమనకాండను సాగించడంతో యువ రైతు మృతిచెందాడని, దీనికి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని పలు కార్మిక సంఘాలు, రైతు, ప్రజాసంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం శ్యామలాసెంటర్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, ఏపీ రైతు సంఘం, ప్రజాసంఘాలు, సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ పార్టీల ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కె.రాంబాబు, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతు ఉద్యమంపై మోదీ ప్రభుత్వం దాడిని అందరూ ఖండించాలని, రైతాంగాన్ని కార్పొరేట్లకు బానిసలుగా చేసే బీజేపీని చిత్తుగా ఓడించాలన్నారు. మొదటి దశ రైతు ఉద్యమం సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే రెండవ దఫా రైతు ఉద్యమం ప్రారంభమైందని వివరించారు. యువరైతు మృతిపై న్యాయవిచారణ జరిపించాలని, రైతులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, సీపీఐ ఎంఎల్ నగర కార్యదర్శి ఎస్.కిరణ్‌కుమార్, నాయకులు పవన్, టీఎస్ ప్రకాష్, ఎస్‌ఎస్ మూర్తి, నల్ల రామారావు, సావిత్రి, భానుప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.